బాలీవుడ్ కల చెదిరింది
బాలీవుడ్ హీరోయిన్లు దక్షిణాదిపై ఆసక్తి కనబరుస్తున్నారన్నది పక్కనపెడితే ఇక్కడి కథానాయికలకు బాలీవుడ్ అనేది పెద్ద కలగా మారింది. ఇలియానా, కాజల్, తమన్న వంటి ఉత్తరాది భామలకు కూడా దక్షిణాదిలో పేరు సంపాదించుకున్న తరువాతే బాలీవుడ్ కాలింగ్ బెల్ మోగింది. హిందీ చిత్రాల్లో నటిస్తే ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ లభిస్తుంది. చాలా మంది దక్షిణాది హీరోయిన్ల మాదిరిగానే నటి ప్రణీతకు బాలీవుడ్‌పై వ్యామోహం పెరిగింది. లక్కీగా అవకా శం వచ్చిం ది. అయి తే ఆ వెంటనే దురదృష్టం వెంటాడడంతో దోబూచులాడిన అవకాశం చివరికి దూరం అయ్యింది. తమిళంలో కార్తీకి జంటగా శకుని చిత్రంలో నటించిన ప్రణీతకు ఆ చిత్రం నిరాశ పరచింది. మాతృభాష కన్నడంలో నటిస్తున్న ఈ బ్యూటీకి తెలుగులో అత్తారింటికి దారేది మంచి పేరు తెచ్చిపెట్టింది.
దీంతో బాలీవుడ్‌కు ఎగబాకే అవకాశం వచ్చింది. ధీరజ్ పాండే దర్శకత్వంలో అక్షయ్ కుమార్ సరసన నటించడానికి అదృష్టం వరించే హీరోయిన్ల పట్టికలో ప్రణీత పేరు చోటు చేసుకుంది. అడిషన్‌కు రమ్మని కబురందడంతో ప్రణీత తన తల్లిని తోడుగా తీసుకుని ముంబాయికి వెళ్లింది. అయితే అక్కడ చెప్పిన సమయానికి అడిషన్‌కు హాజరు కాకపోవడంతో దర్శకుడు ఆగ్రహానికి గురయ్యారు. అసలే మూడు పాడయిన దర్శకుడు వెంటనే హిందీ సంభాషణ పేపర్ ఇచ్చి ప్రణీతను చెప్పమన్నారట. హిందీ సంభాషణలను సరిగా చెప్పలేక తత్తరపడటంతో దర్శకుడు ప్రణీతను రిజెక్టెడ్ అన్నారట. ఈ దర్శకుడు ఇంతకు ముందు స్పెషల్ 26 చిత్రం ద్వారా కాజల్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేశారు. అలా ఎన్నో ఆశలతో ముంబాయికి పరిగెత్తిన ప్రణీత కల స్వయం కృతాపరాధంతో చెదిరింది. చేతికి వచ్చిన అన్నం నోటి వరకు రాలేదంటే ఇదేనేమో.