Priyanka Varghese
-
ఫ్యూచర్ నెక్సెస్ సూపర్ సక్సెస్
ములుగు(గజ్వేల్): సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో ఒడిశా సెంచూరియన్ యూనివర్సిటీ సహకారంతో శనివారం ది ఫ్యూచర్ నెక్సెస్ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ 4.0పై నిర్వహించిన రోడ్ షో విజయవంతమైంది. హైడ్రోఫోనిక్స్, బయో ఎరువులు, సేంద్రియ వ్యవసాయం, రిమోట్ సెన్సింగ్ అభ్యసన, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలు, వివిధ నైపుణ్యాలు, డొమైన్ కోర్సుల గురించి అవగాహన కల్పించేలా స్టాల్స్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రీన్‌టెక్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన అభివృద్ధి అనే అంశంపై బెంగళూరు సున్మోక్ష పవర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అతుల్ బిహారీ భట్నాగర్ మాట్లాడారు. అనంతరం వ్యవసాయం, అటవీ రంగంలో డ్రోన్ ప్రయోజనాలు అర్థమయ్యేలా సెంచూరియన్ అధ్యాపకులు డ్రోన్ ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహిం చారు. ములుగు ఎఫ్‌సీ ఆర్ఐ డీన్, సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, ఉద్యానవన వర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్, ఉద్యానవన విశ్వ విద్యాలయ కంట్రోలర్ కిరణ్‌కుమార్, ములుగు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏడీఎస్ కిషన్‌రావు, సివికల్చర్ డీఎఫ్ఓ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్, గజ్వేల్, సిద్దిపేట తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యార్థులు, ఎఫ్సీఆర్ఐ విద్యార్థులు పాల్గొన్నారు. -
అభివృద్ధి మీ చేతుల్లోనే: స్మిత సబర్వాల్
సాక్షి, ఇందల్వాయి(నిజామాబాద్): గ్రామ అభివృద్ధి ఆ గ్రామ ప్రజల చేతుల్లోనే ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ గ్రామ ప్రగతి కోసం పని చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి (సీఎంవో) స్మిత సబర్వాల్ పిలుపునిచ్చారు. ప్రజల సహకారం ఉంటేనే ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవచ్చని తెలిపారు. ప్రజా ప్రతినిధులు నిత్యం గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని సూచించారు. సర్పంచ్ల పనితీరు బాగలేక పోతే పదవులు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తో కలిసి స్మిత సోమవారం జిల్లాలో పర్యటించారు. ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి, ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్, బాల్కొండ మండలం బుస్సాపూర్‌లో ‘పల్లెప్రగతి’ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభల్లో గ్రామస్తులతో మాట్లాడారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనుల వివరాల గురించి ఆరా తీశారు. గ్రామాల్లో చేపట్టిన పనులు నిజమా.. కాదా? అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్, హరితహారం, మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. చంద్రాయన్పల్లిలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పరిశుభత్ర బాధ్యత ప్రజలదే.. ప్రభుత్వం చెప్పినా, చెప్పకపోయినా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన భాధ్యత ప్రజలపై ఉందని స్మిత పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టినపుడే కాకుండా ఎల్లప్పుడూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా అలవాటు చేసుకోవాలని సూచించారు. నిధుల లభ్యత ఆధారంగా గ్రామ పంచాయతీ అధికారులు సంవత్సర ప్రణాళికను పకడ్బందీగా రూపొందించాలని, గ్రామంలో చేపట్టబోయే అభివృద్ధి పనుల వివరాలను జీపీ కార్యాలయంలో ప్రదర్శించాలన్నారు. శిథిలావస్థకు చేరిన రోడ్లపై స్థానికులు అడిగిన ప్రశ్నలకు స్మిత బదులిస్తూ.. మిషన్ భగీరథ ద్వారారక్షిత జలాలు వంద శాతం ప్రజలకు చేరిన అనంతరం గ్రామాల్లోని అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మొక్కలు చనిపోతే చర్యలు: వర్గీస్ ప్రతి ఇంటిలో ఐదు పండ్ల మొక్కలను పెంచాలని సీఎంవో ఓఎïస్డీ ప్రియాంక వర్గీస్ సూచించారు. గత ఐదు విడతల్లో హరితహరంలో పెంచిన మొక్కల వల్లే సమృద్ధిగా వర్షాలు కురిశాయని చెప్పారు. ప్రతీ గ్రామ పంచాయతీ తప్పకుండా నర్సరీని కలిగి ఉండాలని, అందులో ప్రధానంగా నిమ్మ గడ్డి, కృష్ణ తులసి మొక్కలను పెంచాలన్నారు. నిమ్మ గడ్డి వలన దోమలు రాకుండా ఉంటాయన్నారు. ప్రతీ గ్రామంలో నిర్దేశిత మొక్కలు నాటి 85 శాతం మొక్కలు బతికేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపడతాయని, మొక్కలు చనిపోతే చర్యలు తప్పవని తెలిపారు. అడవుల్లో పండ్ల మొక్కలు నాటితే కోతుల బెడదను నివారించవచ్చని తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావ్, కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నాయని, పనితీరు బాగా లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జెడ్పీ సీఈవో గోవింద్, ఆర్డీవో శ్రీనివాసులు, మిషన్ భగీరథ ఎస్ఈ రాజేందర్, ట్రాన్స్‌కో ఎస్ఈ సుదర్శనం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించండి.. తను పూరి గుడిసెలో నివాసం ఉంటున్నానని, తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని సామ్యానాయక్ తండాకు చెందిన లక్ష్మి స్మిత సబర్వాల్‌ను కోరారు. తన కోరిక తీర్చితే సంతోషిస్తానని ఆమె తెలపగా, స్మిత సబర్వాల్ సుముఖత వ్యక్తం చేశారు. -
ముఖ్యమంత్రి ఓఎస్డీతో నటి జీవిత భేటీ
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తో మంగళవారం సినీనటి జీవిత రాజశేఖర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీవిత హరితహారంలో భాగస్వామ్యం విషయమై చర్చించారు. ఓఎస్డీతో సమావేశం అనంతరం జీవిత మీడియాతో మాట్లాడారు. తమ ట్రస్ట్ ద్వారా హరితహారంలో పాల్గొనే విషయంపై చర్చించామని తెలిపారు. జులై 1 న తమ కూతురు శివాని పుట్టినరోజు సందర్భంగా హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నామన్నారు. తమ కుటుంబ సభ్యులమంతా హరితహారంలో భాగస్వాములం అవుతామని ఆమె స్పష్టం చేశారు. హరితహారం కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని జీవిత పేర్కొన్నారు. -
ఔటర్‌పై ఆకస్మిక తనిఖీలు
సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డుపై సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్( హరితహారం) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హరితహారంలో భాగంగా ఔటర్ వెంట చేపట్టిన పచ్చదనం పనులను, కీసర జంక్షన్లో నాటిన మొక్కలను ప్రియాంక వర్గీస్ పరిశీలించారు. మొక్కలకు నీటి సౌకర్యంపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ ఔటర్‌పై ప్రయాణించి పచ్చదనంను పరిశీలిస్తారని ఆమె తెలిపారు. ఎండిన మొక్కల స్థానంలో తక్షణం మంచి ఎత్తు ఉన్న మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. పర్యవేక్షణ లోపం ఉన్న కాంట్రాక్టర్లను పక్కన పెట్టాలని ప్రియాంక వర్గీస్ ఆదేశించారు. -
మేమొస్తున్నామని డ్రామా చేశారా?
చందంపేట(దేవరకొండ): ‘నర్సరీలపై ఇంత నిర్లక్ష్యమా? మేము వస్తున్నామని ఎక్కడి నుంచో మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతారా? డ్రామా చేస్తున్నారా? బుర్ర పనిచేయడం లేదా? పది రోజుల్లో మళ్లీ వస్తా.. నర్సరీల్లోని మొక్కలన్నీ బతకాలి..’ అంటూ తెలంగాణకు హరితహారం కార్యక్రమ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా చందంపేట మండలం గాగిళ్లాపురం, కోరుట్ల గ్రామాల్లోని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన నర్సరీలను నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో కలిసి ఆమె పరిశీలించారు. వన నర్సరీల పెంపకంలో అధికారులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. తాము వస్తున్నట్లు సమాచారం మేరకు తాత్కాలికంగా కొన్ని మొక్కలు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా, మట్టి నమూనాలు లేకుండా మొక్కలు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. మొక్కల సంరక్షణకు పంపిణీ చేసిన నెట్లను కూడా ఏర్పాటు చేయకపోవడం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపించారు. మండలంలో ఉన్న నర్సరీల్లో గ్లీనరీ కనిపించాలని, లేని పక్షంలో ఉపేక్షించేది లేదని సంబంధిత అధికారులను హెచ్చరించారు. ప్రతి మొక్క బతకాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 24 శాతం ఉన్న అడవుల శాతాన్ని 30 శాతం పెంచేందుకు ప్రభుత్వం లక్ష్యంతో ఉందన్నారు. ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అటవీ ప్రాంతాల్లో వంద కోట్లు, సామాజిక అడవుల కింద 120 కోట్లు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో 10 కోట్ల మొక్కలు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. రూ.80 కోట్ల నిధులు ఉన్నాయి : కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ నల్లగొండ జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించి రూ. 80 కోట్ల నిధులున్నాయని నల్లగొండ కలెక్టర్ ఉప్పల్ తెలిపారు. నర్సరీలో పనిచేస్తున్న సిబ్బందికి 5 నెలలుగా వేతనాలు అందకపోవడంతో నర్సరీలో పనులకు రావడం లేదని కూలీలు కలెక్టర్‌కు తెలిపారు. వేతనాలు రేపటిలోగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో వర్క్‌షాప్ ఏర్పాటు చేసి మొక్కల పెంపకంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ శాంతారాం, ఆర్డీఓ లింగ్యానాయక్, ఎఫ్డీ లోవు సుదర్శన్‌రెడ్డి, జి.రవి, ఎఫ్ఆర్వో సర్వేశ్వర్, ఇన్చార్జ్ ఎంఈఓ శంకర్, ఎంపీడీఓ రామకృష్ణ, ఏపీఓ శ్రీనివాస్, శేఖర్ ఉన్నారు. -
హరితహారం.. భావితరాలకు వరం
* అన్ని శాఖల సమన్వయంతోనే ఇది సాధ్యం * రాష్ట్రం అందంగా ఉంటే మరిన్ని పెట్టుబడులొస్తాయి * సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్ సంగారెడ్డి అర్బన్: హరితహారం విజయవంతంతో మెదక్ జిల్లాను రాష్ట్రానికి మోడల్‌గా నిలిపేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం కార్యాలయ ఓఎస్డీ, హరితహారం ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమ అమలుపై కలెక్టరేట్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి పాతినిథ్యం వహిస్తున్న జిల్లాను హరితహారంలో ముందంజలో నిలపాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచే స్తూ.. ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించినప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. సీఎం ఇతర జిల్లాలకు వెళ్లినప్పుడు మెదక్‌ను ఆదర్శంగా చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ తమ శక్తి మేరకు కృషి చేస్తే ఈ కార్యక్రమం భవిష్యత్ తరాలకు ఒక వరంలా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లను భాగస్వాములను చేయాలన్నారు. దీనికోసం వారితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలని జేసీ శరత్‌ను ఆదేశించారు. ప్రతి విద్యార్థి తమ ఇంటి వద్ద రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల ఆవరణల్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ రాజేశ్వర్‌రావును ఆదేశించారు. పరిశ్రమల్లో కూడా దీన్ని అమలు చేయాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్‌ను, పీహెచ్‌సీల వద్ద కూడా మొక్కలు నాటాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. వసతి గృహాల్లో సైతం మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత సంక్షేమాధికారులను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. సంగారెడ్డిలో కూడా దీన్ని అమలు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. కార్యక్రమ అమలులో స్వయం సహాయక బృందాలను భాగస్వాములను చేయాలన్నారు. ఈ ఏడాది దాదాపు రూ.5 కోట్లు వెచ్చించి ఇతర రాష్ట్రాల నుంచి మొక్కలు కొనుగోలు చేస్తున్నామని వచ్చే సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలోని గ్రూపులకు అవకాశం ఇస్తామన్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీల్లో కొత్త భవనాల నిర్మాణానికి అనుమతులిచ్చే ముందు తప్పకుండా ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పెంచే విధంగా చర్యలు తీసుకునే విధంగా సూచించాలన్నారు. లక్ష్యం 3.52 కోట్ల మొక్కల పెంపకం... జాయింట్ కలెక్టర్ డా.ఎ.శరత్ మాట్లాడుతూ, జిల్లాలో హరితహారం కార్యక్రమం అమలు కోసం 478 నర్సరీలను ఎంపిక చేసి మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మొదటి సంవత్సరంలో 3.52 కోట్ల మొక్కలు నాటడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. డీఎఫ్ఓ, డ్వామా ఏజెన్సీల ఆధ్వర్యంలో నర్సరీల ద్వారా మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నర్సరీల ఏర్పాటు కోసం ప్లాస్టిక్ బ్యాగ్‌లలో 60 శాతం మట్టిని నింపి ఉంచామన్నారు. జిల్లాలోని వివిధ ఏజెన్సీల ద్వారా మొక్కలు పెంచి నాటేందుకు ప్రణాళికలు రూపొందించామని వివరించారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, దేవాదాయ భూములు, ఆవరణల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్‌కు వివరించారు. ప్రతి గ్రామ పంచాయతీలో పదెకరాల చొప్పున 11 వేల ఎకరాలలో 1.82 మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రైవేట్ నర్సరీల యాజమాన్యాలు లక్షలాది మొక్కలను ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయని, వారిని సంప్రదించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్... జిల్లాలో హరితహారం విజయవంతం అయ్యేందుకు తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టెరిటోరియల్ డీఎఫ్ఓ సుధాకర్‌రెడ్డి వివరించారు. సమీక్షా సమావేశంలో డ్వామా పీడీ ర వీందర్, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, జెడ్పీ సీఈఓ మధు, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, డీడీ సోషల్ వెల్ఫేర్ శ్రీనివాస్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ సురేంద్ర, పీఆర్ ఎస్ఈ ఆనందం, డీఎంహెచ్ఓ బాలాజీ పవార్, ఆర్వీఎం పీఓ యాస్మిన్‌బాషా పాల్గొన్నారు. -
హరితహారం ఉద్యమంలా చేపట్టాలి
ప్రగతినగర్ : ‘తెలంగాణ హరిత హారం’ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని హరిత హారం రాష్ట్ర ప్రత్యేక అధికారి ప్రియంక వర్గీస్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రగతిభవన్‌లో ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. జిలా ్లలో హరితహారం కింద తీసుకుంటున్న చర్యలను, ప్రగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలలో, ప్రజా ప్రతినిధులలో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో,ఆసుపత్రులు ఆవరణలో పూల మొక్కలు,పండ్ల మొక్కలు నాటించినట్లయితే రోగులకు సగం జబ్బులు నివారించినట్లవుతుందన్నారు.అన్ని పీహెచ్‌సీలను ఆదర్శవంతమైన పీహెచ్‌సీలుగా రూపొందించాలని డీఎంహెచ్ఓ సూచించారు. పాఠశాలలు, కళాశాలలో, వసతిగృహాలలో మొక్కలు నాటించాలన్నారు. మహిళా సంఘాలు టేకు మొక్కలు పెంచడానికి అవసరమైన చర్యలు డీఆర్డీఏ ద్వారా చేపట్టాలన్నారు. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. రోజు వారీగా మొక్కల పెంపకాల వెబ్సైట్ ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. అందువల్ల ఎప్పటికప్పుడు నిర్దేశించిన సాప్ట్‌వేర్‌లో సమాచారాన్ని పొందుపర్చాలన్నారు.అన్నిగ్రామాల సర్పంచులకు సమావేశాలు ఏర్పటు చేసి తెలంగాణ హరితహారం గురించి పెంచాల్సిన మొక్కల గురించి తెలియచేయాలన్నారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ నర్సరీల్లో మొక్కల పెంపకానికి సంబంధించి మొక్కల పేర్లు నాటిన తేదిలలో బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఫారెస్ట్ అడీషన్ల్ ప్రిన్సిపాల్ వైబాబురావు,డీఎంహెచ్ఓ బసవేశ్వర్‌రావు,డీఈఓ శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.