ఆల్ హ్యాపీస్...
పొత్తుల్లేవని తేలడంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఆశావహుల్లో ఆనందం టిక్కెట్లు ఆశిస్తున్న నేతల్లో ఉత్సాహం
కాంగ్రెస్-టీఆర్‌ఎస్ పొత్తుపై స్పష్టత రావడంతో ఆ రెండు పార్టీల్లో టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహుల్లో ఆశలు చిగురించినట్లయింది. పొత్తులో ఎవరి సీటు గల్లంతవుతుందో.. ఎవరిని టిక్కెటు వరిస్తుందో తెలియక ఇన్నాళ్లు ఒకింత ఆందోళన, అయోమయంలో ఉన్న ఆ రెండు పార్టీ నాయకులకు కేసీఆర్ ప్రకటన ఊరటనిచ్చింది. పొత్తు ఉండదని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు శనివారం చేసిన ప్రకటనతో ఓ స్పష్టత వచ్చినట్లయింది.
ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా ప్రకటించారు. ఈ రెండు పార్టీల పొత్తు అంశం తేలిపోవడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీల టికెట్లు ఆశిస్తున్న నేతల్లో ఉత్సాహం నెలకొంది.
- సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్
పొత్తు ఉన్న పక్షంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఖాయమనే భావన నెలకొంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో రెండు పార్టీలకు కలిపి టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న ఒక్కరే బరిలో ఉంటారని భావించారు. కానీ పొత్తుండదని తేలడంతో కాంగ్రెస్ ఆశావాహుల్లో మరింత ఉత్సాహం నింపినట్లయింది.
ఇక్కడ డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి, పీసీసీ కార్యదర్శి సుజాత, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు భార్గవ్ దేశ్‌పాండే తదితరులు కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. పొత్తుపై స్పష్టత రావడంతో నాయకులు మరింత ఉత్సాహంతో టికెట్ కోసం ప్రయత్నాలు చేయనున్నారు.
ముథోల్‌లో కాంగ్రెస్‌లోనూ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌రెడ్డి టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వేణుగోపాలాచారి టీఆర్‌ఎస్‌లో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో పొత్తులో తమకు అవకాశం దక్కుతుందో లేదోననే భావన ఇన్నాళ్లు ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. పొత్తు లేదని తేలడంతో వీరిలో ఆశలు చిగురించినట్లయింది.
రోజుకో మలుపు తిరుగుతున్న మంచిర్యాల రాజకీయాల్లో కూడా పొత్తు అంశం తేలడంతో ఒక స్పష్టత వచ్చినట్లయింది. టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అరవింద్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో టిక్కెట్టుపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు శనివారం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు కూడా కాంగ్రెస్ టిక్కెటు ఆశిస్తున్నారు.
ఇప్పుడు పొత్తుల అంశం తేలడంతో రెండు పార్టీల్లోని నేతలు ఎవరికి వారే టిక్కెట్ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.నిర్మల్‌లో కాంగ్రెస్ టికెట్ మహేశ్వర్‌రెడ్డి ఆశిస్తున్నారు. టీఆర్‌ఎస్ నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు ఆశలు పెట్టుకున్నారు.
సిర్పూర్ కాగజ్‌నగర్‌లో టీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ప్రేంసాగర్‌రావు బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తున్న పక్షంలో ఆయా పార్టీల్లో ఒకరికి నిరాశే ఎదురయ్యేది.