సహృదయులు
వృద్ధులకు సేవలందిస్తున్న ముస్లిం దంపతులు
తొమ్మిదేళ్లుగా నిర్విరామంగా సపర్యలు
కన్నవారికి దూరమైన వారికి ఆసరా
పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న జంట
మలి వయసులో కన్నవారి నుంచి దూరమైన పండుటాకులను చేరదీసి వారు సేవలందిస్తున్నారు. ‘ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులే మిన్నా’ అనే సూక్తితో తొమ్మిదేళ్లుగా నిర్విరామంగా సపర్యలు చేస్తున్నారు. సమాజసేవకు కులం, మతం అడ్డురాదని.. మంచి మానవత్వం ఉం టే చాలని చెబుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ముస్లిం దంపతులు చోటు, యాకుబీ దం పతుల సేవాస్ఫూర్తిపై ప్రత్యేక కథనం.
కాజీపేట : ప్రతి ఒక్కరి జీవితంలో వృద్ధాప్యం తప్పనిసరి. నేటి ఆధునిక యుగంలో మలి వయసులో ఉన్న కన్న వారి బాగోగులు చూసే పిల్లల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. దైనందిన జీవితంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేగాని రోజులు గడవని పరి స్థితులు ఉన్నాయి. దీంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా వృద్ధులైన తల్లిదండ్రుల యోగక్షేమాలు చూసే వారి సం ఖ్య తగ్గిపోతుంది.
అయితే వృద్ధాప్యంలో కుటుంబసభ్యుల ఆదరణ కరువై అవస్థలు పడుతున్న పండుటాకులకు ఆసరాగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా ఉంటున్నారు ఈ ముస్లిం దంపతులు. వివరాల్లోకి వెళితే.. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామా నికి చెందిన ఎండీ.మహబూబ్అలీ అలియాస్ చోటు, యాకూబీ దంపతులు 2007లో కాజీపేట 51వ డివిజన్ ప్రశాంత్‌నగర్‌లో సహృదయ అనాథాశ్రమాన్ని నెలకొల్పి వయోభారంతో ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు సేవలందిస్తున్నారు. తొలుత ఇద్దరితో మొదలైన ఆశ్రమం నేడు 70 మందికి ఆశ్రమం కల్పిస్తోంది.
ఆశ్రమ స్థాపనకు ప్రేరణ ఇదే..
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలానికి చెందిన ఓ వృద్ధురాలు బాగా బతికి.. ఆ తర్వాత దుర్భర పరిస్థితికి చేరింది. దీంతో కుటుంబ సభ్యులు ఆదరించకపోవడంతో భిక్షాటన చేయడం ఇష్టంలేక బస్టాండ్ పైనుంచి పడి మరణించింది. ఈ ఘటన ‘చోటు’ హృదయాన్ని కలిచివేసింది. నా అనేవాళ్లు లేని అనాథ వృద్ధులకు సాయం చేయాలేమా అని చోటుకు వచ్చిన ఆలోచనకు కార్యరూపమే ‘సహృదయ’ ఆశ్రమం ప్రారంభించేందుకు నాంది పలికింది. తామే సొంతంగా ఆశ్రమాన్ని నెలకొల్పి సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన నిర్ణయించుకున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన చోటు.. తన భార్య యాకుబీకి మనసులోని మాటను చెప్పారు. కష్టాసుఖాలను వివరించడంతో ఆమె సమ్మతిని ప్రకటించడమే తరువాయి తనకు వచ్చిన వాటా ధనంతో ఆశ్రమానికి రూప కల్పన చేశారు.
అన్ని తామై..
తొలినాళ్లలో ఆశ్రమంలో ఇద్దరు, ముగ్గురుకు మించి వృద్ధులు ఉండేవారు కాదు. ప్రస్తుతం ఆ సంఖ్య 70కి చేరింది. చోటుతో పా టు ఆయన భార్య యాకుబీ, పిల్లలు, తల్లి ఆశ్రమంలోని వృద్ధులకు నిత్యం సేవలందిస్తున్నారు. ఎవరి ఆదరణలేని వారిని, పిల్లలను, వృద్ధులను చేర్చుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడి వారికి ఇక్కడ ఉచితంగా వైద్యసేవలు అందించి వారి బాగోగులు చూస్తున్నారు. ఇక్కడ ఆరుగురు అపస్మారక స్థితిలో ఉన్నారు. కొందరు పక్షపాతంతో బాధపడుతున్నారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు వంట చేసే బాధ్యతను యాకుబీ కుటుంబ సభ్యులు తీసుకుంటుండగా, 8మంది పని మనుషులు వృద్ధులకు తల దువ్వడం, స్నానం చేయించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఆశ్రమ నిర్వహణ ఖర్చులు ఇలా...
ఆశ్రమానికి దాతలు పెద్దగా సాయం చేసింది ఏమీ లేదు. పండుగలు, పుట్టిన రోజు వేడుకలు జరిగినప్పుడు మాత్రమే ఆశ్రమానికి వచ్చి కొద్దిగా సాయం చేస్తుంటారు. కాగా, నిర్వహణ ఖర్చులు పూర్తిగా చోటు దంపతులే భరిస్తున్నారు. ఆశ్రమంలోని మూడు మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్బాక్స్లను అద్దెకు ఇస్తున్నారు. వీటిని నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు కిరాయిలకు తీసుకెళ్లడం ద్వారా వచ్చే ఆదాయం ఆశ్రమ నిర్వహణకు ఉపయోగపడుతుంది. ఫ్రీజర్బాక్స్లతో పాటు అంబులెన్స్‌లు, టాటా ఏసీ వ్యానులు నిర్వహించి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా నడిపిస్తున్నారు.
వృద్ధులకు అంత్యక్రియలు ఇక్కడే..
పిల్లల ఆలనా పాలనకు దూరమై ఆశ్రమంలో సేదతీరుతున్న వృద్ధులు మరణిస్తే వారికి యాకుబీ, చోటులే.. కొడుకు, కూతురి గా మారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ముస్లిం మతస్తులైనప్పటికీ ఆశ్రమంలో మరణించిన వృద్ధులకు హిందూ సంప్ర దా య పద్ధతిలో తలకొరివి పెట్టి పలువురిచే శభాష్ అనిపించుకుంటున్నారు. ఆశ్రమం ప్రారంభించిన 9 ఏళ్ల కాలంలో 12 మంది మరణించగా వీరే కర్మకాండలు పూర్తి చేశారు. కాగా, పిల్లలతో గొడవపడి వచ్చే వృద్ధులు, వారి కుటుంబ సభ్యులకు న్యాయవాది వీరమల్ల వెంకటేశ్వర్రావుతో తరచూ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే వృద్ధుల కాలక్షేపం కోసం విలువైన పుస్తకాలు సమకూర్చారు. ప్రభుత్వ క్షమాభిక్షతో ఇటీవల విడుదల చేసిన నలుగురు ఖైదీలకు చోటు జరిమానా డబ్బులను చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్నాడు.
వైద్యసేవలు ముమ్మరం
నగరంలోని దత్తాశ్రమం నుంచి పలువురు వైద్యులు తరచూ ఆశ్రమానికి వచ్చి వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందిస్తుంటారు. సైక్రియాటిస్టు రామారావు, డాక్టర్లు రాంరెడ్డి, భిక్షపతి వైద్య సాయంలో చేయూతనందిస్తున్నారు. చనిపోయిందని వదిలేసిన మాచపత్రి రాజమ్మ అనే వృద్ధురాలిని ఆశ్రమంలో చేర్పించి బతికించడం ఆనందంగా ఉందంటారు ఆశ్రమ నిర్వాహకుడు చోటు.
వృద్ధాప్యం.. శాపం కావొద్దు
వృద్ధాప్యం శాపం కారాదనే లక్ష్యంతో ఆశ్రమాన్ని నెలకొల్పి ఉచితంగా సేవలందిస్తున్నాం. మాకు ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. ఇద్దరు చదువుకుంటూ మాతోపాటు వృద్ధులకు సేవలందిస్తుంటారు. ఉన్నంతలో తోటివారికి సాయం అందిస్తే మానవ జీవితానికి సార్థకత లభిస్తుందనే భావనతోనే ఇంటిల్లిపాదీ కలిసి సపర్యలు అందిస్తున్నాం. మా పిల్లలు ఇద్దరినీ ఆశ్రమ నిర్వహణ వైపే నడిపిస్తున్నాం. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం.
–ఎండీ చోటు, యాకుబీ, ఆశ్రమ నిర్వాహకులు
కంటికి రెప్పలా చూసుకుంటున్నారు
నేను రెండేళ్లుగా ఆశ్రమంలో ఉంటున్నాను. నన్ను ఇక్కడి వారంతా కంటికిరెప్పలా చూసుకుంటున్నారు. కుటుంబసభ్యు లు పట్టించుకోకపోవడంతో అందరు ఉన్నా ఎవరూలేని దానిలా బతుకుతున్నా. అయినా నాలో ఎలాంటి బాధ లేదు.
–ఖాజాబీ, వృద్ధురాలు
ఉచితంగా వైద్యసేవలు పొందుతున్నా...
మాది కరీంనగర్ జిల్లా మల్లాపూర్ గ్రామం. కనిపెంచిన ఒక్కగానొక్క కొడుకు బతుకుదెరువు నిమిత్తం ఆంధ్రా ప్రాంతానికి వలస వెళ్లాడు. నేను వెంట ఉంటే భారంగా భావించి ఇక్కడే వదిలేసి వెళ్లాడు. మా సర్పంచ్ నా బాధను చూడలేక ఆశ్రమంలో చేర్పించాడు. అనారోగ్యంతో బాధపడే నేను ఆశ్రమంలో ఉచితంగా వైద్యం పొందుతున్నాను.
–కాంతమ్మ, ఆశ్రమంలో వృద్ధురాలు