నిషేధిత జాబితా (22A)పై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వివరణ
సాక్షి, తిరుపతి: భూముల రిజస్ట్రేషన్ కు సంబంధించిన నిషేధిత జాబితా (22A)పై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మంగళవారం వివరణ ఇచ్చారు. గత ఐదు రోజులకు ముందు తిరుపతిలో భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించి గందరగోళం ఏర్పడిందని తెలిపారు. కొంతమంది బాధితులు తన దగ్గరకు వచ్చి జరిగిన విషయాన్ని తెలియజేశారని చెప్పారు. ఒక బాధ్యత గల శాసనసభ్యుడుగా బాధితుల ముందరే ముఖ్యమంత్రి కార్యాలయంతోను, ఐ.జి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వారితోను, ఎండోమెంట్ కమిషనర్ గారితోను మాట్లాడానని పేర్కొన్నారు.
తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు
‘సమస్య గురించి నేను మాట్లాడిన తర్వాత వారు టి.టి.డీ అధికారులకు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కు తగిన ఆదేశాలు ఇచ్చారు. టి.టి.డి జె.ఇ.ఓ, ఎస్టేట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని సమావేశపరచి సమస్యను వెను వెంటనే సరిదిద్దమని ఆదేశిస్తూ.. అందుకు సంబంధించి ఒక లేఖను జె.ఇ.ఓ గారి ద్వారా ఎండోమెంట్ కమిషనర్ గారికి రాయించడం కూడా జరిగింది. టి.టి.డి. కూడా జరిగిన పొరబాటును సరిదిద్దే ప్రక్రియ చేపట్టింది.
వేగవంతంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించి రిజిస్ట్రేషన్ లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది. నేను ఎప్పుడూ ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేసేవాడినే కానీ స్వప్రయోజనాల కోసం పనిచేసే వాడిని కాదు. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు తమ రాజకీయ స్వలాభం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలు చేసే అవాస్తవ ప్రచారం నమ్మొద్దు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా నేను ఎంతకైనా పోరాడే వ్యక్తినీ. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది’అని భూమన పేర్కొన్నారు.