
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో పోటీలో నిలిచిన మల్లిఖార్జున ఖర్గే తన ప్రత్యర్థి శశిథరూర్‌పై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అధికార వికేంద్రీకరణ దిశగా వెళతానన్న శశిథరూర్ వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా. ఆయనతో తనను పోల్చవద్దని ఖర్గే స్పష్టం చేశారు. ఈ క్రమంలో జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖర్గే బుధవారం మాట్లాడుతూ.. తాను బ్లాక్ అధ్యక్షుడి నుంచి ఈ స్థాయికి సొంతంగా ఎదిగినట్లు తెలిపారు. ఆ సమయంలో శశి థరూర్ ఉన్నారా అని ప్రశ్నించారు. దయచేసి థరూర్‌తో తనను పోల్చవద్దని అని కోరారు.
ఆ దిశగా పనిచేస్తా
శశిథరూర్ తన మేనిఫెస్టోతో ముందుకు వెళ్లవచ్చని.. అయితే ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడమే తన ఎజెండా అని తెలిపారు. ఆ దిశగానే పనిచేస్తానని పేర్కొన్నారు. డిక్లరేషన్‌లో ఉన్న మూడు నిర్ణయాలను (ప్రజల దృష్టిని ఆకర్షించడం, ఎన్నికల నిర్వహణ, జాతీయ స్థాయిలో పార్టీ శ్రేణులకు శిక్షణ) అమలు చేసే విధంగా ముందుకు సాగుతానని వెల్లడించారు.
చదవండి:నిప్పంటించుకోబోయిన భార్యాభర్తలు.. రెప్పపాటులో కాపాడిన స్థానికులు
యువ నాయకత్వం అవసరమా?
సీనియర్ నేతలు, నిపుణులందరిని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఖర్గే చెప్పారు. పార్టీని ప్రస్తుత సంక్షోభం, క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌కు యువ నాయకత్వం అవసరమా అని ప్రశ్నించగా.. పార్టీలో అనుభవం ఉన్న వ్యక్తిగా ఎవరేంటనేది తనకు అన్నీ తెలుసని అన్నారు. అవసరమైనప్పుడు వారి సేవలను వినియోగించుకుంటామని తెలిపారు.
ఖర్గేకే మద్దతు!
ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ ఇద్దరూ తలపడనున్నారు. గాంధీ కుటుంబీకుల మద్దతు ఉండటంతో ఈ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అంతేగాక పార్టీలోని సీనియర్లు అందరూ సైతం ఖర్గేకు మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థి ఖర్గేకు ఓటు వేయాలని చెబుతున్న సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఈ ఫలితాలు ఆశ్చర్యం కలిగించవచ్చని మంగళవారం శశిథరూర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 9,000 మంది కాంగ్రెస్ డెలిగేట్లు ఓటు వేయనున్నారు. 19న ఓట్ల లెక్కింపు జరుగనుంది.