ఒక్కో బడ్జెట్ కాపీ ఖర్చెంతో తెలుసా?
రైల్వే పద్దును సాధారణ బడ్జెట్లో కలుపుతూ చరిత్రాత్మకమైన కేంద్ర బడ్జెట్‌ను నేడు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌తో పాటు కీలకమైన యూపీ లాంటి ఐదు రాష్ట్రాలకు త్వరలోనే ఎన్నికలు జరుగబోతుండటం దీని ప్రాధాన్యత. జనవరి 19న ప్రారంభమైన హల్వా సెర్మనీతో ఈ బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ షురూ అయింది.
ఎంతో పకడ్బందీగా జరిగిన ఈ ప్రతుల ప్రింటింగ్, మొత్తం 788 బడ్జెట్ కాపీలను ముద్రించినట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో కాపీని ముద్రించడానికి రూ.3450 ఖర్చు అయిందని తెలుస్తోంది.. పార్లమెంట్‌లోని ఎంపీలకు, పలువురు అధికారులకు మాత్రమే బడ్జెట్ ప్రతులను అందించనున్నారు. బయటి వ్యక్తులకు మాత్రం డిజిటల్ ప్రతులనే పంపనున్నట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు.