premsagar rao
-
మంత్రి యోగమెవరికో? ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ‘మంత్రి’ పదవి కోసం సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మంత్రివర్గ మొదటి విస్తరణలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ ప్రా తినిధ్యం దక్కలేదు. దీంతో అంతా రెండో విడత విస్తరణపైనే ఆశలు పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే రెండో విడత కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల నుంచి నలుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విప్ పదవుల్లోనూ ఉమ్మడి జిల్లా నుంచి ఎవరూ లేరు. దీంతో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కేబినెట్‌తోపాటు ఇతర కీలక పదవుల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన వెడ్మ బొజ్జుతోపాటు మరో ముగ్గురు సీనియర్ నాయకులు పోటీలో ఉన్నారు. వీరందరిలో ప్రధానంగా ముగ్గురు సీనియర్ల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ‘గడ్డం’ సోదరుల పోటీ.. ‘గడ్డం’ సోదరులు ఇద్దరూ మంత్రి పదవిపై నమ్మకం పెట్టుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన గడ్డం వినోద్, చెన్నూరు నుంచి గెలిచిన వివేక్ ఒకరితో ఒకరు పదవి కోసం పోటీ పడుతున్నారు. ఒక దశలో వివేక్‌కు మొదటి కేబినెట్ విస్తరణలోనే బెర్త్ ఖాయమని ఆయన అనుచరులు చెప్పుకొన్నారు. కానీ.. మంత్రివర్గంలో ఆయన పేరు లేదు. అదే సమయంలో తనకే మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ వినోద్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఢిల్లీకి వెళ్లి కలిసి వచ్చారు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు అమాత్య పదవి కోసం పోటీ పడడం కనిపిస్తోంది. ఈ ఇద్దరన్నదమ్ముల్లో ఎవరిని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందోనని కేడర్‌లో చర్చ జరుగుతోంది. ‘పీఎస్సార్’కు ఖర్గే హామీ! ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్) మంత్రి పదవి రేసులో ప్రముఖంగా ఉన్నారు. గత ఏప్రిల్‌లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన ‘సత్యాగ్రహ’ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పీఎస్సార్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, కీలక హోదాలో ఉంటారని హామీ ఇచ్చారు. అయితే తొలివిడతలో ఆయనకు అవకాశం రాలేదు. మరోవైపు మంత్రి పదవులు వరించిన వారి సామాజిక వర్గాలు చూస్తే, వెలమ కోటలో ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి జూపల్లి కృష్ణారావుకు చోటు దక్కింది. ఇక ఎస్సీ కోటాలో భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, దామోదర రాజనర్సింహా ఉన్నారు. ఈ క్రమంలో మిగిలిన ఆరు మంత్రి పదవుల్లో భర్తీ చేయాల్సి వస్తే, సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. పోటీలో ఉన్న వారి సామాజిక కోటా పరిగణనలోకి తీసుకుంటే, ఎవరి అవకాశాలను దెబ్బతీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ స్థాయి పదవులతో సమానంగా ఉండే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్‌తో పదవి దక్కని వారు నిరాశ పడకుండా సర్దుబాటు చేస్తారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తదుపరి టీంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి చోటు ఉంటుందో, ఎవరికి నిరాశ కలుగుతుందోనని అధికార పార్టీ వర్గాల్లోనూ, ఇటు ఉమ్మడి జిల్లా ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఎవరికి వారు ఇటు రాష్ట్ర పెద్దలతోపాటు అటు ఢిల్లీలోని పార్టీ పెద్దలను కలుస్తూ మంత్రి పదవి కోసం తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇవి చదవండి: సర్వజన రంజక పాలన.. గవర్నర్ తమిళిసై ప్రసంగం -
డీసీసీ అధ్యక్షుడికి గుండెకు స్టంట్.. హైదరాబాద్‌లో విశ్రాంతి..
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొక్కిరాల బ్రదర్స్ రెండు వర్గాలుగా విడిపోయి ఈ గందరగోళానికి కారణమయ్యారు. దీనికితోడు ఆసిఫాబాద్ నియోజకవర్గ ఆశావహులు గణేష్ రాథోడ్, అజ్మీరా శ్యాంనాయక్, మర్సుకోల సరస్వతి మధ్య టికెట్ పోరుతోపాటు ముగ్గురు ఎవరికి వారే ప్రచారాలు నిర్వహిస్తుండటం చర్చనీయాంశమైంది. ఇక డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ అనారోగ్యం బారిన పడటంతో పెద్దదిక్కు లేకుండా పోయింది. హైదరాబాద్‌లో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు పరీక్షించి ఆయన గుండెకు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదే తరుణంలో ఇన్నాళ్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ చైర్మన్ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు జిల్లా పార్టీ పగ్గాలు తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌పై ‘కొక్కిరాల’ పట్టు ఆది నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావుకి తనదైన అనుచర వర్గం ఉంది. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్, సిర్పూర్, బోథ్ నియోజకవర్గాల్లో తన అనుచరులకే టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే ఆసిఫాబాద్ నియోజకవర్గం(ఎస్టీ) టికెట్‌కు కేటాయింపు వ్యవహారంలో ప్రేంసాగర్‌రావుకి, ఆయన సోదరుడు విశ్వప్రసాద్‌రావు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అదే సమయంలో జిల్లాపై తన పట్టును సడలించకూడదన్న భావనతో ఉన్న మాజీ ఎమ్మెల్సీ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీకి అండగా నిలిచి.. నాలుగున్నరేళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న గణేష్ రాథోడ్‌కి టికెట్ ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు సైతం అధిష్టానం వద్ద తాను బలపరుస్తున్న ఆశావహుల విజయావకాశాలపై నివేదిక అందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ గణేష్ రాథోడ్‌కి పార్టీ టికెట్ ఇస్తే గణనీయమైన ఓట్లు కలిగిన ఓ సామాజిక వర్గం దూరమవుతుందని పేర్కొన్నట్లు సమాచారం. అయితే ప్రేంసాగర్‌రావు మాత్రం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కాకుండా ప్యారాషూట్లో దిగిన, ఏడాది కిందట పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇస్తే విజయావకాశాలు సన్నగిల్లుతాయని అధిష్టానానికి సూచినట్లు తెలిసింది. డీసీసీ అధ్యక్షుడికి ఇప్పటికే రెండు సార్లు స్టంట్లు వేయడంతో ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. పైగా రిజర్వుడ్ నియోజకవర్గంలో పార్టీ కోసం ఎంత శ్రమించినా తగిన గుర్తింపు లభించదు కాబట్టి.. ఆయనను విశ్రాంతి తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారని, ప్రచారానికి సైతం వెళ్లొదంటున్నట్లు సమాచారం. ప్రేంసాగర్‌రావు సైతం అదే అభిప్రాయం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తమ్ముడి ఆరోగ్యం కుదుట పడేవరకు అన్నీతానై పార్టీని నడిపించాలనే నిర్ణయానికి వచ్చి అధిష్టానం వద్ద తన ప్రతిపాదనను ఉంచినట్లు సమాచారం. ఎవరికి వారే యుమునా తీరే! ఆసిఫాబాద్ నియెజకవర్గ టికెట్ కోసం పది మంది దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా ప్రేంసాగర్‌రావు మద్దతుదారుడు గణేష్ రాథోడ్, విశ్వప్రసాద్‌రావు మద్దతుదారుడు అజ్మీరా శ్యాంనాయక్‌తోపాటు ఆసిఫాబాద్ మాజీ సర్పంచ్ మర్సుకోల సరస్వతి, పారిశ్రామికవేత్త రాథోడ్ శేషారావు టికెట్ కోసం పోటీపడుతున్నారు. వీరిలో శ్యాంనాయక్, గణేష్ రాథోడ్, సరస్వతి ఎవరికి వారు పోటా పోటీగా మండలాల్లో పర్యటనలు చేస్తున్నారు. తమకే టికెట్ వస్తుందనే ధీమాను కార్యకర్తల వద్ద వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి పరిణామాలను సూక్ష్మదృష్టితో పరిశీలిస్తున్న అధిష్టానం అభ్యర్థుల విజయావకాశాలపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలి ఆసిఫాబాద్: కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేయాలని సీడబ్ల్యూసీ స భ్యురాలు యశోదారాణి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో సోమవారం నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించ డం ఖాయమన్నారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలో మోటార్ బైక్ ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు గణేష్ రాథోడ్, మర్సుకోల సరస్వతి, శ్యాంనాయక్, కేశవరావు, చరణ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో చేరికల పోరు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో చేరికలు ఒకవైపు కేడర్‌లో నూతనోత్తేజం నింపుతుంటే మరోవైపు నేతల మధ్య వర్గపోరు పెరుగుతోంది. పార్టీలో చేరాలనుకున్న వారంతా గాంధీభవన్‌లో చేరాల్సి ఉండగా అందుకు భిన్నంగా కీలక నేతల ఇళ్లలో ఎవరికి వారుగా చేరడం గందరగోళానికి దారితీస్తున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం జరిగిన చేరికలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. పీసీసీ, సీఎల్పీ, స్టార్ క్యాంపెయినర్... టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి చెందిన జూబ్లీహిల్స్ కార్యాలయంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకర్గానికి చెందిన కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరగా మంచిర్యాల జిల్లాకు చెందిన మరికొందరు నేతలు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు నేతృత్వంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కార్యాలయంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ అయిన తుంగతుర్తి రెబల్ నేత డాక్టర్ వడ్డెపల్లి రవి... కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో పార్టీలో చేరారు. గాంధీభవన్ చేరికల్లో కనిపించని కీలక నేతలు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నేతలు పార్టీలో చేరేందుకు గాంధీభవన్‌కు వచ్చారు. పీసీసీ అధ్యక్షుడి సమక్షంలో మాజీ మంత్రి బోడ జనార్ధన్‌తోపాటు మెట్పల్లి జెడ్పీటీసీ రాధాశ్రీనివాస్‌రెడ్డి, సిర్పూర్ కాగజ్‌నగర్ బీజేపీ నేత రావి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరారు. ఆ సమయంలో రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి మినహా సీనియర్ నేతలెవరూ అక్కడ లేరు. సస్పెన్షన్‌లో ఉన్న వారిని ఎలా..? గత ఎన్నికల సమయంలో రెబెల్ అభ్యర్థిగా ఉన్న తుంగతుర్తి నేత డాక్టర్ వడ్డెపల్లి రవిని పార్టీలోకి ఎలా ఆహ్వానించారని తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి అద్దంకి దయాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వడ్డెపల్లి రవిని పార్టీ ఆరేళ్లపాటు సస్పెండ్ చేసిందని గుర్తుచేసిన ఆయన... కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ఎలా చేరారని ప్రశ్నించారు. దీనిపై రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. చేరికల కమిటీ చైర్మన్ జానారెడ్డి ఎక్కడ? పార్టీలోకి ఎవరిని తీసుకోవాలో ఎవరిని తీసుకోకూడదన్న వ్యవహారంపై మాజీ మంత్రి జానారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఓ కమిటీ వేసింది. ప్రస్తుతం జరుగుతున్న చేరికలకు జానారెడ్డి దగ్గర చర్చ జరిగిందా లేదా అనే దానిపై ఏ నాయకుడికీ స్పష్టత లేదు. ఏదో పేరుకే కమిటీ వేసి జానా రెడ్డిని బాధ్యుడిగా పెట్టారని, చేరికల అంశాలేవీ ఆయన దృష్టికి వెళ్లడంలేదని పార్టీలోని సీనియర్లు చెబుతున్నారు. -
అగమ్యగోచరంగా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి
-
తన వర్గానికి చెందిన నాయకులతో జిల్లా కేంద్రంలో అసమ్మతి సమావేశం
-
కదనోత్సాహం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ముందస్తు ఎన్నికలకు సర్కారు సన్నద్ధమవుతున్న సంకేతాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ముఖ్య నాయకులు వర్గాల వారీగా విడిపోయినా... ఎన్నికలకు మాత్రం సిద్ధమేనని చెపుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో రాహుల్‌గాంధీ రెండు రోజుల పర్యటన విజయవంతం కావడంతో పార్టీ యంత్రాంగంలో కదనోత్సాహం నిండిందని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్చార్జిలతో రాహుల్‌గాంధీ శనివారం ఏర్పాటు చేసిన సమావేశం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బృందంలో ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా ఉండడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, వర్గ విభేదాలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పూర్తిగా తెలుసు. ఉత్తమ్‌కు సొంత పార్టీలోనే ప్రత్యర్థిగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నేతృత్వంలో పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో గట్టి పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మహేశ్వర్‌రెడ్డి శక్తి యాప్ ప్రమోషన్లో చూపించిన ప్రతిభ ద్వారా ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే! వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో జరగాల్సిన సాధారణ ఎన్నికలను ఆరు నెలల ముందుగానే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు యోచిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వచ్చే నెల 2న హైదరాబాద్ సమీపంలో లక్షలాది మందితో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ ద్వారానే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ముందస్తుకు సిద్ధమేనని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం రాహుల్‌గాంధీతో జరిగిన సమావేశంలో సైతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని వివరించి, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు అధినేతకు తెలియజేశారు. ముందస్తు ఎన్నికలు వస్తే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హవానే కాంగ్రెస్‌లో నడుస్తుందని భావిస్తున్న ఆయన వర్గం టిక్కెట్ల కేటాయింపులో కూడా పెద్దపాలు దక్కుతుందని యోచిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో మహేశ్వర్‌రెడ్డి ఆలోచన కూడా అదే. ఎన్నికల్లో తమ వర్గానికి ఎక్కువ సీట్లు దక్కేలా పావులు కదిపే ఆలోచనతో ఉన్నారు. పీసీసీ అధ్యక్షులు, ఇన్చార్జిలతో రాహుల్‌గాంధీ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ, మహేశ్వర్‌రెడ్డి మాట్లాడేందుకు కొంత సమయం ఇవ్వడం గమనార్హం. శక్తి యాప్‌ను విస్తృతంగా వినియోగిస్తూ పార్టీకి అండగా నిలుస్తున్న దేశంలోని పది మందిని గౌరవించే కార్యక్రమాన్ని రాహుల్‌గాంధీ చేపట్టగా, వారిలో మహేశ్వర్‌రెడ్డి ఉండడం గమనార్హం. కాగా మహేశ్వర్‌రెడ్డి వర్గంతో పాటు జిల్లాలో ప్రేంసాగర్‌రావు గ్రూపు కూడా టిక్కెట్ల వేటలో తమవంతు ప్రయత్నాల్లో ఉన్నారు. మండలాల వారీగా బలాన్ని మరింత పెంచుకొని టిక్కెట్ల పోటీలో ముందు వరుసలో ఉండాలని యోచిస్తున్నారు. రాహుల్‌గాంధీకి సంస్థాగత నివేదిక డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదుకు ఉద్ధేశించిన శక్తి యాప్, బూత్ కమిటీల ఏర్పాటు గురించి నివేదికను సమర్పించారు. శక్తి యాప్ ద్వారా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదిలాబాద్ పూర్వ జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ నేపథ్యంలో మహేశ్వర్‌రెడ్డిని ఏఐసీసీ తరుపున రాహుల్‌గాంధీ అభినందించారు. అదే సమయంలో కొత్త జిల్లాల వారీగా డీసీసీల ఏర్పాటు అంశం పీసీసీ పరిధిలో ఉండడంతో తన వర్గీయులను అధ్యక్షులుగా నియమించుకునేందుకు ఈ ఢిల్లీ పర్యటనను మహేశ్వర్‌రెడ్డి వినియోగించుకున్నట్లు సమాచారం. నిర్మల్ మినహా మంచిర్యాల, కుమురంభీం, ఆదిలాబాద్ జిల్లాల పార్టీ అధ్యక్షుల కోసం మహేశ్వర్‌రెడ్డి వర్గంతో పాటు ప్రేంసాగర్‌రావు వర్గం కూడా తీవ్ర స్థాయిలో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి తన పంతం నెగ్గించుకొనే యోచనతో మహేశ్వర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. వేచి చూసే దోరణిలో ప్రేంసాగర్‌రావు వర్గం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మహేశ్వర్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీతో భేటీ కావడంతో ప్రేంసాగర్‌రావు వర్గం వేచి చూసే దోరణితో ఉంది. రాష్ట్ర స్థాయిలో భట్టి విక్రమార్క, డీకే అరుణ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రేవంత్‌రెడ్డిలకు చెందిన గ్రూపులో ఉన్న ప్రేంసాగర్‌రావు, వివిధ నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న ఈ వర్గం నాయకులు స్థానికంగా పట్టును పెంచుకునే పనిలో పడ్డారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత ఢిల్లీలో టిక్కెట్ల పంపిణీ నాటికి అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయని వీరు భావిస్తున్నారు. ఆదివాసీ సమస్యతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు సోయం బాపూరావు, ఆత్రం సక్కు, రేవంత్‌రెడ్డితో పాటు రాహుల్‌గాంధీ సమక్షంలో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బోడ జనార్దన్, రావి శ్రీనివాస్, గతంలో పోటీ చేసి ఓడిపోయిన గండ్రత్ సుజాత, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తమ వైపు ఉన్నందున వీరికి టిక్కెట్లు ఖాయమని ప్రేంసాగర్‌రావు వర్గం భావిస్తోంది. వీరందరికీ స్థానికంగా కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు వెల్లడంతో కార్యాచరణ ప్రారంభమైంది. -
ఆల్ హ్యాపీస్...
పొత్తుల్లేవని తేలడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఆశావహుల్లో ఆనందం టిక్కెట్లు ఆశిస్తున్న నేతల్లో ఉత్సాహం కాంగ్రెస్-టీఆర్ఎస్ పొత్తుపై స్పష్టత రావడంతో ఆ రెండు పార్టీల్లో టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహుల్లో ఆశలు చిగురించినట్లయింది. పొత్తులో ఎవరి సీటు గల్లంతవుతుందో.. ఎవరిని టిక్కెటు వరిస్తుందో తెలియక ఇన్నాళ్లు ఒకింత ఆందోళన, అయోమయంలో ఉన్న ఆ రెండు పార్టీ నాయకులకు కేసీఆర్ ప్రకటన ఊరటనిచ్చింది. పొత్తు ఉండదని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు శనివారం చేసిన ప్రకటనతో ఓ స్పష్టత వచ్చినట్లయింది. ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా ప్రకటించారు. ఈ రెండు పార్టీల పొత్తు అంశం తేలిపోవడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీల టికెట్లు ఆశిస్తున్న నేతల్లో ఉత్సాహం నెలకొంది. - సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ పొత్తు ఉన్న పక్షంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఖాయమనే భావన నెలకొంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో రెండు పార్టీలకు కలిపి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న ఒక్కరే బరిలో ఉంటారని భావించారు. కానీ పొత్తుండదని తేలడంతో కాంగ్రెస్ ఆశావాహుల్లో మరింత ఉత్సాహం నింపినట్లయింది. ఇక్కడ డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి, పీసీసీ కార్యదర్శి సుజాత, ఎన్ఎస్యూఐ నాయకులు భార్గవ్ దేశ్‌పాండే తదితరులు కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. పొత్తుపై స్పష్టత రావడంతో నాయకులు మరింత ఉత్సాహంతో టికెట్ కోసం ప్రయత్నాలు చేయనున్నారు. ముథోల్‌లో కాంగ్రెస్‌లోనూ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌రెడ్డి టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వేణుగోపాలాచారి టీఆర్ఎస్లో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో పొత్తులో తమకు అవకాశం దక్కుతుందో లేదోననే భావన ఇన్నాళ్లు ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. పొత్తు లేదని తేలడంతో వీరిలో ఆశలు చిగురించినట్లయింది. రోజుకో మలుపు తిరుగుతున్న మంచిర్యాల రాజకీయాల్లో కూడా పొత్తు అంశం తేలడంతో ఒక స్పష్టత వచ్చినట్లయింది. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అరవింద్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో టిక్కెట్టుపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు శనివారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు కూడా కాంగ్రెస్ టిక్కెటు ఆశిస్తున్నారు. ఇప్పుడు పొత్తుల అంశం తేలడంతో రెండు పార్టీల్లోని నేతలు ఎవరికి వారే టిక్కెట్ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.నిర్మల్‌లో కాంగ్రెస్ టికెట్ మహేశ్వర్‌రెడ్డి ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు ఆశలు పెట్టుకున్నారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ప్రేంసాగర్‌రావు బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తున్న పక్షంలో ఆయా పార్టీల్లో ఒకరికి నిరాశే ఎదురయ్యేది.