
భారత రాజ్యాంగం 5వ భాగంలో 52 నుంచి 78 వరకు ఉన్న ప్రకరణలు కేంద్ర కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన విషయాలను తెలుపుతాయి. కేంద్ర కార్య నిర్వాహకశాఖలో.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్‌లు సభ్యులుగా ఉంటారు. దీనికి అధిపతి రాష్ట్రపతి. ప్రకరణ 52 ప్రకారం– భారత దేశానికి రాష్ట్రపతి ఉంటారు. ప్రకరణ 53 ప్రకారం– కేంద్ర కార్య నిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతికి దక్కుతాయి. ఈ అధికారాలను రాష్ట్రపతి స్వయంగా కానీ, తన కింది అధికారుల సహాయంతోగాని నిర్వర్తిస్తారు. కింది అధికారులు అంటే.. మంత్రి మండలిగా పరిగణించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారతదేశంలో బ్రిటిష్ తరహా పార్లమెంటు ప్రభుత్వాన్ని కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఏర్పాటు చేశారు. రాజ్యాంగపరంగా అన్ని అధికారాలు రాష్ట్రపతికి, సంక్రమించినప్పటికీ, వాటిని చెలాయించేది మాత్రం ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రిమండలి మాత్రమే.
రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి
► ప్రకరణ 324 ప్రకారం–కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి రాజ్యాంగంలో సమగ్రమైన వివరణ లేదు. అందుకోసం 1952లో పార్లమెంటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టాన్ని రూపొందించింది. 1974లో రాష్ట్రపతి ఎన్నిక నియమావళిని రూపొందించారు. రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడడానికి ముందు 60 రోజులు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
►రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రొటేషన్ పద్ధతిలో లోక్‌సభ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారు.15వ రాష్ట్రపతి (రామనాథ్ కోవింద్) ఎన్నికలో రిటర్నింగ్ అధికారిగా లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా వ్యవహరించారు. 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడీ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ప్రకరణ 54 ప్రకారం– రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఒక ప్రత్యేక ఎన్నికల గణం ఉంటుంది(ఎలక్టోరల్ కాలేజ్). ఇందులో పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర విధానసభకు ఎన్నికైన సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్ఛేరి శాసనసభ సభ్యులు కూడా పాల్గొంటారు. ఢిల్లీ, పుదుచ్ఛేరి సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు. ఇది 1995 జూ¯Œ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. జమ్మూ, కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా చేర్చాలంటే.. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.
►ప్రకరణ 55(3)లో రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతిని ప్రక్రియను పేర్కొన్నారు. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఒక ఓటు బదలాయింపు పద్ధతి(రహస్య ఓటు) ద్వారా ఎన్నికవుతారు. అయితే ఈ పద్ధతిని రాజ్యాంగ పరిషత్‌లో అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ ప్రతిపాదించారు. ఈ పద్ధతిని అమెరికాకు చెందిన థామస్ హేర్ అనే రాజనీతి శాస్త్రవేత్త ఆవిష్కరించారు. ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లయిన ఎమ్మెల్యే, ఎంపీల ఓటు విలువలను ఒక ప్రత్యేక సూత్రం ద్వారా లెక్కిస్తారు.
ఎమ్మెల్యే ఓటు విలువ = (రాష్ట్రం మొత్తం జనాభా/ఎన్నికైన విధానసభ సభ్యుల సంఖ్య)(1/1000)
►లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 543
►రాజ్యాసభలో మొత్తం సభ్యుల సంఖ్య 233
►1971లో సేకరించిన జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటారు. జనాభా నియంత్రణ సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు ఓటు విలువలో నష్టపోకుండా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని అమలులోకి తెచ్చారు. 84వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 2026వరకు పొడిగించారు.
►ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ 159, తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132గా ఉంది. అత్యధిక ఓటు విలువ కలిగిన రాష్ట్రాలు: ఉత్తర ప్రదేశ్–208, తమిళనాడు–176, జార్ఖండ్–176, మహారాష్ట్ర–175, బీహార్–173.
►అలాగే అతి తక్కువ ఓటు విలువ కలిగిన రాష్ట్రాలు: సిక్కిం–7, మిజోరాం–8, అరుణాచల్‌ప్రదేశ్–8, నాగాలాండ్–9.
ఎంపీల ఓటు విలువను గణించే పద్ధతి
ఎంపీల ఓటు విలువ = మొత్తం రాష్ట్రాల శాసన సభ్యుల ఓటు విలువ/ఎన్నికైన పార్లమెంటు సభ్యుల సంఖ్య
►ఎంపీల ఓటు విలువ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. n 2022లో 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓటు విలువ 700. n రాష్ట్రపతి ఎన్నిక కావడానికి అభ్యర్ధికి కోటా ఓట్లు రావాలి. కోటా అంటే.. మొత్తం పోలై చెల్లిన ఓట్లలో సగం కంటె ఎక్కువ.
రాష్ట్రపతి ఎన్నిక–రెండు ప్రధాన సూత్రాలు
1. ఏకరూపతా సూత్రం (Principle of Uniformity, Equality)
2. సామ్యతా సూత్రం (Principle of Uniformity, Equality)
మొదటి సూత్రం ప్రకారం–రాష్ట్ర విధానసభ్యుని ఓటు విలువ ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ఓటు విలువ మారుతుంది. రెండో సూత్రం ప్రకారం– దేశంలోని ఎంపీల ఓటు విలువ ఒకే విధంగా ఉంటుంది. రాష్ట్రాల వారీగా తేడాలుండవు. ఉదాహరణకు దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 4033 (జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీ రద్దయి, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినందున జమ్మూ–కశ్మీర్‌కు చెందిన 87 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలో పాల్గొనరు.)
►దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ –5,43,231
►దేశంలోని మొత్తం ఎన్నికైన ఎంపీల సంఖ్య–776
► దేశంలోని మొత్తం ఎంపీల ఓటు విలువ –5,43,200
►మొత్తం ఎమ్మెల్యేల + ఎంపీల ఓటు విలువ = 10,86,431
► నియోజక గణంలో మొత్తం ఓటర్ల సంఖ్య = 4033 + 776 = 4809
అంటే మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ, మొత్తం ఎంపీల ఓటు విలువతో దాదాపు సమానం. దీనినే ప్రిన్సిçపల్ ఆఫ్ పారిటీ అంటారు. రాష్ట్రాలకు, కేంద్రానికి రాష్ట్రపతి ఎన్నికలో సమాన ప్రాతినిధ్యం కల్పించడమే ఈ సూత్రాలను పాటించడానికి కారణం. అందుకే భారత రాష్ట్రపతి యావత్ జాతికి ప్రాతినిధ్యం వహిస్తారు.
రాష్ట్రపతి – అర్హతలు
►ప్రకరణ 58లో రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి అవసరమైన అర్హతలను పేర్కొన్నారు.
►భారతదేశ పౌరుడై ఉండాలి (సహజ లేదా సహజీకృత పౌరసత్వం)
►35 సంవత్సరాలు నిండి ఉండాలి. లాభదాయక ప్రభుత్వ పదవుల్లో ఉండరాదు.
►శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి.
►నేరారోపణ రుజువై ఉండరాదు. దివాళా తీసి ఉండరాదు.
► లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావల్సిన ఇతర అర్హతలు ఉండాలి.
►పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.
► రాష్ట్రపతి అర్హతలకు సంబంధించి చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. రాష్ట్రపతిగా పోటీ చేయడానికి కనీస విద్యార్హత అనేది రాజ్యాంగంలో పేర్కొనలేదు.
►లాభాదాయక పదవులు(Office of Profit) అనే పదానికి రాజ్యాంగంలో నిర్వచనం లేదు. 1959 లో పార్లమెంట్ సభ్యుల అనర్హతలు,నియంత్రణ చట్టం రూపొందించి ఈ పదానికి నిర్వచనం తెలిపి.. కొన్ని పదవులను లాభాదాయక పదవులను మినహాయించింది. వీటికి కాలానుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తారు. లాభదాయక పదవుల్లో ఉండరాదు అనే అర్హతకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రులు, ఎంఎల్‌ఏ, ఎంíపీలకు జీతభత్యాలుంటాయి. వారు ఆ పదవులలో కొనసాగుతూనే మరొక పదవికి కూడా పోటీ చేయవచ్చు. పోటీ చేయడానికి ముందే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అయితే, వారు రాష్ట్రపతిగా ఎన్నికైతే వారి సభలో సభ్యత్వాన్ని కోల్పోతారు.
షరతులు
►రాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థి కొన్ని షరతులను పూర్తి చేయాల్సి ఉంటుంది. 1952లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టాన్ని రూపొందించారు. 1997లో దీనిని సవరించారు. ఈ సవరణ ప్రకారం ఈ కింది షరతులు నిర్దేశించారు.
► అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని 50 మంది నియోజకగణ సభ్యులు ప్రతిపాదించాలి. మరొక 50 మంది సభ్యులు బలపరచాలి.
►ఒక సభ్యుడు, ఒక అభ్యర్ధిని మాత్రమే ప్రతిపాదించాలి లేదా సమర్ధించాలి.
►అభ్యర్ధి నామినేషన్ పత్రంతోపాటు రూ.15,000లు ధరావత్తుగా రిజర్వు బ్యాంకులో లేదా ప్రభుత్వ ట్రెజరీలో డిపాజిట్ చేయాలి.
రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళలు
►మనోహర హోల్కర్ (1967)
►మహారాణి గురుచరణ్ కౌర్ (1969)
► లక్ష్మీ సెహగల్ (2002)
► ప్రతిభా పాటిల్ (2007)
►మీరా కుమార్ (2017)
►1967లో రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధికంగా 17 మంది పోటీ చేశారు.
►అతి పెద్ద వయస్సులో రాష్ట్రపతి అయిన వారు–కె.ఆర్.నారాయణన్ .
►అతి చిన్న వయస్సులో రాష్ట్రపతి అయిన వారు–నీలం సంజీవరెడ్డి
►ముఖ్యమంత్రులుగా పనిచేసి రాష్ట్రపతులు అయినవారు– నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్‌సింగ్, శంకర్ దయాళ్ శర్మ.
►అత్యధిక రాష్ట్రపతులను అందించిన రాష్ట్రం–తమిళనాడు (సర్వేపల్లి రాధాక్రిష్ణన్ , ఆర్.వెంకట్రామన్ , ఎ.పి.జె అబ్దుల్ కలామ్)
►స్వతంత్ర అభ్యర్థి, ట్రేడ్ యూనియన్ ఉద్యమ నేపథ్యంతో రాష్ట్రపతి అయినవారు– వి.వి.గిరి
► రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయిన వారు–ఎ.పి.జె.అబ్దుల్ కలామ్.
►రాష్ట్రపతిగా వ్యవహరించిన ఏకైక సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి– యం.హిదయతుల్లా
16వ రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్
►నోటిఫికేషన్ విడుదల: జూన్ 15, 2022
►నామినేషన్ దాఖలుకు చివరి తేదీ:జూన్ 29, 2022
► ఉపసంహరణ తేదీ: జూలై 2, 2022
►ఎన్నిక తేదీ: జూలై 18, 2022
► ఓట్ల లెక్కింపు: జూలై 21, 2022
►రిటర్నింగ్ అధికారి: ప్రమోద్ చంద్ర మోడీ (రాజ్యసభ సెక్రటరీ జనరల్)
►ఆంధ్రప్రదేశ్‌లో సహాయ రిటర్నింగ్ అధికారి: రాజ్‌కుమార్ (ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి)
►తెలంగాణాలో సహాయ రిటర్నింగ్ అధికారి: ఉపేందర్ రెడ్డి
(తెలంగాణ అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి
–బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్ నిపుణులు