టాటాలనే ఢీకొట్టేలా.. ఈషా అంబానీ మరో వ్యాపార ఎత్తుగడ!
ప్రముఖ డ్రైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రీటైల్ డైరెక్టర్ ఈషా అంబానీ భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్న టాటా గ్రూప్‌ను ఢీకొట్టనున్నారా? టాటా గ్రూప్ అనుబంధ సంస్థ స్టార్‌బక్స్‌కు పోటీగా తన వ్యాపార తంత్రాన్ని ప్రదర్శించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు
గత పదేళ్లుగా భారత్ కాఫీ వ్యాపార విభాగంలో టాటా గ్రూప్ జాయింట్ వెంచర్ స్టార్‌బక్స్ ఇండియా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. 2012లో టాటా గ్రూప్ స్టార్‌బక్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. కేవలం పదేళ్లలో ఆ సంస్థ కాఫీ ప్రియుల ఆదరాభిమానాలు చూరగొన్నది. వెరసీ జాయింట్ వెంచర్‌ను ప్రారంభించిన 10ఏళ్ల తర్వాత వార్షికంగా రూ.1000 కోట్లకు అమ్మకాల్ని నమోదు చేసింది.
ఇదే స్టార్‌బక్స్‌తో నేరుగా తలపడేందుకు రిలయన్స్ రీటైల్ గత కొన్నేళ్లుగా గట్టి ప్రయత్నాలే చేసింది. చివరికి రిలయన్స్ రీటైల్ డైరెక్టర్ ఈషా అంబానీ తన వ్యాపార వ్యూహాలతో యూకేలో కాఫీ, శాండ్ విచ్ విభాగంలో ఐకానిక్ బ్రాండ్ ‘ప్రెట్ ఎ మ్యాంగర్’తో చేతులు కలిపారు.
ఇటీవల, ఒప్పందంలో భాగంగా రిలయన్స్ రీటైల్ జాయింట్ వెంచర్ ప్రెట్ ఎ మ్యాంగర్ కార్యకలాపాల్ని భారత్‌లో ప్రారంభించింది. దిగ్గజ బ్రిటిష్ బ్రాండ్‌ను ముంబైలోని బాంద్రా - కుర్లా క్లాంప్లెక్స్ (BKC)లో ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో ఢిల్లీ, బెంగళూరుతో పాటు మొత్తం 12 నగరాల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
ఇషా అంబానీ నేతృత్వంలోని అనుబంధ సంస్థలు ఫుడ్ అండ్ బేవరేజెస్ విభాగంలో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని నిరూపించేలా..మార్కెట్లోని టీ, కాఫీలకు యువతలో పెరిగిపోతున్న అభిరుచికి అనుగుణంగా ప్రెట్ ఎ మ్యాంగర్ తన కాఫీ ఘుమఘుమలు అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు.
ఇప్పటికే తమ భాగస్వామ్యంతో భారత్‌లో వ్యాపారాల్ని ప్రారంభించాలని ఆహ్వానిస్తూ రిలయన్స్ ఇటీవల పలు అంతర్జాతీయ బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కాగా, ప్రెట్ ఎ మ్యాంగర్ ప్రపంచవ్యాప్తంగా 550 స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ బ్రాండ్ ఆర్గానిక్ కాఫీ, కుకీలు, సలాడ్, శాండ్విచ్ల అమ్మకాలు ప్రసిద్ధి చెందింది.
టాటా స్టార్‌బక్స్ భారత్‌లోని 43 నగరాల్లో 341 స్టోర్లను నడుపుతుంది.అయితే, దేశీయ స్టార్టప్‌ల నుండి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు బిజినెస్ కార్యకలాపాల్ని మరింత మెరుగుపరుచుకోనుంది. చిన్న పట్టణాలలో సైతం విస్తరించేలా స్టార్‌బక్స్ చిన్న, చౌకైన పానీయాలతో పిల్లలతో సహా భారతీయులను ఆకర్షించడానికి తన వ్యూహాన్ని పునరుద్ధరిస్తున్నట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా