కారాగారంలో కలకలం
రాజమహేంద్రవరం క్రైం: సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. కోటనందూరు మండలం, అల్లిపూడికి చెందిన చింతకాయల రవి (21) గంజాయి కేసులో ఈ నెల 10వ తేదీన తుని రూరల్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని ఆ మర్నాడు సెంట్రల్ జైలుకు రిమాండుకు తరలించారు. శనివారం రాత్రి ఖైదీలను లాకప్‌లో వేస్తుండగా రవి లేనట్టు గార్డులు గుర్తించారు. అతడి కోసం గాలించగా, అదే బ్లాక్ మెట్లపై ఉన్న రేకుల షెడ్డుకు టవల్‌తో ఉరి వేసుకొని కనిపించాడు. హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే రవి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వన్‌టౌన్ సీఐ ఎం.రవీంద్ర, ఎస్సై రాజశేఖర్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐదుగురిపై సస్పెన్షన్ వేటు
ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు సిబ్బందిని జైలు సూపరింటెండెంట్ ఎం.వరప్రసాద్ సస్పెండ్ చేశారు. చీఫ్ హెడ్ వార్డర్ రమణ, సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించే పవన్, దామోదర్‌తోపాటు, మరో ఇద్దరు సస్పెండైనవారిలో ఉన్నారు. రిమాండు ఖైదీ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని సూపరింటెండెంట్ చెప్పారు.
ఎన్నో అనుమానాలు..
రవి ఆత్మహత్యపై అతడి మేనమామ బత్తిన శ్రీను, అల్లిపూడి ఎంపీటీసీ రుత్తల శ్రీనివాస్, మరో మేనమామ, సర్పంచ్ అంకంరెడ్డి సత్యంమూర్తి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రవి ఆత్మహత్యకు పాల్పడేంతటి పిరికివాడు కాదని వారంటున్నారు. వారి కథనం ప్రకారం.. రవి హైదరాబాద్‌లోని ఒక రెస్టారెంట్లో పని చేస్తున్నాడు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి రూ.వెయ్యి తీసుకున్నాడు. హైవే మీదకు వచ్చి హైదరాబాద్ వెళ్లేందుకు కారు ఎక్కాడు. తుని రూరల్ పరిధిలో పోలీసులు కారును ఆపి తనిఖీ చేస్తుండగా, కారుకు సంబంధించినవారు పారిపోయారు. రవి పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిపై గంజాయి రవాణా కేసు నమోదు చేసి జైలులో పెట్టారని వారు చెబుతున్నారు.
మరెన్నో ఆరోపణలు
ఇదిలా ఉండగా, వారు చెబుతున్నదాని ప్రకారమే.. జైలులో రిమాండు ఖైదీలను ఒక బ్లాక్‌లో ఉంచి, మూడు నాలుగు రోజులు పరిశీలిస్తారు. రవిని చోరీ కేసుల నిందితులను ఉంచిన బ్లాక్‌లో ఉంచారు. అంతేకాకుండా రిమాండు ఖైదీలను జైలులో జరిగే నిర్మాణ పనులకు ఉపయోగించారు. తనకు ఒంట్లో బాగోలేదని అన్న రవిని జైలు అధికారులు వేధించారని అతడి బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రవి మనస్తాపానికి గురయ్యాడని అంటున్నారు. రవి ఆత్మహత్యపై జైలు అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని, అక్కడి సీసీ కెమెరా ఫుటేజీలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. జైలులో ఉరి వేసుకున్న ప్రాంతం కూడా చేతికి అందేంత ఎత్తులోనే ఉండడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బెయిల్ రాదన్న ఒత్తిడితోనే..
రవి ఆత్మహత్యపై జైలు అధికారులు భిన్న కథనం వినిపిస్తున్నారు. గంజాయి కేసులో బెయిల్ రాదనే ఒత్తిడితోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని డిప్యూటీ సూపరింటెండెంట్లు రాజారావు, రఘు చెప్పారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చిన వారు విలేకర్లతో మాట్లాడుతూ.. గంజాయి కేసులలో సాధారణంగా బెయిల్ రాదని, దీనితో మనస్తాపం చెందిన రవి ఆత్మహత్యకు ప్పాడ్డాడని అన్నారు.
సమగ్ర విచారణ జరుపుతాం : సబ్ కలెక్టర్ రవి మృతిపై సమగ్ర విచారణ జరుపుతామని సబ్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ అతడి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వాస్పత్రి మార్చురీలో రవి మృతదేహాన్ని ఆయన పరిశీలించారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయా అనే అంశాన్ని బంధువుల సమక్షంలో పరిశీలించారు. వారిని ఓదార్చారు. వారు వ్యక్తం చేసిన అనుమానాలపై సమగ్ర విచారణ జరుపుతామని, సెంట్రల్ జైలులో సీసీ కెమెరా ఫుటేజీలను కూడా పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఆసరాగా ఉంటాడనుకుంటే.. అనంత లోకాలకు..
అల్లిపూడికి చెందిన సత్యవతి, కన్నాపాత్రుడు దంపతులకు కుమారుడు రవితోపాటు, ఉమ, మరో కుమార్తె ఉన్నారు. కొంతకాలం క్రితం తండ్రి మృతి చెందడంతో రవి హైదరాబాద్‌లోని ఒక హోటల్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పుడు అతడి మృతితో తమ కుటుంబం వీధిన పడిందని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు అనంత లోకాలకు వెళ్లిపోయాడంటూ తల్లి సత్యవతి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.