Promobot
-
ముఖం, వాయిస్ రైట్స్‌తో కోట్లు సంపాదించొచ్చు..
పనిదొరక్క ఖాళీగా ఉండే చాలామంది పడే మాట.. ‘ రూపాయి సంపాదించిన మొహమా?’ అని. ఇకపై ఎవరైనా అలా అంటే ‘రూపాయేం కర్మ.. అక్షరాలా కోటిన్నర సంపాదించే మొహం’ అని దర్జాగా సమాధానం చెప్పొచ్చు. నిజం.. రష్యాకు చెందిన ప్రోమోబోట్ సంస్థ మనిషి ముఖం, స్వర హక్కులను కొనుగోలు చేస్తోంది. 2019 నుంచి ఈ సంస్థ హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేస్తోంది. అయితే, వీటిని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఓ ఉపాయాన్ని ఆలోచించింది. అదే మనిషి ముఖం, వాయిస్‌ల పేటెంట్ రైట్స్‌ను కొనుగోలు చేయటం. ఈ రెండిటిని ఉపయోగించి హ్యూమనాయిడ్ రోబో తయారు చేస్తే.. రోబోలు మరింత రియలిస్టిక్‌గా కనిపిస్తాయట. అందుకే, ‘25 సంవత్సరాలు లేదా అంతకంటే పైబడిన వారు ఎవరైనా సరే మీ ముఖం, వాయిస్ రైట్స్‌ను మా సంస్థకు అందించొచ్చు. ఇందుకు రెండు లక్షల డాలర్లు (రూ.1,50,43,976) చెల్లిస్తామని’ సంస్థ ప్రకటించింది. అయితే, ముందుకు వచ్చిన అందరినీ వీరు సెలెక్ట్ చేయరు. వివిధ పరీక్షల్లో ఎంపికైన వారి రైట్స్‌నే కొనుగోలు చేస్తారు. ఆ పరీక్షల్లో భాగంగా వంద గంటల ప్రసంగంతో పాటు, వివిధ ఫొటోషూట్లలో పాల్గొనాలి. కొన్ని షరతులనూ అంగీకరించాల్సి ఉంటుంది. అన్నీ నచ్చితే ఇక మీరు కూడా మీ ముఖం, వాయిస్ రైట్స్‌తో కోట్లు సంపాదించొచ్చు. బాగుంది కదూ! -
రోబో తప్పించుకుని రోడ్డుపైకి వచ్చింది..
ఓ రోబో హఠాత్తుగా రద్దీగా ఉండే రోడ్డుపై ప్రత్యక్షమైంది. నడిరోడ్డుపై అది ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అక్కడ రోబోను చూస్తున్న వారికి కాసేపు ఏమీ అర్థంకాలేదు. ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం తీసిన షాట్లా ఉన్నా.. నిజంగా జరిగిన ఘటన ఇది. రష్యాలోని పెర్మ్ నగరంలో సైంటిస్టుల నుంచి తప్పించుకున్న ఓ రోబో రోడ్డుపైకి వచ్చింది. దీని పేరు ప్రొమోబో. ఇంజనీర్ గేటు వేయడం మరచిపోవడంతో రోబో ప్రయోగశాల నుంచి బయటకు వచ్చింది. నడి రోడ్డుపైకి వచ్చేసరికి బ్యాటరీ అయిపోవడంతో అది ఆగిపోయింది. దీంతో దాదాపు గంట సేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఓ పోలీసు రోబో దగ్గరకు వచ్చి నిలబడి వాహనాలు దాన్ని ఢీకొట్టకుండా మళ్లించాడు. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి వచ్చి రోబోను అక్కడ నుంచి తీసుకెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి యూ ట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రొమోబోను తయారు చేసిన కంపెనీ సహ వ్యవస్థాపకుడు ఒలెగ్ కివోకుర్ట్సెవ్ మాట్లాడుతూ.. ఈ రోబో ప్రయోగశాలలో తనంతటతానే కదిలే విధానాన్ని నేర్చుకుంటున్నట్టు చెప్పారు. ఈ రోబోలు ప్రజలను గుర్తుపట్టడంతో పాటు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, తగిన సూచనలు ఇస్తాయని తెలిపారు.