president poll
-
శశి థరూర్‌తో నన్ను పోల్చకండి.. మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో పోటీలో నిలిచిన మల్లిఖార్జున ఖర్గే తన ప్రత్యర్థి శశిథరూర్‌పై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అధికార వికేంద్రీకరణ దిశగా వెళతానన్న శశిథరూర్ వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా. ఆయనతో తనను పోల్చవద్దని ఖర్గే స్పష్టం చేశారు. ఈ క్రమంలో జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖర్గే బుధవారం మాట్లాడుతూ.. తాను బ్లాక్ అధ్యక్షుడి నుంచి ఈ స్థాయికి సొంతంగా ఎదిగినట్లు తెలిపారు. ఆ సమయంలో శశి థరూర్ ఉన్నారా అని ప్రశ్నించారు. దయచేసి థరూర్‌తో తనను పోల్చవద్దని అని కోరారు. ఆ దిశగా పనిచేస్తా శశిథరూర్ తన మేనిఫెస్టోతో ముందుకు వెళ్లవచ్చని.. అయితే ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడమే తన ఎజెండా అని తెలిపారు. ఆ దిశగానే పనిచేస్తానని పేర్కొన్నారు. డిక్లరేషన్‌లో ఉన్న మూడు నిర్ణయాలను (ప్రజల దృష్టిని ఆకర్షించడం, ఎన్నికల నిర్వహణ, జాతీయ స్థాయిలో పార్టీ శ్రేణులకు శిక్షణ) అమలు చేసే విధంగా ముందుకు సాగుతానని వెల్లడించారు. చదవండి:నిప్పంటించుకోబోయిన భార్యాభర్తలు.. రెప్పపాటులో కాపాడిన స్థానికులు యువ నాయకత్వం అవసరమా? సీనియర్ నేతలు, నిపుణులందరిని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఖర్గే చెప్పారు. పార్టీని ప్రస్తుత సంక్షోభం, క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌కు యువ నాయకత్వం అవసరమా అని ప్రశ్నించగా.. పార్టీలో అనుభవం ఉన్న వ్యక్తిగా ఎవరేంటనేది తనకు అన్నీ తెలుసని అన్నారు. అవసరమైనప్పుడు వారి సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. ఖర్గేకే మద్దతు! ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ ఇద్దరూ తలపడనున్నారు. గాంధీ కుటుంబీకుల మద్దతు ఉండటంతో ఈ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అంతేగాక పార్టీలోని సీనియర్లు అందరూ సైతం ఖర్గేకు మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థి ఖర్గేకు ఓటు వేయాలని చెబుతున్న సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఈ ఫలితాలు ఆశ్చర్యం కలిగించవచ్చని మంగళవారం శశిథరూర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 9,000 మంది కాంగ్రెస్ డెలిగేట్లు ఓటు వేయనున్నారు. 19న ఓట్ల లెక్కింపు జరుగనుంది. -
పోటీ అక్కర్లేదన్నా పట్టుబట్టాడు.. ఖర్గే కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అందరి ఆమోదంతో ఒకే అభ్యర్థి ఉంటే బాగుంటుందని, ఎన్నిక ఏకగ్రీవం కావాలని అభిలషించానని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలో తన నివాసంలో ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో ఖర్గే పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు. ‘సర్వామోదంతో, పోటీ లేకుండా ఒక్కరినే పార్టీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని నా ప్రతిపాదన. అదే విషయాన్ని శశిథరూర్‌కు చెప్పా. నాతో ఆయన విబేధించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నిక మంచిది అని థరూర్ వాదించారు. తానూ బరిలో దిగుతానని చెప్పారు’ అని ఖర్గే మీడియాకు వెల్లడించారు. ‘ఒక వేళ పార్టీ చీఫ్‌గా ఎన్నికైతే గాంధీల కుటుంబం ఇచ్చే అమూల్యమైన సలహాలను పరిగణనలోకి తీసుకుంటా. నేనేమీ గాంధీలు బలపరిచిన అధికారిక అభ్యర్థిని కాదు. ఇప్పుడు పార్టీలో జీ–23 అంటూ ఎలాంటి అసంతృప్త నేతల కూటమి లేదు. అందరం కాంగ్రెస్ నాయకులమే. ఆర్ఎస్ఎస్–బీజేపీని సమష్టిగా ఎదుర్కొంటాం ’అని ఖర్గే స్పష్టంచేశారు. ‘నేను పార్టీలో ఎవరిపైనో పోటీకి దిగలేదు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో భాగమే ఈ పోటీ. పార్టీలో సమూల మార్పులు ఉన్నపళాన జరగవు’ అని ఖర్గే అభిప్రాయపడ్డారు. పార్టీపై గాంధీలు గుత్తాధిపత్యం చేస్తారనే బీజేపీ ఆరోపణను ఖర్గే తిప్పికొట్టారు. ‘కాంగ్రెస్‌లో ఎన్నికల ప్రాధికార వ్యవస్థ ఉంది. ఓటింగ్ హక్కులున్నాయి. బీజేపీలో అలాంటిదేమీ లేదు. బీజేపీలో ఎన్నికలు జరిగాయా? జేపీ నడ్డాను ఎన్నుకున్నదెవరు? ఆ పార్టీలో డెలిగేట్స్ ఎంతమంది?’ అని ఖర్గే ప్రశ్నించారు. థరూర్ బహిరంగ చర్చ ప్రతిపాదనను తిరస్కరించారు. చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ -
బహిరంగ చర్చకు సిద్ధం.. అప్పుడే ఎవరేంటో తెలుస్తుంది
న్యూఢిల్లీ: ఘన చరిత గల కాంగ్రెస్ పార్టీకి తదుపరి అధ్యక్షులు ఎవరనే అంశంలో ఇరు అభ్యర్థుల మధ్య ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చాసమరానికి తాను సిద్ధమని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి శశిథరూర్ తన మనసులో మాట బయటపెట్టారు. ఇటీవల తీవ్ర ఉత్కంఠ రేపిన బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ సారథి, దేశ ప్రధాని రేసులో రిషి సునాక్, లిజ్ ట్రస్ నేరుగా పలుమార్లు చర్చావేదికలపై బలాబలాలు ప్రదర్శించిన నేపథ్యంలో అదే మాదిరి పోటీని థరూర్ కోరుకోవడం విశేషం. ఆదివారం థరూర్ పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖాముఖిలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘ సమర్థవంతమైన నాయకుడిగా నన్ను నేను ఎప్పుడో రుజువు చేసుకున్నా. దాదాపు మూడు దశాబ్దాలు ఐక్యరాజ్యసమితిలో కీలకమైన పలు పదవుల్లో బాధ్యతలు నెరవేర్చా. భారత్‌లో రాజకీయ ప్రస్థానానికొస్తే.. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్‌కు వ్యవస్థాపక అధ్యక్షుడిని. మొదలుపెట్టిన ఐదేళ్లలోనే 20 రాష్ట్రాల్లో పదివేల మందికిపైగా ఇందులో క్రియాశీలక సభ్యులయ్యారు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు కేవలం రెండున్నర వారాల వ్యవధి ఉంది. ఇంత తక్కువ టైమ్‌లో అందరు 9,000 మంది ప్రతినిధులను కలవడం కష్టం. అదే అభ్యర్థుల బహిరంగ చర్చలు జరిగితే ఎవరి సత్తా ఏమిటో ఇట్టే తెలుస్తుంది’ అని అన్నారు. చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ -
ఐక్యరాజ్యసమితి నుంచి రాజకీయాల్లోకి.. శశి థరూర్ ప్రస్థానమిదే..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో నిలిచిన మాటల మాంత్రికుడు శశి థరూర్ (66) అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాను ఎవరో ఆడించినట్లు ఆడే తోలుబొమ్మను కాదని చెబుతున్నారు. విభిన్న రాజకీయవేత్తగా థరూర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన చుట్టూ వివాదాలకు లెక్కలేదు. శశి థరూర్ 1956 మార్చి 9న లండన్‌లో జన్మించారు. ఢిల్లీలోని ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో హిస్టరీలో ఆనర్స్ పూర్తిచేశారు. విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. అమెరికాలోని మెడ్‌ఫోర్డ్‌లో ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లొమసీ నుంచి మాస్టర్స్ డిగ్రీ అభ్యసించారు. అక్కడే 1978లో పీహెచ్డీ పూర్తిచేశారు. అనంతరం ఐక్యరాజ్యసమితిలో చేరారు. రష్యా–పశ్చిమ దేశాల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక శాంతి స్థాపన కోసం కృషి చేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శికి సీనియర్ సలహాదారుగా సేవలందించారు. ఐరాసలో కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండర్ సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించారు. 2006లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా భారత్ తరఫున అధికారిక అభ్యర్థిగా పోటీపడ్డారు. రెండో స్థానంలో నిలిచారు. అప్పట్లో సెక్రెటరీ జనరల్‌గా దక్షిణ కొరియా రాజకీయ నాయకుడు బాన్ కీ మూన్ విజయం సాధించారు. 2009లో అంతర్జాతీయ సివిల్ సర్వెంట్‌గా థరూర్ పదవీ విరమణ పొందారు. ఇండియాలో అడుగుపెట్టారు. అదే ఏడాది రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009లో తొలిసారిగా కాంగ్రెస్ టికెట్‌పై కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. యూపీఏ సర్కారు హయాంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2010 ఏప్రిల్‌లో రాజీనామా చేశారు. 2014 జనవరిలో ఆయన భార్య సునంద పుష్కర్ ఓ హోటల్లో శమమై కనిపించడం దేశంలో సంచలనం సృష్టించింది. ఆయనపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ కోర్టు గత ఏడాది థరూర్‌ను నిర్దోషిగా ప్రకటించింది. 2014, 2019 ఎన్నికల్లోనూ తిరువనంతపురం నుంచి ఆయన విజయం సాధించారు. రచయితగా థరూర్‌కు అంతర్జాతీయంగా పేరుప్రతిష్టలు ఉన్నాయి. 23 పుస్తకాలు రాశారు. పులు పురస్కారాలు అందుకున్నారు. ఇందులో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలు సైతం ఉండడం విశేషం. థరూర్ ఒక దశలో కాంగ్రెస్ నాయకత్వం తీరుపై నిప్పులు చెరిగారు. జి–23 గ్రూప్ నేతల్లో ఒకరిగా అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో సంస్కరణల ఆవశ్యకతను నొక్కిచెప్పారు. సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో థరూర్ దిట్ట. 2013 దాకా ట్విట్టర్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న ఇండియన్ లీడర్ థరూరే కావడం గమనార్హం. ఆ తర్వాత ఆ స్థానాన్ని నరేంద్ర మోదీ ఆక్రమించారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో గాంధీల వీరవిధేయుడు -
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. రేసు నుంచి తప్పుకున్న డిగ్గీ రాజా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజున అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు పోటీ చేస్తారని భావించిన దిగ్విజయ్ సింగ్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష పదవికి మల్లికార్జున్ ఖర్గే పోటీ చేసున్నందునే తాను బరిలో నిలవడం లేదని చెప్పారు. ఖర్గేకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దిగ్విజయ్ సింగ్ నిర్ణయంతో ఇప్పుడు పోటీ శశిథరూర్, ఖర్గే మధ్యే ఉండనుంది. ఇద్దరు కాసేపట్లో అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ సమర్పిస్తారు. గాంధీ కుటుంబం విధేయుడిగా పేరున్న ఖర్గేనే విజయం సాధించే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అని మల్లగుల్లాలు పడిన కాంగ్రెస్ జీ-23నేతలు బరిలో నిలవద్దని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తానూ పోటీ చేస్తానని జార్ఖండ్ నేత కేఎన్ త్రిపాఠి ప్రకటించారు. మధ్యాహ్నం నామినేషన్ సమర్పిస్తానని చెప్పారు. అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చని సోనియా గాంధీ చెప్పారని పేర్కొన్నారు. ఈ సారి గాంధీ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండటంతో 25 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబానికి చెందని వారు పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి 1994లో పీవీ నరసింహారావు చివరిసారిగా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు శశిథరూర్, ఖర్గేలో ఎవరు గెలిచినా మరోసారి ఆ పదవి చేపట్టిన దక్షిణాది నేతగా అరుదైన ఘనత సాధిస్తారు. వీవీ నరసింహారావు తర్వాత 1996-98 వరకు సీతారాం కేసరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి 2017వరకు సోనియా గాంధీనే ఆ పదవిలో కొనసాగారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్ట్.. చివరిరోజు తెరపైకి కొత్త పేరు -
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్ట్.. చివరిరోజు తెరపైకి కొత్త పేరు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తెరపైకి కొత్తపేరు వచ్చింది. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖేర్గే రేసులో ఉండనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్లకు చివరి రోజున అనూహ్యంగా ఖర్గే బరిలోకి రావడం ఆసక్తికరంగా మారింది. హస్తం పార్టీ అధ్యక్ష పదవికోసం సీనియర్ నేతలు శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్‌లో ఊహించని పరిణామాల కారణంగా సీఎం అశోక్ గహ్లోత్ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో గాంధీ కుటుంబం విధేయుల్లో ఒకరైన ఖర్గేను బరిలోకి దింపాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఆమె ఆమోదం తెలిపితే ఖర్గే వెంటనే నామినేషన్ దాఖలు చేస్తారని పేర్కొన్నాయి. ఈయన పోటీతో అధ్యక్షపదవికి త్రిముఖ పోరు ఉండనుంది. దిగ్విజయ్ డౌట్! మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దిగ్విజయ్ సింగ్.. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఖర్గే నివాసానికి వెళ్లారు. పోటీలో ఉండాలంటే బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు వీరు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. అయితే గాంధీల విధేయుడైన ఖర్గే బరిలో ఉండటంతో దిగ్వజయ్ సింగ్ పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. దళిత వర్గానికి చెందిన ఖర్గే.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. 8 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు లోక్ ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. హోంమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. జీ-23నేతల ఆయోమయం మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని జీ-23 నేతలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు సీనియర్ నేతలు పృథ్విరాజ్ చవాన్, భూపిందర్ హుడా, మనీశ్ తివారీలు ఆనంద్ శర్మ నివాసంలో భేటీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే పోటీ చేయాలా? వద్దా? అనే విషయంపై వీరు సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. అధ్యక్ష పదవి రేసులో నిలిచేందుకు ముకుల్ వాస్నిక్, కుమారి సెల్జా పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు పార్టీ సన్నిహత వర్గాలు పేర్కొన్నాయి. చాలా ఏళ్ల తర్వాత దక్షిణాది నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్‌కు శుక్రవారం(సెప్టెంబర్ 30) చివరి తేది. అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ సారి గాంధీ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండటంతో 25 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబానికి చెందని వారు పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి 1994లో పీవీ నరసింహారావు చివరిసారిగా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు శశిథరూర్, ఖర్గే ఎవరు గెలిచినా మరోసారి ఆ పదవి చేపట్టిన దక్షిణాది నేతగా అరుదైన ఘనత సాధిస్తారు. వీవీ నరసింహారావు తర్వాత 1996-98 వరకు సీతారాం కేసరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి 2017వరకు సోనియా గాంధీనే ఆ పదవిలో కొనసాగారు. చదవండి: ‘గాంధీలు లేకుండా కాంగ్రెస్ పార్టీ శూన్యం’ -
Draupadi Murmu: ద్రౌపది ముర్ముకు యశ్వంత్ సిన్హా శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు.. ఆమె చేతిలో ఓడిపోయిన విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శుభాకాంక్షలు తెలిపారు. భారత 15వ రాష్ట్రపతి ఎవరికీ భయపడకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా రాజ్యాంగానికి కట్టుబడి బాధ్యతలు నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. దేశ ప్రజలతో పాటు తాను కూడా ముర్ముకు అభినందనలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. I join my fellow citizens in congratulating Smt Droupadi Murmu on her victory in the Presidential Election 2022. India hopes that as the 15th President of the Republic she functions as the Custodian of the Constitution without fear or favour. pic.twitter.com/0gG3pdvTor — Yashwant Sinha (@YashwantSinha) July 21, 2022 రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. విజయం అనంతరం ఆమెకు ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు, ఇతర రాజకీయ నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చదవండి: కొత్త చరిత్ర.. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము -
Presidential Polls: ఎన్నిక పద్ధతి, అధికార విధులు ఇవే!
భారత రాజ్యాంగం 5వ భాగంలో 52 నుంచి 78 వరకు ఉన్న ప్రకరణలు కేంద్ర కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన విషయాలను తెలుపుతాయి. కేంద్ర కార్య నిర్వాహకశాఖలో.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్‌లు సభ్యులుగా ఉంటారు. దీనికి అధిపతి రాష్ట్రపతి. ప్రకరణ 52 ప్రకారం– భారత దేశానికి రాష్ట్రపతి ఉంటారు. ప్రకరణ 53 ప్రకారం– కేంద్ర కార్య నిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతికి దక్కుతాయి. ఈ అధికారాలను రాష్ట్రపతి స్వయంగా కానీ, తన కింది అధికారుల సహాయంతోగాని నిర్వర్తిస్తారు. కింది అధికారులు అంటే.. మంత్రి మండలిగా పరిగణించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారతదేశంలో బ్రిటిష్ తరహా పార్లమెంటు ప్రభుత్వాన్ని కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఏర్పాటు చేశారు. రాజ్యాంగపరంగా అన్ని అధికారాలు రాష్ట్రపతికి, సంక్రమించినప్పటికీ, వాటిని చెలాయించేది మాత్రం ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రిమండలి మాత్రమే. రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ► ప్రకరణ 324 ప్రకారం–కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి రాజ్యాంగంలో సమగ్రమైన వివరణ లేదు. అందుకోసం 1952లో పార్లమెంటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టాన్ని రూపొందించింది. 1974లో రాష్ట్రపతి ఎన్నిక నియమావళిని రూపొందించారు. రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడడానికి ముందు 60 రోజులు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ►రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రొటేషన్ పద్ధతిలో లోక్‌సభ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారు.15వ రాష్ట్రపతి (రామనాథ్ కోవింద్) ఎన్నికలో రిటర్నింగ్ అధికారిగా లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా వ్యవహరించారు. 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడీ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ప్రకరణ 54 ప్రకారం– రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఒక ప్రత్యేక ఎన్నికల గణం ఉంటుంది(ఎలక్టోరల్ కాలేజ్). ఇందులో పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర విధానసభకు ఎన్నికైన సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్ఛేరి శాసనసభ సభ్యులు కూడా పాల్గొంటారు. ఢిల్లీ, పుదుచ్ఛేరి సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు. ఇది 1995 జూ¯Œ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. జమ్మూ, కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా చేర్చాలంటే.. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ►ప్రకరణ 55(3)లో రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతిని ప్రక్రియను పేర్కొన్నారు. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఒక ఓటు బదలాయింపు పద్ధతి(రహస్య ఓటు) ద్వారా ఎన్నికవుతారు. అయితే ఈ పద్ధతిని రాజ్యాంగ పరిషత్‌లో అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించారు. ఈ పద్ధతిని అమెరికాకు చెందిన థామస్ హేర్ అనే రాజనీతి శాస్త్రవేత్త ఆవిష్కరించారు. ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లయిన ఎమ్మెల్యే, ఎంపీల ఓటు విలువలను ఒక ప్రత్యేక సూత్రం ద్వారా లెక్కిస్తారు. ఎమ్మెల్యే ఓటు విలువ = (రాష్ట్రం మొత్తం జనాభా/ఎన్నికైన విధానసభ సభ్యుల సంఖ్య)(1/1000) ►లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 543 ►రాజ్యాసభలో మొత్తం సభ్యుల సంఖ్య 233 ►1971లో సేకరించిన జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటారు. జనాభా నియంత్రణ సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు ఓటు విలువలో నష్టపోకుండా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని అమలులోకి తెచ్చారు. 84వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 2026వరకు పొడిగించారు. ►ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ 159, తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132గా ఉంది. అత్యధిక ఓటు విలువ కలిగిన రాష్ట్రాలు: ఉత్తర ప్రదేశ్–208, తమిళనాడు–176, జార్ఖండ్–176, మహారాష్ట్ర–175, బీహార్–173. ►అలాగే అతి తక్కువ ఓటు విలువ కలిగిన రాష్ట్రాలు: సిక్కిం–7, మిజోరాం–8, అరుణాచల్‌ప్రదేశ్–8, నాగాలాండ్–9. ఎంపీల ఓటు విలువను గణించే పద్ధతి ఎంపీల ఓటు విలువ = మొత్తం రాష్ట్రాల శాసన సభ్యుల ఓటు విలువ/ఎన్నికైన పార్లమెంటు సభ్యుల సంఖ్య ►ఎంపీల ఓటు విలువ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. n 2022లో 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓటు విలువ 700. n రాష్ట్రపతి ఎన్నిక కావడానికి అభ్యర్ధికి కోటా ఓట్లు రావాలి. కోటా అంటే.. మొత్తం పోలై చెల్లిన ఓట్లలో సగం కంటె ఎక్కువ. రాష్ట్రపతి ఎన్నిక–రెండు ప్రధాన సూత్రాలు 1. ఏకరూపతా సూత్రం (Principle of Uniformity, Equality) 2. సామ్యతా సూత్రం (Principle of Uniformity, Equality) మొదటి సూత్రం ప్రకారం–రాష్ట్ర విధానసభ్యుని ఓటు విలువ ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ఓటు విలువ మారుతుంది. రెండో సూత్రం ప్రకారం– దేశంలోని ఎంపీల ఓటు విలువ ఒకే విధంగా ఉంటుంది. రాష్ట్రాల వారీగా తేడాలుండవు. ఉదాహరణకు దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 4033 (జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీ రద్దయి, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినందున జమ్మూ–కశ్మీర్‌కు చెందిన 87 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలో పాల్గొనరు.) ►దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ –5,43,231 ►దేశంలోని మొత్తం ఎన్నికైన ఎంపీల సంఖ్య–776 ► దేశంలోని మొత్తం ఎంపీల ఓటు విలువ –5,43,200 ►మొత్తం ఎమ్మెల్యేల + ఎంపీల ఓటు విలువ = 10,86,431 ► నియోజక గణంలో మొత్తం ఓటర్ల సంఖ్య = 4033 + 776 = 4809 అంటే మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ, మొత్తం ఎంపీల ఓటు విలువతో దాదాపు సమానం. దీనినే ప్రిన్సిçపల్ ఆఫ్ పారిటీ అంటారు. రాష్ట్రాలకు, కేంద్రానికి రాష్ట్రపతి ఎన్నికలో సమాన ప్రాతినిధ్యం కల్పించడమే ఈ సూత్రాలను పాటించడానికి కారణం. అందుకే భారత రాష్ట్రపతి యావత్ జాతికి ప్రాతినిధ్యం వహిస్తారు. రాష్ట్రపతి – అర్హతలు ►ప్రకరణ 58లో రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి అవసరమైన అర్హతలను పేర్కొన్నారు. ►భారతదేశ పౌరుడై ఉండాలి (సహజ లేదా సహజీకృత పౌరసత్వం) ►35 సంవత్సరాలు నిండి ఉండాలి. లాభదాయక ప్రభుత్వ పదవుల్లో ఉండరాదు. ►శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. ►నేరారోపణ రుజువై ఉండరాదు. దివాళా తీసి ఉండరాదు. ► లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావల్సిన ఇతర అర్హతలు ఉండాలి. ►పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి. ► రాష్ట్రపతి అర్హతలకు సంబంధించి చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. రాష్ట్రపతిగా పోటీ చేయడానికి కనీస విద్యార్హత అనేది రాజ్యాంగంలో పేర్కొనలేదు. ►లాభాదాయక పదవులు(Office of Profit) అనే పదానికి రాజ్యాంగంలో నిర్వచనం లేదు. 1959 లో పార్లమెంట్ సభ్యుల అనర్హతలు,నియంత్రణ చట్టం రూపొందించి ఈ పదానికి నిర్వచనం తెలిపి.. కొన్ని పదవులను లాభాదాయక పదవులను మినహాయించింది. వీటికి కాలానుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తారు. లాభదాయక పదవుల్లో ఉండరాదు అనే అర్హతకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రులు, ఎంఎల్ఏ, ఎంíపీలకు జీతభత్యాలుంటాయి. వారు ఆ పదవులలో కొనసాగుతూనే మరొక పదవికి కూడా పోటీ చేయవచ్చు. పోటీ చేయడానికి ముందే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అయితే, వారు రాష్ట్రపతిగా ఎన్నికైతే వారి సభలో సభ్యత్వాన్ని కోల్పోతారు. షరతులు ►రాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థి కొన్ని షరతులను పూర్తి చేయాల్సి ఉంటుంది. 1952లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టాన్ని రూపొందించారు. 1997లో దీనిని సవరించారు. ఈ సవరణ ప్రకారం ఈ కింది షరతులు నిర్దేశించారు. ► అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని 50 మంది నియోజకగణ సభ్యులు ప్రతిపాదించాలి. మరొక 50 మంది సభ్యులు బలపరచాలి. ►ఒక సభ్యుడు, ఒక అభ్యర్ధిని మాత్రమే ప్రతిపాదించాలి లేదా సమర్ధించాలి. ►అభ్యర్ధి నామినేషన్ పత్రంతోపాటు రూ.15,000లు ధరావత్తుగా రిజర్వు బ్యాంకులో లేదా ప్రభుత్వ ట్రెజరీలో డిపాజిట్ చేయాలి. రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళలు ►మనోహర హోల్కర్ (1967) ►మహారాణి గురుచరణ్ కౌర్ (1969) ► లక్ష్మీ సెహగల్ (2002) ► ప్రతిభా పాటిల్ (2007) ►మీరా కుమార్ (2017) ►1967లో రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధికంగా 17 మంది పోటీ చేశారు. ►అతి పెద్ద వయస్సులో రాష్ట్రపతి అయిన వారు–కె.ఆర్.నారాయణన్ . ►అతి చిన్న వయస్సులో రాష్ట్రపతి అయిన వారు–నీలం సంజీవరెడ్డి ►ముఖ్యమంత్రులుగా పనిచేసి రాష్ట్రపతులు అయినవారు– నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్‌సింగ్, శంకర్ దయాళ్ శర్మ. ►అత్యధిక రాష్ట్రపతులను అందించిన రాష్ట్రం–తమిళనాడు (సర్వేపల్లి రాధాక్రిష్ణన్ , ఆర్.వెంకట్రామన్ , ఎ.పి.జె అబ్దుల్ కలామ్) ►స్వతంత్ర అభ్యర్థి, ట్రేడ్ యూనియన్ ఉద్యమ నేపథ్యంతో రాష్ట్రపతి అయినవారు– వి.వి.గిరి ► రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయిన వారు–ఎ.పి.జె.అబ్దుల్ కలామ్. ►రాష్ట్రపతిగా వ్యవహరించిన ఏకైక సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి– యం.హిదయతుల్లా 16వ రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ ►నోటిఫికేషన్ విడుదల: జూన్ 15, 2022 ►నామినేషన్ దాఖలుకు చివరి తేదీ:జూన్ 29, 2022 ► ఉపసంహరణ తేదీ: జూలై 2, 2022 ►ఎన్నిక తేదీ: జూలై 18, 2022 ► ఓట్ల లెక్కింపు: జూలై 21, 2022 ►రిటర్నింగ్ అధికారి: ప్రమోద్ చంద్ర మోడీ (రాజ్యసభ సెక్రటరీ జనరల్) ►ఆంధ్రప్రదేశ్‌లో సహాయ రిటర్నింగ్ అధికారి: రాజ్‌కుమార్ (ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి) ►తెలంగాణాలో సహాయ రిటర్నింగ్ అధికారి: ఉపేందర్ రెడ్డి (తెలంగాణ అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి –బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్ నిపుణులు -
రాష్ట్రపతి రేసులో 92 మంది!
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి పదవి కోసం ఎంతమంది బరిలోకి దిగారో తెలుసా.. 90మందికిపైగానే. అదేమిటీ ఎన్డీయే తరుపున రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ పార్టీ తరుపున మీరా కుమార్ మాత్రమేగా పోటిలోకి దిగిందని ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజమే..మొత్తం 90మందికి పైగానే రాష్ట్రపతి పదవి కోసం నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయితే, వారిలో 90మందికి పైగా నామినేషన్ పేపర్లను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. వాటికి సరైన ఆధారాలు, రుజువు పత్రాలు సమర్పించలేదనే కారణంతోపాటు చట్టప్రతినిధుల మద్దతులేదనే కారణంతో వాటిని రిజెక్ట్ చేసింది. చివరకు రామ్‌నాథ్ కోవింద్, మీరా కుమార్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు మాత్రమే విలువైనవిగా, అన్ని రకాలుగా అర్హతలు గలవిగా ఈసీ గుర్తించింది.