కోస్తాంధ్ర, రాయలసీమలకు వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతోపాటు ప్రీమాన్సూన్ థండర్ షవర్స్ (రుతుపవనాల రాకకు ముందు కురిసే వానలు) ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం నాటికి వాయుగుండంగా మారింది.
ఇది మరింత బలపడి వచ్చే 24 గంటల్లో తీవ్ర వాయుగుండం కానుంది. ఇది గుజరాత్, మహారాష్ట్రల వైపు కదలితే నైరుతి రుతుపవనాలు మరింత బలపడి పశ్చిమ తీరంలో వర్షాలు కురుస్తాయి. పాకిస్తాన్ వైపు పయనిస్తే రుతుపవనాలను బలహీనపరచి వానలకు అవాంతరం కలిగిస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ‘నైరుతి’ తాకడానికి మరో రెండ్రోజుల సమయం పడుతుందని తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉష్ణోగ్రతల్లో స్వల్ప వ్యత్యాసం
కొద్దిరోజులుగా వాతావరణం చల్లబడడంతో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఏడెనిమిది డిగ్రీలు తక్కువకు క్షీణించాయి. అసాధారణంగా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు సమానంగా రికార్డయ్యే స్థితికి చేరాయి. ఉదాహరణకు గడచిన 24 గంటల్లో తునిలో కనిష్టం 25, గరిష్టం 26 (వ్యత్యాసం 1 డిగ్రీ మాత్రమే) డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖ, కాకినాడ, నర్సాపురంలలో మూడు డిగ్రీల వ్యత్యాసంతో ఉష్ణోగ్రత రికార్డయింది.
ఉత్తరాంధ్రలో భారీ వర్షం..
సాక్షి, విజయవాడ బ్యూరో/ విజయనగరం కంటోన్మెంట్/ శ్రీకాకుళం: రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఆదివారం భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపుతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. విశాఖలో రోడ్లు, విజయనగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలులతోకూడిన వర్షాలు కురిశాయి. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చిత్తూరు జిల్లా తిరుపతి, చంద్రగిరి పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు కురిశాయి. తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో జల్లులు పడ్డాయి. ఉరుములు, సాంకేతిక కారణాల వల్ల శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో విద్యుత్ సరఫరాను నాలుగుగంటల పాటు అధికారులు నిలిపివేశారు.