అభివృద్ధి మీ చేతుల్లోనే: స్మిత సబర్వాల్‌ | Smita Sabharwal Talks In Palle Pragathi Programme In Nizamabad | Sakshi
Sakshi News home page

మొక్కలు చనిపోతే చర్యలు: వర్గీస్‌

Published Tue, Jan 7 2020 11:13 AM | Last Updated on Tue, Jan 7 2020 11:13 AM

Smita Sabharwal Talks In Palle Pragathi Programme In Nizamabad - Sakshi

సాక్షి, ఇందల్‌వాయి(నిజామాబాద్‌): గ్రామ అభివృద్ధి ఆ గ్రామ ప్రజల చేతుల్లోనే ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ గ్రామ ప్రగతి కోసం పని చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి (సీఎంవో) స్మిత సబర్వాల్‌ పిలుపునిచ్చారు. ప్రజల సహకారం ఉంటేనే ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవచ్చని తెలిపారు. ప్రజా ప్రతినిధులు నిత్యం గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని సూచించారు. సర్పంచ్‌ల పనితీరు బాగలేక పోతే పదవులు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తో కలిసి స్మిత సోమవారం జిల్లాలో పర్యటించారు. ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి, ఆర్మూర్‌ మండలం గోవింద్‌పేట్, బాల్కొండ మండలం బుస్సాపూర్‌లో ‘పల్లెప్రగతి’ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభల్లో గ్రామస్తులతో మాట్లాడారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనుల వివరాల గురించి ఆరా తీశారు. గ్రామాల్లో చేపట్టిన పనులు నిజమా.. కాదా? అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్, హరితహారం, మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. చంద్రాయన్‌పల్లిలో అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు.  

పరిశుభత్ర బాధ్యత ప్రజలదే.. 
ప్రభుత్వం చెప్పినా, చెప్పకపోయినా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన భాధ్యత ప్రజలపై ఉందని స్మిత పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టినపుడే కాకుండా ఎల్లప్పుడూ  గ్రామాలను పరిశుభ్రంగా  ఉంచుకునేలా అలవాటు చేసుకోవాలని  సూచించారు. నిధుల లభ్యత ఆధారంగా గ్రామ పంచాయతీ అధికారులు సంవత్సర ప్రణాళికను పకడ్బందీగా రూపొందించాలని, గ్రామంలో చేపట్టబోయే అభివృద్ధి పనుల వివరాలను జీపీ కార్యాలయంలో ప్రదర్శించాలన్నారు. శిథిలావస్థకు చేరిన రోడ్లపై స్థానికులు అడిగిన ప్రశ్నలకు స్మిత బదులిస్తూ.. మిషన్‌ భగీరథ ద్వారారక్షిత జలాలు వంద శాతం ప్రజలకు చేరిన అనంతరం గ్రామాల్లోని అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. 

మొక్కలు చనిపోతే చర్యలు: వర్గీస్‌ 
ప్రతి ఇంటిలో ఐదు పండ్ల మొక్కలను పెంచాలని సీఎంవో ఓఎïస్డీ ప్రియాంక వర్గీస్‌ సూచించారు. గత ఐదు విడతల్లో హరితహరంలో పెంచిన మొక్కల వల్లే సమృద్ధిగా వర్షాలు కురిశాయని చెప్పారు. ప్రతీ గ్రామ పంచాయతీ తప్పకుండా నర్సరీని కలిగి ఉండాలని, అందులో ప్రధానంగా నిమ్మ గడ్డి, కృష్ణ తులసి మొక్కలను పెంచాలన్నారు. నిమ్మ గడ్డి వలన దోమలు రాకుండా ఉంటాయన్నారు. ప్రతీ గ్రామంలో నిర్దేశిత మొక్కలు నాటి 85 శాతం మొక్కలు బతికేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపడతాయని, మొక్కలు చనిపోతే చర్యలు తప్పవని తెలిపారు. అడవుల్లో పండ్ల మొక్కలు నాటితే కోతుల బెడదను నివారించవచ్చని తెలిపారు.  పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావ్, కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నాయని, పనితీరు బాగా లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జెడ్పీ సీఈవో గోవింద్, ఆర్డీవో శ్రీనివాసులు, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ రాజేందర్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుదర్శనం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇప్పించండి.. 
తను పూరి గుడిసెలో నివాసం ఉంటున్నానని, తనకు డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లు ఇప్పించాలని సామ్యానాయక్‌ తండాకు చెందిన లక్ష్మి స్మిత సబర్వాల్‌ను కోరారు. తన కోరిక తీర్చితే సంతోషిస్తానని ఆమె తెలపగా, స్మిత సబర్వాల్‌ సుముఖత వ్యక్తం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement