pre poll surveys
-
బైడెన్‌కే జై అంటున్న ప్రీ పోల్స్..
వాషింగ్టన్: ప్రపంచ దేశాలన్ని అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల కోసం ఆత్రతుగా ఎదురు చూస్తున్నాయి. మరి కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. అయితే, ఈసారి ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల మధ్య జరుగుతున్న నేపథ్యంలో ఫలితాల వెల్లడి కొంచెం ఆలస్యం కావొచ్చని నిపుణుల అభిప్రాయం. కరోనా భయంతో అమెరికన్లు ముందస్తు ఓటింగ్‌కే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. మెయిల్ ఇన్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ల ద్వారా మొత్తం 24 కోట్ల మంది రిజిస్టర్ ఓటర్లలో.. సుమారు 10 కోట్ల మంది ముందస్తుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే... ఇప్పటికే చాలా సర్వేలు రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ ముందంజలో ఉన్నట్లు వెల్లడించాయి. ఇక తాజాగా వెలువడిన సీఎన్ఎన్ పోల్స్ ఫలితాల్లో బైడెన్ ఏకంగా 10(పది శాతం) పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడించింది. సీఎన్ఎన్ పోల్స్ ప్రకారం బైడెన్‌కు 52 శాతం, ట్రంప్ 42 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని తెలిసింది. సర్వేలన్ని బైడెన్‌కే అనుకూలం.. సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్, ఫాక్స్ న్యూస్ పోల్స్ కూడా ట్రంప్‌తో పోలిస్తే.. బైడెన్ 8 నుంచి 10 పాయింట్ల అధిక్యంలో కొనసాగుతున్నట్లు వెల్లడించాయి. ఫాక్స్ న్యూస్ కూడా బైడెన్‌దే పైచేయి అని తేల్చేయడం గమనార్హం. ఫాక్స్ న్యూస్ సర్వే పోల్స్‌లో బైడెన్ కంటే ట్రంప్ 8 పాయింట్లు వెనుకంజలో ఉన్నట్లు తేలింది. కాగా, 2016 అధ్యక్ష ఎన్నికల పోల్స్ ఫలితాలతో పోలిస్తే ఈసారి బైడెన్‌కు మద్దతు కాస్తా ఎక్కువగా ఉంది. ఇక న్యూయార్క్స్ టైమ్స్ ప్రకారం ఒకవేళ ప్రీ పోల్స్ నిజమైతే.. బైడెన్ భారీ విజయం సాధించడం ఖాయం అని స్పష్టం చేసింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఆగస్టు నెలలో ట్రంప్‌పై డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ 10 పాయింట్ల అధిక్యంలో ఉన్నారు. అయితే, పోలింగ్ డే నవంబర్ 8 కంటే ఒక్కరోజు ముందు అంటే.. నవంబర్ 7న ఆమె అధిక్యత నాలుగు పాయింట్లకు పడిపోయింది. హిల్లరీకి 46 శాతం, ట్రంప్‌కు 42 శాతంగా ఉంది. ఇక వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్ అయితే హిల్లరీ కేవలం 2 పాయింట్ల కంటే కూడా తక్కువ అధిక్యతలో ఉన్నట్లు చెప్పాయి. చివరకు స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించి అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. (చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివాదాలెన్నో!) ట్రంప్‌కు ప్రతికూలం కానున్న కరోనా కానీ ఈసారి దీనికి పూర్తి భిన్నంగా బైడెన్ అధిక్యతలో కొనసాగుతున్నారు. పోలింగ్ డే మంగళవారానికి ఒక్కరోజు ముందు సోమవారం వెలువడిన సీఎన్ఎన్ పోల్స్ ఫలితాలలోనూ బైడెన్ 10 పాయింట్ల స్పష్టమైన అధిక్యాన్ని ప్రదర్శించడం గమనార్హం. ఇక కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో ట్రంప్ విఫలమయ్యారని చాలా మంది అమెరికన్లు భావిస్తున్నారు. ఆ కోణంలో వ్యతిరేక ఓట్లు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ ట్రంప్‌కు ప్రతికూలంగా మారనుంది. 57.2 శాతం మంది అమెరికన్లు ఈ సంక్షోభంపై ట్రంప్ స్పందించిన తీరును తప్పుబడుతున్నారు. 2.30 లక్షల మంది అమెరికన్లు ట్రంప్ నిర్లక్ష్యం కారణంగానే కొవిడ్‌కు బలయ్యారని మండిపడుతున్నారు. (చదవండి: అమెరికాలో మొదలైన ఎన్నికల పోలింగ్) 2016లోను వెనకబడ్డ ట్రంప్.. కానీ ఆగష్టు 2016 లో, హిల్లరీ, డొనాల్డ్ ట్రంప్ కంటే 10 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. హిల్లరీకి 49శాతం అనుకూలంగా ఉండగా ట్రంప్‌కు 39శాతం అనుకూలంగా ఉంది. కానీ పోస్ట్ కన్వేన్షన్ పోల్స్ తరువాత పరిస్థితులు మారాయి. ట్రంప్ నెమ్మదిగా పుంజుకున్నారు. అలాగే, అమెరికాలో బరాక్ ఒబామా నేతృత్వంలోని డెమోక్రాటిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపబ్లికన్ పార్టీ నిలబడటం, అధికార పార్టీ మీద వ్యతిరేకత వంటి అంశాలు ట్రంప్‌కు కలసి వచ్చాయి.అయితే ఈ సంవత్సరం, ట్రంప్ ప్రత్యర్థి బైడెన్ భారీ అధిక్యతతో కొనసాగుతున్నారు. సెప్టెంబరులో, మొదటి అధ్యక్ష చర్చకు ముందు, ఎన్బీసీ న్యూస్ పోలింగ్ సగటు ప్రకారం.. బైడెన్, ట్రంప్ కన్నా 8 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. మంగళవారం ఎన్నికలకు ఒక రోజు ముందు ఆయన ఈ ఆధిక్యం 12 పాయింట్లకు పెరిగిందని సీఎన్ఎస్ పోల్ తెలిపింది. (చదవండి: వైరల్.. ఓటరుతో ఒబామా ముచ్చట..!) అలాగే 2016లో స్వింగ్ రాష్ట్రాల్లో గెలిచి అధ్యక్షుడైన ట్రంప్ ఈసారి అక్కడ సైతం వెనుకంజలో ఉన్నట్లు సీఎన్ఎన్ నివేదిక పేర్కొంది. హోరాహోరీ పోరు ఉండే మిచిగాన్, విస్కాన్సిన్, అరిజోనా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్ కంటే బైడెనే మెరుగైన స్థితిలో ఉన్నారని సీఎన్ఎన్ తాజా నివేదిక తెలిపింది. కనుక ఈసారి పోల్స్ ఫలితాలు నిజమైతే మాత్రం బైడెన్ అమెరికా అధ్యక్షుడు కావడం ఖాయం. -
ముగిసిన బ్రిటన్ ఎన్నికలు
లండన్: బ్రిటన్ ప్రతినిధుల సభకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్ల్లోని మొత్తం 650 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 3,322 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా, అప్పటి నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌ల ముందు బారులు తీరారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రతిపక్ష నేత జెరెమి కార్బిన్ ఉదయమే ఓటేశారు. బ్రిటన్‌లో డిసెంబర్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగడం దాదాపు ఒక శతాబ్దం అనంతరం ఇదే తొలిసారి. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని, హంగ్ పార్లమెంట్ ఏర్పడనుందని ప్రీ పోల్ సర్వేలు వెల్లడించాయి. పోలింగ్ ముగియగానే కౌంటింగ్ ప్రారంభమైంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయానికి ఫలితాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. 2017లో జరిగిన ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన 12 మంది విజయం సాధించారు. ఈ సారి ఆ సంఖ్య మరింత పెరగొచ్చని భావిస్తున్నారు. -
సర్వేలంటే భయమెందుకు?
రాహుకాలం, యమగండం, తారాబలం వంటివి చూసుకునిగానీ ఇల్లు కదలని మన నేతలకు ఎన్నికల సర్వేలు చెప్పే జోస్యాలు మాత్రం కర్ణకఠోరమవుతున్నాయి. అవి అశాస్త్రీయమైనవని, అవాంఛనీయమైన వని గుండెలు బాదుకుంటున్నారు. వాటిని నిషేధించాలని డిమాండు చేస్తున్నారు. అవతలి పక్షం డబ్బిచ్చి ఇలా చెప్పిస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికల సర్వేల బాధితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ అందరికంటే ముం దుంది. ఎన్నికల సర్వేలను నిషేధించండంటూ ఆ పార్టీ నాలుగైదు నెలల క్రితమే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. కేంద్ర సర్కారు కూడా తమ అధీనంలోనే ఉన్నది గనుక న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఆ సంస్థకు ఒక సలహా కూడా ఇప్పించింది. రాజ్యాంగంలోని 324 అధికర ణం ద్వారా సమకూడిన అధికారాలను వినియోగించి ఎన్నికల సర్వేలను నియంత్రిం చాలని ఆ సలహా తాత్పర్యం. మన ఈసీ కూడా తక్కువేం తినలేదు. ‘అలా చేస్తే న్యాయస్థానాల్లో వీగిపోతుందేమో... మీరే ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంద’ని రివర్స్ సలహా ఇచ్చింది. ప్రజాస్వామ్యానికి ఇరుసు అనదగ్గ ఎన్నికలు నిర్వహించడమనే బృహత్తర కర్తవ్యాన్ని నెరవేర్చవల సిన ఎన్నికల కమిషన్ కేంద్రంనుంచి ఇలాంటి సలహా రాగానే దాన్ని గట్టిగా వ్యతిరేకించాల్సింది. భావప్రకటనా స్వేచ్ఛకు, అంతిమంగా ప్రజా స్వామ్య వ్యవస్థకు ఇలాంటి చర్య చేటు కలిగిస్తుందని చెప్పవలసింది. ఎందుకనో ఈసీ ఆ పని చేయలేదు. ఎన్నికల సర్వేలన్నీ నూటికి నూరు పాళ్లూ సత్యమైనవని, వాటికుండే విశ్వసనీయత తిరుగులేనిదని ఎవరూ అనరు. ఏదైనా ఒక కొత్త విధానం అమల్లోకి వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసేవారున్నట్టే దుర్వినియోగం చేసేవారూ ఉంటారు. గత నెలలో ఒకటి రెండు సంస్థలు దొంగ సర్వే గణాంకాలివ్వడానికి సిద్ధపడి స్టింగ్ ఆపరేషన్ కెమెరాకు చిక్కాయి. ఈ బాపతు సర్వేల సంగతి మన రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. 2004, 2009 ఎన్నికల్లో ఇలాంటి సర్వేలను తాటికాయంత అక్షరాల్లో అచ్చేసి నగుబాటుపాలైన పత్రికల గురించి ఎవరూ మర్చిపోలేదు. పీఆర్పీకి రెండంకెల స్థానాలకు మించి రావని, తెలుగుదేశానికి రెండోసారి సైతం ఓటమి తప్పదని 2009లో నీల్సన్ సర్వే వెల్లడించి నప్పుడు రెండు పార్టీలూ ఆవేశంతో ఊగిపో యాయి. ‘మహా కూటమి’కింద విపక్షాలన్నిటినీ కూడగట్టడమేకాక... సర్వమూ ‘ఫ్రీ’ అని, దాంతోపాటు నగదు బదిలీ విధానం ద్వారా నెలనెలా ఇంటింటికీ రెండు వేల రూపాయలు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చివున్న బాబుకు మెజారిటీ ఎందుకురాదని టీడీపీ...జనంలో విశేషాదరణ ఉన్న మెగాస్టార్‌ను జనం ఎందుకు కాదంటారని పీఆర్పీ బుసలుకొట్టాయి. ఫలితాలు చూశాక వాటి నోళ్లు మూతబడ్డాయి. ప్రజలు సమస్యలుగా భావిస్తున్నవేమిటి...వాటిని పరిష్కరించగల సత్తా ఎవరికున్నదనుకుంటున్నారు...ఏ పార్టీ సిద్ధాంతాలూ, విధానాలూ వారిని ఆకట్టుకుంటున్నాయి...ఎవరికి విశ్వసనీయత ఉన్నదని భావిస్తున్నారని తెలుసుకోవడం, వాటిని క్రోడీకరించి మొత్తంగా ప్రజల నాడిని పసిగట్టడం ఒక సైన్సు. విశాల ప్రజారాశుల్ని వారి వృత్తులు, వయసు, ప్రాంతం, జెండర్వంటి అంశాల ప్రాతిపదికగా వర్గాలుగా, శ్రేణులుగా విభజించి అభిప్రాయాలు రాబట్టడం, గాలి ఎటు మళ్లుతున్నదో తెలుసుకోగలడం ఒక కళ. చిత్తశుద్ధిగా పనిచేసి ఆ రంగంలో విజయం సాధించినవారూ ఉన్నారు. ఎక్కడో పొరపాటు చేసి వైఫల్యం మూటగట్టుకున్నవారూ ఉన్నారు. వీరిద్దరూ కాక ‘కావలసినట్టు’ సర్వేలు వండిపెట్టే బాపతూ ఉన్నారు. ప్రతి ఎన్నికల సీజన్లోనూ ఈ మూడు రకాలవారూ మనకు తారసపడతారు. సారాంశంలో సర్వేలు ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో చెప్పగలుగుతాయి తప్ప వారి ఆలోచనలను ప్రభావితం చేయలేవు. వారి ఆలోచనలను పసిగట్టగల సర్వే సంస్థలు విశ్వసనీయతను, ప్రతిష్టను పెంచుకుంటాయి. ఆ విషయంలో విఫలమైనవి, మాయచేద్దామని చూసినవి ఫలితాలు వెలువడ్డాక నగుబాటుపాలవుతాయి. మన దేశంతో సహా అనేక దేశాల్లో జరిగిన వివిధ ఎన్నికల్లో జనం నాడిని పసిగట్టడంలో సిద్ధహస్తుడనిపించుకున్న సర్ డేవిడ్ బట్లర్ ఎన్నికల సర్వేల ఫలితాలు ప్రజలను ప్రభావితం చేస్తాయనుకోవడం ఉత్త భ్రమగా కొట్టిపారేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో అరవైయ్యేళ్ల అనుభవంతో చెప్పిన మాట అది. నిజానికి ఎన్నికల సర్వేలు మన దేశానికి చాలా కొత్త. అవి వచ్చి నిండా పాతికేళ్లు కాలేదు. ఈ సర్వేల దూకుడు చూసి వాటిని నియంత్రించాలని 1997లో ఐకె గుజ్రాల్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే, మీడియా సంస్థలన్నీ ఆ నిషేధాన్ని ధిక్కరించి సర్వేలను ప్రకటించాయి. కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. సర్వేల నిషేధం భావప్రకటనా స్వేచ్ఛను ఆటంకపరచడమేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తర్వాతకాలంలో ఎన్నికల్లోని అన్ని దశాలూ పూర్తిగాకుండా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించవద్దని, అలాగే ఎన్నికలకు 48 గంటలముందు సర్వేల ఫలితాలు ప్రకటించవద్దని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. సర్వే నిర్వహించిన సంస్థలు తాము అందుకు అనుసరించిన విధానాన్ని వివరించడమూ, ఎలాంటి నమూనాలను, ఎందుకు తీసుకున్నారో చెప్పడమనే ఆనవాయితీ బ్రిటన్‌లో ఉంది. తమ విశ్వసనీయతను పెంచుకోవడానికి అక్కడి సంస్థలు ఈ మార్గాన్ని అనుసరిస్తాయి. అలాంటి ప్రమాణాలేమైనా ఇక్కడ కూడా అమలు చేయాలని భావిస్తే మంచిదే. కానీ, మొత్తంగా సర్వేలే వద్దనడం అప్రజాస్వామికమనిపించుకుంటుంది. ప్రజాభిప్రా యానికి జడిసేవారే సర్వేలకు బెదిరిపోతారు. జనాభిప్రాయంలో తమ ముఖాన్ని చూసుకుని సరిచేసుకుంటే, పద్ధతిగా నడుచుకోవడానికి ప్రయ త్నిస్తే ఆ పార్టీలకూ, నేతలకూ భవిష్యత్తులోనైనా మేలు కలుగుతుంది. కాదంటే అది వారికే చేటు తెస్తుంది.