కమ్ముకొస్తున్న కరువు మేఘాలు
ఎడారిలా ఘనపురం.. ఎండిపోతున్న వరి
ఆందోళనలో రైతాంగం.. సింగూరు నీటిపై ఆశలు
పాపన్నపేట: కార్తెలు కదిలిపోతున్నా.. వరుణుడి జాడ కనిపించడం లేదు. కనీస వర్షపాతం కూడా లేకపోవడంతో జల వనరులన్నీ మైదానాల్లా.. ఘనపురం ఎడారిలా మారింది. ఈక్రమంలో మంజీర మడుగులను చూసి వరినాట్లు వేసిన రైతన్నలు వాటిని దక్కించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. కన్నీళ్లను దిగమింగి.. వనజాడ కోసం ఎదురుచూస్తున్నారు.
కనీస వర్షపాతం కరువే
మెదక్ డివిజన్లో జూన్లో 2,614.4 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 2.525 మి.మీ మాత్రమే నమోదైంది. అదేవిధంగా జూలైలో 4,388.2 మి.మీ. కురవాల్సి ఉండగా 3,966.8 మి.మీ. మాత్రమే నమోదైంది. ఈక్రమంలో వేసవిలో రికార్డు స్థాయి ఎండలు నమోదవడంతో అడపాదడపా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటల్లోకి నీళ్లు రాలేదు. ఎగువన కూడా వర్షాలు కురవకపోవడంతో ఘనపురం ప్రాజెక్టులోకి నీళ్లు రాలేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి.
మడుగుల ఆధారంగా నాట్లు
మెతుకు సీమ చుట్టూ మంజీరా నది ప్రవహిస్తుండటంతో అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు మడుగుల్లో నీళ్లు చేరాయి. వీటిని నమ్ముకొని సుమారు 3 వేల ఎకరాల్లో రైతులు వరినాట్లు వేశారు. సుమారు 15 రోజుల పాటు మోటార్ల ద్వారా మడుగుల నుంచి నీటిని తోడి పంటలకు అందించారు. ప్రస్తుతం మడుగుల్లోనూ నీరు కనుమరుగవుతోంది. దీంతో రైతన్నల్లో ఆందోళన మొదలైంది. అప్పులు చేసి పంటలు వేశామని, అవి ఎండిపోతే పరిస్థితి ఏమిటని ఆవేదన చెందుతున్నారు.
సింగూరు నీరే ఆధారం
ప్రస్తుతం వరి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నందున సింగూరు నుంచి 0.3 టీఎంసీల నీరు వదలాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. సింగూరులో 6 టీఎంసీలకు పైగా నీరున్నందున ఒక్కసారి 0.3 టీఎంసీ నీరు వదిలితే 15 రోజుల వరకు నీళ్లు సరిపోతాయని వారు చెబుతున్నారు.