లోక్‌పాల్‌కు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న లోక్‌పాల్ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. అత్యున్నత స్థాయిలో అవినీతిని అరికట్టేందుకు రూపొందించిన ఈ చరిత్రాత్మక బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసినట్లు బుధవారం సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొన్ని రక్షణలతో ప్రధానమంత్రిని కూడా దీని పరిధిలోకి తెచ్చిన విషయం తెలిసిందే. సవరించిన లోక్‌పాల్ బిల్లును డిసెంబర్ 17, 18 తేదీల్లో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ర్టపతి ఆమోదం పొందడంతో లోక్‌పాల్ బిల్లు కొన్ని లాంఛనాల తర్వాత చట్టరూపం దాల్చుతుంది. ఇప్పుడు ఈ బిల్లు న్యాయ శాఖలోని శాసన విభాగం కార్యదర్శి సంతకం చేసి.. దానిని అధికార గెజిట్‌లో ప్రచురణ కోసం పంపుతారు. ఇది చట్టరూపం దాల్చితే లోక్‌పాల్ ఏర్పడిన ఏడాదిలోపు రాష్ట్రాలు ఆయా అసెంబ్లీల్లో చట్టాల ద్వారా లోకాయుక్తలను ఏర్పాటు చేసుకోవాలి.