సర్వే సాగనివ్వం
నవాబుపేట: ‘మా భూముల సమీపంలో ఎలాంటి మైనింగ్ పనులు చేపట్టవద్దు.. కాదని ఎవరు వచ్చినా అడ్డుకుంటాం’ అని రైతులు స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని యావాపూర్‌లో మైనింగ్ సర్వేను అడ్డుకున్నారు. మండల పరిధిలోని ఆర్కతల పంచాయతీ అనుబంధ గ్రామమైన యావాపూర్‌లోని 53 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిలో శుక్రవారం మైనింగ్ వ్యాపారి నరేష్, ప్రభుత్వ సర్వేయర్ సుధాకర్‌ను, మరో ప్రైవేటు సర్వేయర్‌ని తీసుకొని సర్వే చేయించడానికి వచ్చారు. విషయం తెలుసుకున్న యావాపూర్ పలువురు రైతులు అక్కడికి చేరుకున్నారు.
ఇక్కడేం చేస్తున్నారంటూ వారిని ప్రశ్నించగా.. తాము 2010లో ఇక్కడ మైనింగ్ వ్యాపారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నామని వారు తెలిపారు. మైనింగ్ కోసం సర్వే చేస్తున్నామని వ్యాపారి నరేష్ రైతులకు చెప్పారు. దీంతో రైతులు.. ఇక్కడ ఎలాంటి మైనింగ్ తవ్వకాలను జరపవద్దని, ఇక్కడి ప్రభుత్వ భూమి చుట్టూ తమకు అసైన్మెంట్ చేసిన భూమి ఉందన్నారు. తవ్వకాలు జరపడం వల్ల తమ పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని, తమ పొలాలు దాటి ఈ భూమిలోకి రావాల్సి ఉంటుందన్నారు. అందుకు తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. సర్వే పనులను నిలిపివేయించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ యాదయ్య ఘటనా స్థలానికి వచ్చారు. రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి సర్వే పనులు నిలిపివేయాలని మైనింగ్ వ్యాపారులకు సూచించారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
జేసీ ఎంవీ రెడ్డి ఆర్కతలకు వచ్చారనే విషయం తెలుసుకున్న రైతులు నేరుగా ఆ గ్రామానికి వె ళ్లారు. మైనింగ్ సర్వేతో పాటు, మైనింగ్ దరఖాస్తులను రద్దు చేయాలని ఆయనను కోరాారు. రైతుల విజ్ఞప్తికి స్పందించిన జేసీ.. సర్వేను, మైనింగ్ దర ఖాస్తులు తదితర విషయాలపై తనకు నివేదిక అందజేయాలని తహసీల్దార్ యాదయ్యను ఆదేశించారు.