ఇలాగైతే స్మార్ట్ సిటీ సాధ్యమేనా
► పందుల సమస్య తీవ్రం అంతటా పారిశుద్ధ్య లోపం
► కల్లూరును విస్మరిస్తున్నారు మున్సిపల్ అధికారులపై
► ఎంపీ బుట్టా, ఎమ్మెల్యే గౌరు చరిత ఆగ్రహం
కర్నూలు(టౌన్): ‘కర్నూలు నగరంలో పందుల సమస్య తీవ్రంగా ఉంది.. పందుల నిర్మూలన అధికార యంత్రాంగానికి పట్టడం లేదు.. ఎక్కడా చూసినా పారిశుద్ధ్య లోపమే.. ఇక స్మార్ట్ సిటీ ఎలా సాధ్యం’ అంటూ కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక నగరపాలక కమిషనర్ చాంబర్ లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డితో కలిసి మున్సిపల్ అధికారులు, వివిధ విభాగాల సెక్షన్ సూపరింటెండెంట్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో బుట్టా అధికారుల తీరును ఎండగ్టారు. ‘కర్నూలు నగరంలో పందుల సమస్య తీవ్రంగా ఉంది. మనుషుల ప్రాణాలు ముఖ్యం.
సమస్యను లైట్‌గా తీసుకున్నారు. నేను ఉన్న ప్రాంతంలో వాణిజ్య నగర్ పార్కు అభివృద్ధి చేయాలని ఒకటిన్నర సంవత్సరం క్రితం చెప్పా.. అయినా పట్టించుకోలేదు. ఎంపీ చెప్పినా పనులు కాకపోతే ఇక ప్రజల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి’ అంటూ మండిపడ్డారు. వివిధ పథకాలు, స్కీమ్‌ల ద్వారా నగరపాలక సంస్థకు రూ. 200 కోట్లు వచ్చాయని, ఈ నిధులతో చేస్తున్న అభివృద్ధి వివరాలను తెలియజేయాలన్నారు. పనులు వేగవంతం చేయాలని, జాప్యం తగదన్నారు.