Project canals
-
చైనా కంపెనీ రైల్వే కాంట్రాక్టు రద్దు
న్యూఢిల్లీ: భారత–చైనా సరిహద్దుల్లోని గాల్వన్ ప్రాంతంలో 20 మంది భారత సైనికుల వీర మరణం నేపథ్యంలో రైల్వే శాఖ తీవ్ర నిర్ణయం తీసుకుంది. చైనా కంపెనీకి అప్పగించిన రూ.471 కోట్ల ప్రాజెక్టును రద్దు చేసింది. కాన్పూర్ నుంచి మొగల్‌సరాయి వరకు ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లోని 417 కి.మీ.ల మార్గంలో సిగ్నలింగ్, సమాచార వ్యవస్థ ఏర్పాటు కోసం చైనాకు చెందిన బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్, డిజైన్ ఇన్స్టిట్యూట్కు చెందిన సిగ్నల్,కమ్యూనికేషన్ గ్రూప్‌తో 2016లో రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్టును 2019కల్లా పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటిదాకా 20 శాతం పనులే పూర్తయ్యాయి. ఇంజినీర్ల పర్యవేక్షణ లేకుండానే పనులు జరుగుతున్నాయని, ఒప్పందం ప్రకారం లాజిక్ డిజైన్ వంటి సాంకేతిక పత్రాలను చైనా సంస్థ ఇప్పటి వరకు తమకు అందించలేదని రైల్వే శాఖ అధికారులు అన్నారు. కాంట్రాక్టును వేగవంతం చేయాలంటూ పలు దఫాలుగా ఆ సంస్థ అధికారులతో చర్చలు జరిపినా ప్రయోజనం కనిపించ లేదన్నారు. సకాలంలో పనులను పూర్తి చేయలేక పోవడంతోపాటు పనుల్లో పురోగతి చాలా స్వల్పంగా ఉండటం వల్లే చైనా సంస్థతో కాంట్రాక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై ప్రపంచ బ్యాంకుకు ఇప్పటికే సమాచారం అందించినట్లు చెప్పారు. అయితే, సరిహద్దుల్లో చైనా పాల్పడుతున్న చర్యలకు ప్రతీకారంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
సాగర్ కాల్వల ఆధునీకరణ ఏమైంది?
అసెంబ్లీలో సభ్యుల ప్రశ్న 2016లో పూర్తిచేస్తాం: మంత్రి జవాబు హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణను సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, కాలువల ఆధునీకరణను త్వర గా పూర్తిచేసి భూములకు నీరందించాలని పలువురు శాసనసభ్యులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పోతుల రామారావు అడిగిన లిఖిత ప్రశ్నపై మంగళవారం శాసనసభలో చర్చ జరిగింది. రూ. 2,832.69 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన సాగ ర్కాల్వల ఆధునీకరణ పనులకు ప్రపంచ బ్యాంకు 48 శాతం, రాష్ట్రం 52 శాతం నిధు లు భరిస్తున్నాయని, ఇప్పటివరకు రూ. 810.94 కోట్లు వ్యయం చేశామని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. ఆధునీకరణ పనులను 2016 జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. అయితే.. ఇన్ని నిధులు వ్యయం చేసినా ఏ కాల్వ పనీ పూర్తి కాలేదని, ప్రకాశం జిల్లాలో ఏ కాల్వకూ లైనింగ్ వేయలేదని, కాంట్రాక్టర్లు పనులను సగంలో వదిలేసి వెళ్లిపోవడం వల్ల తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తోందని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కాలువ చివరి భూముల రైతుల ఇక్కట్లు పట్టించుకుని సాధ్యమైనంత త్వరగా నీరందించేలా చూడాలని స్పీకర్ కోడెల కూడా ప్రభుత్వానికి సూచించారు. ఈ నెల 27, 28 తేదీలలో కాల్వల పరిశీలనకు తనతో పాటు రావాలని మంత్రి ఉమ ఎమ్మెల్యేలను కోరారు.