ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తుంటే.. కామారెడ్డిలోని పంచాయతీ కార్యదర్శులను మాత్రం ఆ యాప్ పరుగులు పెట్టిస్తోంది. యాప్ భయంతో రెండుమూడు రోజులుగా ఉదయం 8 గంటలకే తమ పంచాయతీకి చేరుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలు దాటేవరకు గ్రామంలోనే ఉంటున్నారు. ∙
సాక్షి నాగిరెడ్డిపేట(నిజామాబాద్) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పల్లెల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నెలరోజుల్లో గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలతో కూడిన జాబితాను పంచాయతీ కార్యదర్శులతోపాటు గ్రామసర్పంచ్‌లకు అప్పగించారు. ఈ పనుల విజయవంతంలో పంచాయతీ కార్యదర్శులదే కీలక భూమిక. కానీ కొన్నిచోట్ల వారు సక్రమంగా పనిచేయడం లేదన్న ఆరోపణలున్నాయి. మంత్రి ఆదేశాలతో.. ఇటీవల జిల్లాకేంద్రంలో నిర్వహించిన పంచాయతీరాజ్ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. వేదికపైకి జిల్లాలోని ఒక సర్పంచ్‌తోపాటు పంచాయతీ కార్యదర్శిని పిలిచి గ్రామంలోని ఇళ్లు, నాటాల్సిన మొక్కలు, నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాల గురించి ప్రశ్నించారు. వారు సరైన సమాధానాలు ఇవ్వలేదు. దీంతో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు పల్లెప్రగతిపై సరైన అవగాహన లేదని, వారికి సరిగ్గా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.
దీంతో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల పనితీరును మెరుగు పర్చాలని జిల్లాయంత్రాంగం ఆలోచనచేసి మొదట పంచాయతీ కార్యదర్శులంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లోనే ఉండేలా చూడాలని నిర్ణయించారు. హాజరును పర్యవేక్షించడానికి ఖైజాలా అనే యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ ద్వారా వారి హాజరును పర్యవేక్షించేందుకు రెండుమండలాలకు ఒక అధికారిని నియమించారు. ఈ యాప్ ద్వారా పంచాయతీ కార్యదర్శులు హాజరు నమోదు చేసుకుంటే వారు ఉన్న ప్రదేశంతోపాటు సమయం కూడా అందులో స్పష్టంగా తెలిసిపోతుంది. పనులపై ప్రణాళిక... మార్చి నెలాఖరు వరకు గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి జిల్లాఅధికారులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.
గ్రామాల్లో మురికి కాలువలను నిరంతరం శుభ్రంగా ఉండేలా చూడడం, పచ్చదనాన్ని పకడ్బందీగా అమలు చేయడం, గ్రామాల్లోని అంగన్‌వాడి, పాఠశాల, ఓహెచ్‌ఆర్ ట్యాంకులు తదితర ప్రాంతాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడడం, నర్సరీల ఏర్పాటు, పవర్‌వీక్ కార్యక్రమాలు, ట్రాక్టర్ల కొనుగోలు, ఇంకుడుగుంతల ఏర్పాటు, ఫీల్డ్‌అసిస్టెంట్ల పనితీరుపై పర్యవేక్షణ, గ్రామాల్లోని ప్రతిఇంటికి చెత్తబుట్టల పంపిణీ, ప్రధాన కూడళ్లల్లో చెత్తకుండీల ఏర్పాటు, 100 శాతం పన్నులు వసూలు చేయడం, వార్షిక బడ్జెట్ తయారుచేయడం, మరుగుదొడ్ల నిర్మాణం, మిషన్ భగీరథ పనుల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.
కార్యదర్శుల్లో టెన్షన్
ఖైజాలా యాప్ భయంతో పంచాయతీ కార్యదర్శులు రెండు, మూడురోజులుగా ఉదయాన్నే పల్లెలకు పరుగులు తీస్తున్నారు. ఈ యాప్‌తో కొంతమంది కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలతోపాటు గర్భిణులుగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో ఉండేందుకు ఇబ్బందిపడాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఉదయాన్నే ఇళ్లల్లో పనులు ముగించుకొని గ్రామాలకు వెళ్లేందుకు వారు నానా యాతన పడుతున్నారు. తమ కష్టానికి ప్రతిఫలంగా గ్రామాలు బాగుపడితే అంతకన్నా ఆనందం ఉండదని వారు అంటున్నారు. కొన్ని గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గం పల్లెప్రగతి కార్యక్రమాల నిర్వహణకు సహకరించడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లాయంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment