కుమరం భీం: రాష్ట్రంలో ఉత్కంఠ రేపిన బీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా వెల్లడికావడంతో సిర్పూర్ సెగ్మెంటులో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తొణకిసలాడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పకే మళ్లీ టికెట్ ఖరారు కావడంతో ఇప్పుడాయనకు పోటీగా విపక్ష పార్టీ అభ్యర్థులెవరనే ప్రశ్న చర్చనీయాంశమైంది.
ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచిన కోనప్పకు ఈసారి బీజేపీ, బీఎస్పీల రూపంలో గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీల నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో నియోజకవర్గంలో రాజకీయ వేడి క్రమంగా రాజుకుంటుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా సిర్పూర్ సింహబలుడెవరన్నది తేలుతుందని వారు అంటున్నారు.
పోటీ తీవ్రం..
సిర్పూర్ నియోజకవర్గంలో అధికార బీఆర్‌ఎస్, బీజేపీ, బీఎస్పీల మధ్యే పోటీ ఉండనుంది. బీజేపీ నుంచి డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు, డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్‌లో ఎవరో ఒకరు బరిలో నిలవనుండగా.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్‌కుమార్ ఇక్కడి నుంచే పోటీ చేయనున్నారు. ఈ ముగ్గురు మధ్యే త్రిముఖ పోటీ ఉండనుంది. కమ్మ సామాజికవర్గానికి చెందిన కోనప్ప తొలిసారి 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు.
ఆ తరువాత 2009లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్య చేతిలో 7,414 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2014లో బీఎస్పీ తరఫున పోటీ చేసిన కోనప్ప తమ సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై 8,837 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఆ తరువాత ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోనప్ప తమ సమీప కాంగ్రెస్ అభ్యర్థి పాల్వయి హరీశ్‌బాబుపై 24,036 ఓట్ల మెజా ర్టీతో భారీ విజయం సాధించారు.
అనంతరం హరీశ్‌బాబు బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పా ర్టీలో సగానికిపైగా శ్రేణులు ఆయన వెంటే నడిచాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఫలితంగా నియోజకవర్గంలో బీజేపీ, అధి కార పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా మారింది.
17 సార్లు ఎన్నికలు..
సిర్పూర్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 1957 లో ద్విసభ్య నియోజకవర్గంగా రూపాంతరం చెంది, తిరిగి 1962లో జనరల్ నియోజకవర్గంగా ఏర్పడింది. 2010లో జరిగిన ఉప ఎన్నికతో సహా ఇప్పటి వర కు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 1972, 1978 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కె.వి.శేషవులు దివంగత ప్రధాని పీవీ నరసింహరావుకి అత్యంత సన్నిహితులు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ ఆరుసార్లు గె లువగా.. టీఆర్‌ఎస్, టీడీపీ మూడేసి సార్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి రెండుసార్లు, పీఎస్‌పీ, సోషలిస్ట్, బీఎస్పీ పార్టీలు ఒక్కోసారి గెలిచాయి. కాంగ్రెస్, బీఎ స్పీ, టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కోనేరు కోనప్ప తాజాగా నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
పాల్వాయి కుటుంబానికి పట్టు..
ఆది నుంచి నియోజకవర్గంలో డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు కుటుంబానికి మంచి పట్టుంది. హరీశ్‌బాబు తండ్రి పాల్వాయి పురుషోత్తంరావు స్థానికుడు. 1989, 1994 ఎన్నికల్లో పురుషోత్తంరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన భార్య పాల్వాయి రాజ్యలక్ష్మి సైతం 1999లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.
వరుసగా ఆ కుటుంబసభ్యులు మూడుసార్లు గెలవడం నియోజకవర్గంలో వారికున్న పట్టుకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి పాల్వాయి హరీశ్‌బాబుకు టికెట్ దక్కితే హోరాహోరీ పోరు ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఆర్‌ఎస్పీ సైతం ఇక్కడి నుంచే..
మరోవైపు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్‌కుమార్ సిర్పూర్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులు చాపకింద నీరులా నియోజకవర్గంలో తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. నిన్నటి వరకు ఎమ్మెల్యే కోనప్పకు అండగా నిలిచిన పొరుగు రాష్ట్రానికి ఆనుకుని ఉన్న కౌటాల మండలం గుండాయిపేట, మొగడ్‌దగడ్, తుమ్మిడిహెట్టి, వీర్దండి, తాటిపల్లి గ్రామాల ఓటర్లు బీఎస్పీ వైపు మొగ్గు చూపుతునట్లు తెలుస్తోంది.
పైగా ఇక్కడి ఓటర్లు మాటిస్తే వందశాతం ఓట్లు వేస్తారన్న నమ్మకం ఉంది. చింతలమానెపల్లి మండలం బూరెపల్లి గ్రామం ఎస్టీ వర్గానికి చెందిన సిడాం గణపతి(ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్)సైతం ఈ ఎన్నికల్లో బీఎస్పీకి మద్దతు ఇస్తున్నారు. బెజ్జూర్‌కు చెందిన మాజీ ప్రాథమిక వ్యవసాయ, సహకార సంఘం చైర్మన్ హర్షద్ ఉస్సేన్ బీఎస్పీలో కీలకంగా మారడంతో సిర్పూర్(టి), బెజ్జూర్, కాగజ్‌నగర్‌లో ఉన్న ముస్లిం ఓట్లు కొంత బీఎస్పీకి పడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి ఎవరో..?
కాంగ్రెస్‌లో టికెట్ ఆశిస్తున్న రావి శ్రీనివాస్, కోరళ్ల కృష్ణారెడ్డి ఇద్దరూ క్షేత్రస్థాయిలో విభేదాలకు అతీతంగా పనిచేసుకుపోతున్నారు. ఈ ఇద్దరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, విశ్వప్రసాద్‌కు సన్నిహితులుగానే గుర్తింపు పొందారు. ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేయాల న్న ఏకాభిప్రాయంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు యూనుస్ హుస్సే న్ కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
కోనప్పకు ఎదురుందా!
సిర్పూర్ నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా పేరొందిన కోనేరు కోనప్పకు ఈసారి జరగనున్న ఎన్నికలు ఆషామాషీగా ఉండవని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు 2.17 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో బీసీ, ఎంబీసీ, డీఎన్‌టీ కులాలకు చెందిన ఓటర్లు 60 శాతంపైగా ఉన్నారు. ఈ కులాల్లో అత్యధికంగా మహాత్మా జ్యోతిబా పూలే సామాజిక వర్గానికి చెందిన మాలి కులస్తులు 28 వేల ఓటర్లు ఉన్నారు.
ఎస్సీలు 53 వేలు, ఎస్టీలు 27 వేల వరకు ఉన్నట్లు సమాచారం. అలాగే ఆరె సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 40 వేలకు పైగా ఉన్నారు. ఇక ముస్లిం ఓటర్లు సైతం 35 వేలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ఓట్లు సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయంలో కీలకపాత్ర పోషించనున్నాయి. కాగా, బీఆర్‌ఎస్‌కు సంస్థాగతంగా బూత్‌స్థాయి నుంచి మండలస్థాయి వరకు బలమైన క్యాడర్ ఉండడం కొంత కలిసొచ్చే అంశం.
Comments
Please login to add a commentAdd a comment