రాహుకాలం, యమగండం, తారాబలం వంటివి చూసుకునిగానీ ఇల్లు కదలని మన నేతలకు ఎన్నికల సర్వేలు చెప్పే జోస్యాలు మాత్రం కర్ణకఠోరమవుతున్నాయి. అవి అశాస్త్రీయమైనవని, అవాంఛనీయమైన వని గుండెలు బాదుకుంటున్నారు. వాటిని నిషేధించాలని డిమాండు చేస్తున్నారు. అవతలి పక్షం డబ్బిచ్చి ఇలా చెప్పిస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికల సర్వేల బాధితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ అందరికంటే ముం దుంది. ఎన్నికల సర్వేలను నిషేధించండంటూ ఆ పార్టీ నాలుగైదు నెలల క్రితమే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. కేంద్ర సర్కారు కూడా తమ అధీనంలోనే ఉన్నది గనుక న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఆ సంస్థకు ఒక సలహా కూడా ఇప్పించింది. రాజ్యాంగంలోని 324 అధికర ణం ద్వారా సమకూడిన అధికారాలను వినియోగించి ఎన్నికల సర్వేలను నియంత్రిం చాలని ఆ సలహా తాత్పర్యం. మన ఈసీ కూడా తక్కువేం తినలేదు. ‘అలా చేస్తే న్యాయస్థానాల్లో వీగిపోతుందేమో... మీరే ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంద’ని రివర్స్ సలహా ఇచ్చింది. ప్రజాస్వామ్యానికి ఇరుసు అనదగ్గ ఎన్నికలు నిర్వహించడమనే బృహత్తర కర్తవ్యాన్ని నెరవేర్చవల సిన ఎన్నికల కమిషన్ కేంద్రంనుంచి ఇలాంటి సలహా రాగానే దాన్ని గట్టిగా వ్యతిరేకించాల్సింది. భావప్రకటనా స్వేచ్ఛకు, అంతిమంగా ప్రజా స్వామ్య వ్యవస్థకు ఇలాంటి చర్య చేటు కలిగిస్తుందని చెప్పవలసింది. ఎందుకనో ఈసీ ఆ పని చేయలేదు. ఎన్నికల సర్వేలన్నీ నూటికి నూరు పాళ్లూ సత్యమైనవని, వాటికుండే విశ్వసనీయత తిరుగులేనిదని ఎవరూ అనరు. ఏదైనా ఒక కొత్త విధానం అమల్లోకి వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసేవారున్నట్టే దుర్వినియోగం చేసేవారూ ఉంటారు. గత నెలలో ఒకటి రెండు సంస్థలు దొంగ సర్వే గణాంకాలివ్వడానికి సిద్ధపడి స్టింగ్ ఆపరేషన్ కెమెరాకు చిక్కాయి. ఈ బాపతు సర్వేల సంగతి మన రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. 2004, 2009 ఎన్నికల్లో ఇలాంటి సర్వేలను తాటికాయంత అక్షరాల్లో అచ్చేసి నగుబాటుపాలైన పత్రికల గురించి ఎవరూ మర్చిపోలేదు. పీఆర్పీకి రెండంకెల స్థానాలకు మించి రావని, తెలుగుదేశానికి రెండోసారి సైతం ఓటమి తప్పదని 2009లో నీల్సన్ సర్వే వెల్లడించి నప్పుడు రెండు పార్టీలూ ఆవేశంతో ఊగిపో యాయి. ‘మహా కూటమి’కింద విపక్షాలన్నిటినీ కూడగట్టడమేకాక... సర్వమూ ‘ఫ్రీ’ అని, దాంతోపాటు నగదు బదిలీ విధానం ద్వారా నెలనెలా ఇంటింటికీ రెండు వేల రూపాయలు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చివున్న బాబుకు మెజారిటీ ఎందుకురాదని టీడీపీ...జనంలో విశేషాదరణ ఉన్న మెగాస్టార్‌ను జనం ఎందుకు కాదంటారని పీఆర్పీ బుసలుకొట్టాయి. ఫలితాలు చూశాక వాటి నోళ్లు మూతబడ్డాయి.
ప్రజలు సమస్యలుగా భావిస్తున్నవేమిటి...వాటిని పరిష్కరించగల సత్తా ఎవరికున్నదనుకుంటున్నారు...ఏ పార్టీ సిద్ధాంతాలూ, విధానాలూ వారిని ఆకట్టుకుంటున్నాయి...ఎవరికి విశ్వసనీయత ఉన్నదని భావిస్తున్నారని తెలుసుకోవడం, వాటిని క్రోడీకరించి మొత్తంగా ప్రజల నాడిని పసిగట్టడం ఒక సైన్సు. విశాల ప్రజారాశుల్ని వారి వృత్తులు, వయసు, ప్రాంతం, జెండర్‌వంటి అంశాల ప్రాతిపదికగా వర్గాలుగా, శ్రేణులుగా విభజించి అభిప్రాయాలు రాబట్టడం, గాలి ఎటు మళ్లుతున్నదో తెలుసుకోగలడం ఒక కళ. చిత్తశుద్ధిగా పనిచేసి ఆ రంగంలో విజయం సాధించినవారూ ఉన్నారు. ఎక్కడో పొరపాటు చేసి వైఫల్యం మూటగట్టుకున్నవారూ ఉన్నారు. వీరిద్దరూ కాక ‘కావలసినట్టు’ సర్వేలు వండిపెట్టే బాపతూ ఉన్నారు. ప్రతి ఎన్నికల సీజన్‌లోనూ ఈ మూడు రకాలవారూ మనకు తారసపడతారు. సారాంశంలో సర్వేలు ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో చెప్పగలుగుతాయి తప్ప వారి ఆలోచనలను ప్రభావితం చేయలేవు. వారి ఆలోచనలను పసిగట్టగల సర్వే సంస్థలు విశ్వసనీయతను, ప్రతిష్టను పెంచుకుంటాయి. ఆ విషయంలో విఫలమైనవి, మాయచేద్దామని చూసినవి ఫలితాలు వెలువడ్డాక నగుబాటుపాలవుతాయి. మన దేశంతో సహా అనేక దేశాల్లో జరిగిన వివిధ ఎన్నికల్లో జనం నాడిని పసిగట్టడంలో సిద్ధహస్తుడనిపించుకున్న సర్ డేవిడ్ బట్లర్ ఎన్నికల సర్వేల ఫలితాలు ప్రజలను ప్రభావితం చేస్తాయనుకోవడం ఉత్త భ్రమగా కొట్టిపారేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో అరవైయ్యేళ్ల అనుభవంతో చెప్పిన మాట అది.
నిజానికి ఎన్నికల సర్వేలు మన దేశానికి చాలా కొత్త. అవి వచ్చి నిండా పాతికేళ్లు కాలేదు. ఈ సర్వేల దూకుడు చూసి వాటిని నియంత్రించాలని 1997లో ఐకె గుజ్రాల్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే, మీడియా సంస్థలన్నీ ఆ నిషేధాన్ని ధిక్కరించి సర్వేలను ప్రకటించాయి. కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. సర్వేల నిషేధం భావప్రకటనా స్వేచ్ఛను ఆటంకపరచడమేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తర్వాతకాలంలో ఎన్నికల్లోని అన్ని దశాలూ పూర్తిగాకుండా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించవద్దని, అలాగే ఎన్నికలకు 48 గంటలముందు సర్వేల ఫలితాలు ప్రకటించవద్దని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. సర్వే నిర్వహించిన సంస్థలు తాము అందుకు అనుసరించిన విధానాన్ని వివరించడమూ, ఎలాంటి నమూనాలను, ఎందుకు తీసుకున్నారో చెప్పడమనే ఆనవాయితీ బ్రిటన్‌లో ఉంది. తమ విశ్వసనీయతను పెంచుకోవడానికి అక్కడి సంస్థలు ఈ మార్గాన్ని అనుసరిస్తాయి. అలాంటి ప్రమాణాలేమైనా ఇక్కడ కూడా అమలు చేయాలని భావిస్తే మంచిదే. కానీ, మొత్తంగా సర్వేలే వద్దనడం అప్రజాస్వామికమనిపించుకుంటుంది. ప్రజాభిప్రా యానికి జడిసేవారే సర్వేలకు బెదిరిపోతారు. జనాభిప్రాయంలో తమ ముఖాన్ని చూసుకుని సరిచేసుకుంటే, పద్ధతిగా నడుచుకోవడానికి ప్రయ త్నిస్తే ఆ పార్టీలకూ, నేతలకూ భవిష్యత్తులోనైనా మేలు కలుగుతుంది. కాదంటే అది వారికే చేటు తెస్తుంది.
సర్వేలంటే భయమెందుకు?
Published Wed, Apr 2 2014 11:46 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement