ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వొద్దు!
నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ మహ్మద్ యూనస్
సాక్షి, విశాఖపట్నం: ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని, దానివల్ల వారికి ప్రయోజనం కంటే అనర్థమే ఎక్కువ ఉంటుందని నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ మహ్మద్ యూనస్ అన్నారు. ’సుస్థిర అభివృద్ధి’ అనే అంశంపై ఆంధ్రా వర్సిటీలో గురువారం జరిగిన జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఉచితంగా ఏదైనా ఇవ్వడం కంటే ప్రజలు తమను తాము ఉద్ధరించుకునే వనరులను కల్పించాలన్నారు. భారత్లో నోట్ల రద్దుపై ఆయన మాట్లాడుతూ ఇదో మంచి అవకాశమని, అయితే ఇప్పటివరకూ ఉన్న నల్ల ధనాన్ని బయటకు తేవడంతో సరిపోదన్నారు. ఇకపై నల్లధనం పుట్టకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకు ముందు విద్యార్థులనుద్దేశించి యూనస్ ప్రసంగించారు. బంగ్లాదేశ్లో తాను స్థాపించిన గ్రామీణ బ్యాంకు విజయాల గురించి వివరించారు.