అద్భుత సమాజం కోసం...
మనుషుల మధ్య తిరుగుతున్న మదమృగాలకు ఎలాంటి శిక్ష విధించాలి? స్త్రీ స్వేచ్ఛకు భంగం వాటిల్లని అద్భుత సమాజాన్ని ఎలా నిర్మించాలి? అనే సామాజిక స్పృహ కలిగిన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిఘటన’. చార్మి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. కీరవాణి, యశ్వంత్‌నాగ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. విద్యార్థిని అనూషా ఆడియో సీడీని ఆవిష్కరించి, సుద్దాల అశోక్‌తేజకు అందించారు. స్ఫూర్తినిచ్చే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించానని, ఈ పాత్రకు చార్మీని ఎంచుకున్నందుకు తగిన న్యాయం చేసిందని భరద్వాజ్ చెప్పారు. అమ్మాయిలపై చేయివేస్తే అబ్బాయిల గుండె ఆగిపోవాల్సిందేనని చెప్పే సినిమా ఇదని చార్మీ అన్నారు. ప్రేక్షకులకు ఇది అగ్ని ప్రాసన లాంటి సినిమా అని సుద్దాల అశోక్‌తేజ అన్నారు. రేష్మ, రఘుబాబు, లక్ష్మీభూపాల్ కూడా మాట్లాడారు.