ఇదేనా మహిళలను గౌరవించడం!
‘ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దైవత్వం వికసిస్తుంది. ఎక్కడ స్త్రీలు పూజింపడరో అక్కడ సత్కర్మలకు విలువ ఉండద’ని భారతీయ సంస్కృతి తెలియజేస్తోంది. త్రిశక్తి రూపంగా, ప్రకృతికి ప్రతిరూపంగా, ఆదిశక్తిగా స్త్రీని ఆరాధించడం, పూజించడం భారతీయ సంప్రదాయం. మాతృదేవోభవ అంటూ తల్లిని తొలి దైవంగా గౌరవించే విశిష్ట సంస్కృతి భారతీయుల సొంతం. వేదకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు అన్ని రంగాలలో స్త్రీలను గౌరవించడం, ప్రోత్సహించడం జరుగుతోంది.
పురాణే తిహాసాల నుంచి నేటి ఆధునిక సమాజం వరకు పరిశీలిస్తే వేదా ధ్యయనం, కళలు, యుద్ధ నైపుణ్యాలు నుంచి నేటి ఆధునిక సమాజంలో విభిన్న బాధ్యతలను అలవోకగా నిర్వహిస్తు న్నారు మన మహిళలు. అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా, కూతురుగా, కోడలిగా విభిన్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించే శక్తి కేవలం మహిళలకే ఉంది. తాను పుట్టినింటిని వదిలి, కుటుంబాన్నీ, బంధువులనూ వదలి, వేరొకరి ఇంటికి వెళ్లి వారికోసం నిస్వార్థంగా కృషి చేసే మహా మనిషి స్త్రీ మూర్తి.
భారత దేశంలో స్త్రీకి అత్యంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఆదిమ కాలం నుంచీ ఉంది. అటువంటి సమాజంలో నేడు జరుగు తున్న కొన్ని సంఘటనలు మనిషితనం దిగజారడానికి అద్దం పడుతున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి ఆర్.కె. రోజాపై తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఉన్నత స్థానంలో, మంత్రి పదవిలో ఉన్న మహిళ గురించి ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర ప్రజలందరినీ కదిలించింది. మహిళలను కించపరచడం, దూషించడం, వారి పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం ఎంతమాత్రం హర్షణీయం కాదు.
దీనిపై స్త్రీ, పురుషులనే వ్యత్యాసం లేకుండా సమాజంలో ప్రతి వ్యక్తీ స్పందించాల్సిన అవసరం ఉంది. రాజకీయ విలువలు, మానవీయ విలువలు, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలుగా ఈ వ్యాఖ్యలు నిలుస్తున్నాయి. సభ్య సమాజం బండారు ఉపయోగించిన పదజాలాన్నీ, వ్యాఖ్యల్నీ ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంది. అంతరిక్షంలోకి సైతం మహిళలు వెళుతున్న ఈ కాలంలో ఇటువంటి అవమానాలకు మహిళలను గురిచేయడం సమంజసం కాదు. బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్త్రీ, పురుషులను సమానంగా చూడాలని కాంక్షించారు. స్త్రీల హక్కుల కోసం న్యాయ శాఖమంత్రి పదవికి సైతం రాజీనామా చేశారు.
ఇటువంటి మహనీయులు పుట్టిన ఈ దేశంలో, రాజ్యాంగ నిర్మాతల ఆశయా లకు విరుద్ధంగా మాట్లాడుతున్న వీరిని అంబేడ్కర్ వ్యతిరేక వాదులుగా చూడా ల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఎవరైనా సరే మహిళలను అవహేళన చేయడాన్నీ, అవమానకరంగా మాట్లాడటాన్నీ ఉపేక్షించరాదు. ఇటువంటి సంఘటనలపై న్యాయస్థానాలు సైతం స్వచ్ఛందంగా స్పందించాలి. సుమోటోగా వీటిని స్వీకరిస్తూ మహిళల హక్కుల పరిక్షణకు పాటుపడాలి.
భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక పటిష్ఠ వ్యవస్థనూ, చట్టాన్నీ ఏర్పాటు చేసే దిశగా న్యాయకోవిదులు దృష్టి సారించాలి. ప్రజాస్వామ్య వాదులూ, మానవీయ వాదులూ అంతా దీనిని ఖండించాల్సిన అవ సరం ఉంది. ఇది మనందరి సామాజిక బాధ్యత.
- వ్యాసకర్త విద్యావిభాగాధిపతి, ఏయూ. ‘ 94907 98631