డీసీసీ అధ్యక్షుడికి గుండెకు స్టంట్‌.. హైదరాబాద్‌లో విశ్రాంతి.. | - | Sakshi
Sakshi News home page

డీసీసీ అధ్యక్షుడికి గుండెకు స్టంట్‌.. హైదరాబాద్‌లో విశ్రాంతి..

Published Wed, Sep 20 2023 2:08 AM | Last Updated on Wed, Sep 20 2023 9:07 PM

- - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: జిల్లా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొక్కిరాల బ్రదర్స్‌ రెండు వర్గాలుగా విడిపోయి ఈ గందరగోళానికి కారణమయ్యారు. దీనికితోడు ఆసిఫాబాద్‌ నియోజకవర్గ ఆశావహులు గణేష్‌ రాథోడ్‌, అజ్మీరా శ్యాంనాయక్‌, మర్సుకోల సరస్వతి మధ్య టికెట్‌ పోరుతోపాటు ముగ్గురు ఎవరికి వారే ప్రచారాలు నిర్వహిస్తుండటం చర్చనీయాంశమైంది. ఇక డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌ అనారోగ్యం బారిన పడటంతో పెద్దదిక్కు లేకుండా పోయింది. హైదరాబాద్‌లో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు పరీక్షించి ఆయన గుండెకు స్టంట్‌ వేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదే తరుణంలో ఇన్నాళ్లు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహ కమిటీ చైర్మన్‌ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు జిల్లా పార్టీ పగ్గాలు తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌పై ‘కొక్కిరాల’ పట్టు
ఆది నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌లో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావుకి తనదైన అనుచర వర్గం ఉంది. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, బోథ్‌ నియోజకవర్గాల్లో తన అనుచరులకే టికెట్‌ ఇప్పించుకునే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే ఆసిఫాబాద్‌ నియోజకవర్గం(ఎస్టీ) టికెట్‌కు కేటాయింపు వ్యవహారంలో ప్రేంసాగర్‌రావుకి, ఆయన సోదరుడు విశ్వప్రసాద్‌రావు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అదే సమయంలో జిల్లాపై తన పట్టును సడలించకూడదన్న భావనతో ఉన్న మాజీ ఎమ్మెల్సీ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీకి అండగా నిలిచి.. నాలుగున్నరేళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న గణేష్‌ రాథోడ్‌కి టికెట్‌ ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు సైతం అధిష్టానం వద్ద తాను బలపరుస్తున్న ఆశావహుల విజయావకాశాలపై నివేదిక అందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ గణేష్‌ రాథోడ్‌కి పార్టీ టికెట్‌ ఇస్తే గణనీయమైన ఓట్లు కలిగిన ఓ సామాజిక వర్గం దూరమవుతుందని పేర్కొన్నట్లు సమాచారం.

అయితే ప్రేంసాగర్‌రావు మాత్రం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కాకుండా ప్యారాషూట్‌లో దిగిన, ఏడాది కిందట పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇస్తే విజయావకాశాలు సన్నగిల్లుతాయని అధిష్టానానికి సూచినట్లు తెలిసింది. డీసీసీ అధ్యక్షుడికి ఇప్పటికే రెండు సార్లు స్టంట్లు వేయడంతో ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.

పైగా రిజర్వుడ్‌ నియోజకవర్గంలో పార్టీ కోసం ఎంత శ్రమించినా తగిన గుర్తింపు లభించదు కాబట్టి.. ఆయనను విశ్రాంతి తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారని, ప్రచారానికి సైతం వెళ్లొదంటున్నట్లు సమాచారం. ప్రేంసాగర్‌రావు సైతం అదే అభిప్రాయం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తమ్ముడి ఆరోగ్యం కుదుట పడేవరకు అన్నీతానై పార్టీని నడిపించాలనే నిర్ణయానికి వచ్చి అధిష్టానం వద్ద తన ప్రతిపాదనను ఉంచినట్లు సమాచారం.

ఎవరికి వారే యుమునా తీరే!
ఆసిఫాబాద్‌ నియెజకవర్గ టికెట్‌ కోసం పది మంది దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా ప్రేంసాగర్‌రావు మద్దతుదారుడు గణేష్‌ రాథోడ్‌, విశ్వప్రసాద్‌రావు మద్దతుదారుడు అజ్మీరా శ్యాంనాయక్‌తోపాటు ఆసిఫాబాద్‌ మాజీ సర్పంచ్‌ మర్సుకోల సరస్వతి, పారిశ్రామికవేత్త రాథోడ్‌ శేషారావు టికెట్‌ కోసం పోటీపడుతున్నారు. వీరిలో శ్యాంనాయక్‌, గణేష్‌ రాథోడ్‌, సరస్వతి ఎవరికి వారు పోటా పోటీగా మండలాల్లో పర్యటనలు చేస్తున్నారు. తమకే టికెట్‌ వస్తుందనే ధీమాను కార్యకర్తల వద్ద వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి పరిణామాలను సూక్ష్మదృష్టితో పరిశీలిస్తున్న అధిష్టానం అభ్యర్థుల విజయావకాశాలపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

కాంగ్రెస్‌ గెలుపు కోసం కృషి చేయాలి
ఆసిఫాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేయాలని సీడబ్ల్యూసీ స భ్యురాలు యశోదారాణి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్‌లో సోమవారం నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించ డం ఖాయమన్నారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలో మోటార్‌ బైక్‌ ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు గణేష్‌ రాథోడ్‌, మర్సుకోల సరస్వతి, శ్యాంనాయక్‌, కేశవరావు, చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement