పార్టీని అమ్ముకోడానికి సిగ్గు లేదూ?
చిరంజీవిపై ప్రజారాజ్యం కార్యకర్త మండిపాటు
‘ప్రజలను ఎక్కడికో తీసుకెళతానంటూ.. ప్రజారాజ్యం పేరుతో పార్టీ పెట్టి, అభిమానుల మనోభావాలను కాంగ్రెస్‌కు అమ్ముకున్నావ్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చావు?’ అంటూ ప్రజారాజ్యం కార్యకర్త కె.బాబ్జీ కేంద్ర మంత్రి చిరంజీవిపై విరుచుకుపడ్డాడు. ‘నేను ఇప్పటికీ ప్రజారాజ్యం పార్టీకి కట్టుబడి, అదే గుర్తింపు కార్డుతో కార్యకర్తగా కొనసాగుతున్నాను. కానీ నువ్వు మాత్రం అధ్యక్షుడి స్థానంలో ఉండి పార్టీని అమ్ముకోవడానికి సిగ్గులేదూ?’ అని ప్రశ్నించాడు.
‘నీకు సిగ్గు రావాలనే ఉద్దేశంతో.. నీ పార్టీ ఇచ్చిన గుర్తింపు కార్డును నీ కళ్లముందే చింపేస్తున్నాను..’ అంటూ ఆవేశంగా తన పర్సులో ఉన్న కార్డును తీసి చింపేశాడు. అనంతరం ‘పవన్‌కల్యాణ్ జిందాబాద్, జనసేన వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశాడు. దీంతో బిత్తరపోవడం చిరంజీవి వంతరుు్యంది. ఏపీ కాంగ్రెస్ నాయకుల బస్సుయాత్రలో భాగంగా శనివారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్ మూడు రోడ్ల కూడలిలో చిరంజీవి ప్రసంగిస్తుండగా.. కొత్తపల్లి మండలం కొండెవరానికి చెందిన బాబ్జీ అడ్డుపడ్డాడు. కేంద్రమంత్రులు పల్లంరాజు, పనబాక లక్షి, జె.డి.శీలం, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరుల సమక్షంలోనే చిరంజీవిని నిలదీశాడు.
దీంతో ఆయన ప్రసంగాన్ని అర్ధంతరంగా ఆపి బస్సు ఎక్కేశారు. ఇదిలా ఉండగా పిఠాపురం వచ్చిన కాంగ్రెస్ నాయకుల ప్రసంగాలను వినేందుకు జనం కరువయ్యారు. కనీసం వందమంది కూడా లేకపోవడంతో నేతలు తూతూ మంత్రంగా ప్రసంగాలు ముగించారు.