ఢిల్లీలో రాహుల్‌గాంధీతో మహేశ్వర్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ముందస్తు ఎన్నికలకు సర్కారు సన్నద్ధమవుతున్న సంకేతాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ముఖ్య నాయకులు వర్గాల వారీగా విడిపోయినా... ఎన్నికలకు మాత్రం సిద్ధమేనని చెపుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో రాహుల్‌గాంధీ రెండు రోజుల పర్యటన విజయవంతం కావడంతో పార్టీ యంత్రాంగంలో కదనోత్సాహం నిండిందని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్‌చార్జిలతో రాహుల్‌గాంధీ శనివారం ఏర్పాటు చేసిన సమావేశం ప్రాధాన్యతను సంతరించుకొంది.
ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బృందంలో ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా ఉండడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, వర్గ విభేదాలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పూర్తిగా తెలుసు. ఉత్తమ్‌కు సొంత పార్టీలోనే ప్రత్యర్థిగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నేతృత్వంలో పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో గట్టి పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మహేశ్వర్‌రెడ్డి శక్తి యాప్ ప్రమోషన్‌లో చూపించిన ప్రతిభ ద్వారా ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే!
వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో జరగాల్సిన సాధారణ ఎన్నికలను ఆరు నెలల ముందుగానే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు యోచిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వచ్చే నెల 2న హైదరాబాద్ సమీపంలో లక్షలాది మందితో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ ద్వారానే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ముందస్తుకు సిద్ధమేనని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం రాహుల్‌గాంధీతో జరిగిన సమావేశంలో సైతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని వివరించి, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు అధినేతకు తెలియజేశారు. ముందస్తు ఎన్నికలు వస్తే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హవానే కాంగ్రెస్‌లో నడుస్తుందని భావిస్తున్న ఆయన వర్గం టిక్కెట్ల కేటాయింపులో కూడా పెద్దపాలు దక్కుతుందని యోచిస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో మహేశ్వర్‌రెడ్డి ఆలోచన కూడా అదే. ఎన్నికల్లో తమ వర్గానికి ఎక్కువ సీట్లు దక్కేలా పావులు కదిపే ఆలోచనతో ఉన్నారు. పీసీసీ అధ్యక్షులు, ఇన్‌చార్జిలతో రాహుల్‌గాంధీ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ, మహేశ్వర్‌రెడ్డి మాట్లాడేందుకు కొంత సమయం ఇవ్వడం గమనార్హం. శక్తి యాప్‌ను విస్తృతంగా వినియోగిస్తూ పార్టీకి అండగా నిలుస్తున్న దేశంలోని పది మందిని గౌరవించే కార్యక్రమాన్ని రాహుల్‌గాంధీ చేపట్టగా, వారిలో మహేశ్వర్‌రెడ్డి ఉండడం గమనార్హం. కాగా మహేశ్వర్‌రెడ్డి వర్గంతో పాటు జిల్లాలో ప్రేంసాగర్‌రావు గ్రూపు కూడా టిక్కెట్ల వేటలో తమవంతు ప్రయత్నాల్లో ఉన్నారు. మండలాల వారీగా బలాన్ని మరింత పెంచుకొని టిక్కెట్ల పోటీలో ముందు వరుసలో ఉండాలని యోచిస్తున్నారు.
రాహుల్‌గాంధీకి సంస్థాగత నివేదిక
డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదుకు ఉద్ధేశించిన శక్తి యాప్, బూత్ కమిటీల ఏర్పాటు గురించి నివేదికను సమర్పించారు. శక్తి యాప్ ద్వారా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదిలాబాద్ పూర్వ జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ నేపథ్యంలో మహేశ్వర్‌రెడ్డిని ఏఐసీసీ తరుపున రాహుల్‌గాంధీ అభినందించారు.
అదే సమయంలో కొత్త జిల్లాల వారీగా డీసీసీల ఏర్పాటు అంశం పీసీసీ పరిధిలో ఉండడంతో తన వర్గీయులను అధ్యక్షులుగా నియమించుకునేందుకు ఈ ఢిల్లీ పర్యటనను మహేశ్వర్‌రెడ్డి వినియోగించుకున్నట్లు సమాచారం. నిర్మల్ మినహా మంచిర్యాల, కుమురంభీం, ఆదిలాబాద్ జిల్లాల పార్టీ అధ్యక్షుల కోసం మహేశ్వర్‌రెడ్డి వర్గంతో పాటు ప్రేంసాగర్‌రావు వర్గం కూడా తీవ్ర స్థాయిలో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి తన పంతం నెగ్గించుకొనే యోచనతో మహేశ్వర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు.
వేచి చూసే దోరణిలో ప్రేంసాగర్‌రావు వర్గం
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మహేశ్వర్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీతో భేటీ కావడంతో ప్రేంసాగర్‌రావు వర్గం వేచి చూసే దోరణితో ఉంది. రాష్ట్ర స్థాయిలో భట్టి విక్రమార్క, డీకే అరుణ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రేవంత్‌రెడ్డిలకు చెందిన గ్రూపులో ఉన్న ప్రేంసాగర్‌రావు, వివిధ నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న ఈ వర్గం నాయకులు స్థానికంగా పట్టును పెంచుకునే పనిలో పడ్డారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత ఢిల్లీలో టిక్కెట్ల పంపిణీ నాటికి అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయని వీరు భావిస్తున్నారు.
ఆదివాసీ సమస్యతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు సోయం బాపూరావు, ఆత్రం సక్కు, రేవంత్‌రెడ్డితో పాటు రాహుల్‌గాంధీ సమక్షంలో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బోడ జనార్దన్, రావి శ్రీనివాస్, గతంలో పోటీ చేసి ఓడిపోయిన గండ్రత్ సుజాత, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తమ వైపు ఉన్నందున వీరికి టిక్కెట్లు ఖాయమని ప్రేంసాగర్‌రావు వర్గం భావిస్తోంది. వీరందరికీ స్థానికంగా కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు వెల్లడంతో కార్యాచరణ ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment