Property rights
-
పోటాపోటీగా పేటెంట్లు.. రాయితీలతో కేంద్రం వెన్నుదన్ను
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జాతీయ ఉన్నత విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు యూనివర్సిటీలు, విద్యాసంస్థలు పేటెంట్ల విషయంలో పోటీపడుతున్నాయి. వీటిల్లో పరిశోధనా కార్యక్రమాలను మరింత పగడ్బందీగా కొనసాగిస్తుండడంతో కొత్త ఆవిష్కరణలతో స్వయం సమృద్ధికి వీలుగా మేథో సంపత్తి హక్కుల (ఇంటెలెక్యువల్ ప్రాపర్టీ రైట్స్) సాధనలో పురోగతి సాధిస్తున్నాయి. కేంద్రం కూడా ఈ ఉన్నత విద్యా సంస్థల్లో చేపట్టే ఆవిష్కరణలకు పేటెంట్లు కల్పించడంలో 80 శాతం ఫీజు రాయితీలు ఇవ్వడం కూడా నూతన ఆవిష్కరణలకు కారణమవుతున్నాయి. ఫలితంగా ఈ సంస్థలలో పేటెంట్ల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. నిజానికి.. ఏదైనా సంస్థ పేటెంట్ దాఖలు చేయాలంటే ముందుగా రూ.20వేల ఖర్చుపెట్టాలి. ఆ తరువాత వాటి పరిశీలన తదితర ప్రక్రియలలో మరికొంత మొత్తాన్ని ఛార్జీలుగా చెల్లించాలి. దీనికి అదనంగా.. పేటెంట్ చేసే వ్యక్తి 20 ఏళ్లపాటు దాని నిర్వహణ రుసుమును కూడా జమచేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఇప్పటివరకు ఉన్నత విద్యాసంస్థల్లో పేటెంట్లపై ఆసక్తి కనబర్చలేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం పరిశోధన, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా చట్టాన్ని సవరించి 80 శాతం రాయితీలను ప్రకటించడంతో క్రమేణా పేటెంట్లు పెరిగేందుకు ఆస్కారమేర్పడుతోంది. నూతన జాతీయ విద్యావిధానం–2020లో కూడా ఉన్నత విద్యా సంస్థల్లో నూతన ఆవిష్కరణలకు పెద్దపీట వేయాలని.. వాటి ద్వారా ఆయా సంస్థలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రణాళికలు అమలుచేయాలని సూచించింది. సమగ్ర పరిశోధనలతో నూతన ఆవిష్కరణలు చేసే వారికి ఆర్థిక సహకారం కూడా అందించేలా మార్గనిర్దేశం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏటా అధ్యాపకులు, పరిశోధక అభ్యర్థులకు నిధులు కూడా ఇస్తోంది. ఇలా ఏటా 10వేల పేటెంట్ల లక్ష్యంగా ఈ ప్రోత్సాహకాలను అందిస్తోంది. పేటెంట్ల వాణిజ్యీకరణను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ పేటెంట్ ర్యాంకింగ్స్‌లో స్థానాన్ని మెరుగుపర్చుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఏయూలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు ఈ పేటెంట్లను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం తన క్యాంపస్‌లో మేథో సంపత్తి హక్కుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఈ కేంద్రం డాక్యుమెంటేషన్ ప్రక్రియను పర్యవే„ìక్షించడంతో పాటు దాఖలుకు అయ్యే ఖర్చును కూడా భరిస్తోంది. అనేక విద్యాసంస్థల విద్యార్థులు తమ మెంటార్ల మార్గదర్శకత్వంలో వినూత్న ప్రాజెక్టుల పేటెంట్ల దాఖలుకు ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు.. 2020–21లో విద్యాసంస్థలు, ఇతర పరిశోధనా సంస్థలు అందించిన పేటెంట్ దరఖాస్తులు 58,503గా ఉన్నాయి. అందులో ప్రధానంగా మహారాష్ట్ర 4,214, తమిళనాడు 3,945, కర్ణాటక 2,784, యూపీ 2,317, తెలంగాణ 1,662, పంజాబ్ 1,650, ఢిల్లీ 1,608, గుజరాత్ 921, హర్యానా 765, ఆంధ్రప్రదేశ్ 709, పశ్చిమ బెంగాల్ 505 రాజస్థాన్ 449, కేరళ 426, మధ్యప్రదేశ్ 398, ఒడిశా 144, పాండిచ్చేరి నుంచి 139 దరఖాస్తులు వచ్చాయి. పేటెంట్లలో ముందున్నవి ఇవే.. ఇక కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వంటి పరిశోధనా సంస్థలు అత్యధిక సంఖ్యలో పేటెంట్లను దాఖలు చేయడంలో ముందున్నాయి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్, ట్రేడ్‌మార్క్ (సీజీపీడీటీఎం) నివేదిక ప్రకారం 2019–2020లో టాప్–10 విద్యాసంస్థలు అందించిన పేటెంట్ల సంఖ్య 2,533 కాగా.. 2020–21లో ఆ సంఖ్య 3,103కి పెరిగింది. 2019–20లో ఐఐటీలు 664 పేటెంట్లను దాఖలు చేశాయి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, చండీగఢ్ వర్సిటీ వంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు తక్కిన పేటెంట్లకు దరఖాస్తు చేశాయి. అలాగే, 2020–21లో ఐఐటీలు 640 పేటెంట్లు ప్రకటించగా తక్కిన సంస్థల్లో అవి మరింత మెరుగుపడ్డాయి. ఈ వర్సిటీల్లో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లను ఏర్పాటుచేసి ఈ పేటెంట్లను దాఖలు చేశాయి. ఇదీ చదవండి: AP: ఫ్యామిలీ డాక్టర్.. సరికొత్త ‘జీవన శైలి’ -
భూముల రక్షణకు ‘స్వామిత్వ’
న్యూఢిల్లీ: ‘గ్రామీణ ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేసే ‘స్వామిత్వ’ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఇది గ్రామీణ భారతాన్ని మార్చే విప్లవాత్మక కార్యక్రమం అని, ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా కీలక ముందడుగు అని పేర్కొన్నారు. ఈ కార్డులను ఉపయోగించి పల్లె ప్రజలు బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చన్నారు. అలాగే, దీంతో గ్రామస్తుల మధ్య భూ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తి తగాదాలు తొలగిపోతాయన్నారు. ఈ ‘సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్(స్వామిత్వ)’ కార్యక్రమంలో వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో ప్రధాని పాల్గొన్నారు. ఆస్తిపై యాజమాన్య హక్కు దేశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చెప్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఆస్తులకు సంబంధించి చట్టబద్ధమైన రికార్డులు ఉన్నవారు మూడింట ఒక వంతు మాత్రమేనని ప్రధాని వెల్లడించారు. ‘గ్రామాల్లోని యువత ఈ ప్రాపర్టీ కార్డులను హామీగా పెట్టి, స్వయం ఉపాధి కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు. ఆస్తిపై చట్టబద్ధ హక్కును కలిగి ఉండడం వల్ల యువతలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. తద్వారా స్వావలంబన సాధించగలుగుతారు’ అన్నారు. ప్రజలు తమ ఆస్తులపై స్పష్టమైన యాజమాన్య హక్కులు కలిగి ఉండటం అవసరమని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీతో భూముల మ్యాపింగ్ చేయాలని యోచిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ప్రసంగిస్తున్న సమయంలో ప్రధాని వెనుకవైపు ఆదివారం జయంతి ఉన్న సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ్, ఆరెస్సెస్ దిగ్గజం నానాజీ దేశ్‌ముఖ్‌ల ముఖచిత్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ఆ మహనీయుల సిద్ధాంతాలను ప్రధాని వివరించారు. గ్రామాల్లోని ప్రజలు తరచు ఆస్తికి సంబంధించిన వివాదాల్లో చిక్కుకుపోతే.. వారే కాకుండా, సమాజమూ అభివృద్ధి చెందబోదని నానాజీ దేశ్‌ముఖ్ భావించేవారిని వివరించారు. ఆ సమస్యను అంతం చేసే దిశగానే ఈ ఆస్తి కార్డుల విధానాన్ని ప్రారంభించామన్నారు. ఆస్తి కార్డుల ద్వారా బ్యాంక్ ఖాతాలను, విద్యుత్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, పక్కా ఇల్లు తదితర సౌకర్యాలు పొందవచ్చన్నారు. ప్రస్తుతం యూపీ, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరా ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 763 గ్రామా ల్లో ఈ స్వామిత్వను ప్రారంభించారు. ఈ గ్రామా ల్లోని ప్రజలు తక్షణం అవసరమనుకుంటే తమ ఫోన్లకు అధికారులు ఎస్ఎంఎస్ చేసిన లింక్ ద్వారా ప్రాపర్టీ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆస్తి కార్డుల పంపిణీని త్వరలో ప్రారంభిస్తాయి. ప్రతీ కార్డుకు ఆధార్ కార్డు తరహాలో ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. రానున్న మూడు, నాలుగేళ్లలో ప్రతీ కుటుంబానికి ప్రాపర్టీ కార్డులను అందజేస్తామని మోదీ తెలిపారు. వ్యవసాయ బిల్లులను వారే వ్యతిరేకిస్తున్నారు దళారి వ్యవస్థ బాగుపడాలని కోరుకునేవారే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారని ప్రధాని విపక్షాలపై విమర్శలు గుప్పించారు. మధ్యవర్తులు, దళారులు అందించిన అధికారంతోనే వారు రాజకీయాలు చేశారన్నారు. వారి కుయుక్తులకు రైతులు మోసపోరని వ్యాఖ్యానించారు. గత ఆరు దశాబ్దాల్లో విపక్ష ప్రభుత్వాలు చేయలేని గ్రామీణాభివృద్ధిని గత ఆరేళ్లలో తమ ప్రభుత్వం చేసి చూపిందన్నారు. ‘దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంటుందని చెబుతుంటారు. కానీ గత ప్రభుత్వాలు గ్రామీణ భారతాన్ని పట్టించుకోకుండా వదిలేశాయి’ అని విమర్శించారు. ‘గ్రామాలు, పేదలు, రైతులు, కూలీలు స్వావలంబన సాధించడం చాలా మందికి ఇష్టం ఉండదు. మా సంస్కరణలు రైతుల పొట్టకొడ్తున్న దళారుల అక్రమ ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. అందుకే మా సంస్కరణలపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు’ అని ప్రధాని ఆరోపించారు. ‘ఆ మధ్యవర్తులు, దళారుల వల్ల బలపడిన కొందరు కూడా ఈ వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు’ అని విపక్షాలపై పరోక్ష విమర్శలు చేశారు. -
ఆస్తి అడిగే హక్కు ఉంది!
‘‘ఇలా చేస్తారని అనుకోలేదే. మా కొడుకే పోయాక నువ్వెందుకు అని మా అత్తమామలు బయటికి గెంటేశారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో, ఎలా బతకాలో తెలియడం లేదు’’... అని దుఃఖపడింది మాధవి. ‘‘అదే పొరపాటు. నీ భర్త పోతేనేం, అతడి ఆస్తి ఉంది కదా? దానితో ధైర్యంగా బతుకు’’ అంది సరళ. ‘‘అది మాత్రం వాళ్లు ఇస్తారా ఏంటి?’’ నిరాశగా అంది మాధవి. ఏం చేస్తే ఇస్తారో సరళకి బాగా తెలుసు. అందుకే మాధవిని తీసుకుని లాయర్ దగ్గరకు వెళ్లి, తన భర్తకు చెందాల్సిన ఆస్తిని తనకివ్వమని కోరుతూ దావా వేయించి, చట్టపరంగా ఆసరా కల్పించింది. మాధవి ఉన్న పరిస్థితుల్లో చాలామంది మహిళలు ఉంటారు. వారికి చట్టాల పట్ల అవగాహన ఉండదు. తమకు ఏయే హక్కులు ఉన్నాయన్న విషయం అంతకన్నా తెలీదు. అందుకే తమకు రావాల్సిన వాటిని, చెందాల్సిన వాటిని కోల్పోతుంటారు. మహిళలు ఆర్థికంగా ఇబ్బందిపడకుండా ఉండేందుకు, వారికంటూ ఓ ఆసరా కల్పించేందుకుగాను భారతీయ చట్టాలు మహిళలకు ఆస్తిహక్కును కల్పించాయి. తండ్రి ఆస్తిలో పిల్లలకు కూడా సమానహక్కును కల్పిస్తూ 1986లో చట్టం వచ్చింది. తాతల ఆస్తిపాస్తుల్లో కూడా మనవలతో సమానంగా మనవరాళ్లకు కూడా పూర్తి హక్కు ఉంటుంది. దానిని అమ్మాలన్నా కొనాలన్నా వీరి సంతకాలు తప్పనిసరి. అలా జరగని పక్షంలో ధైర్యంగా కోర్టుకు వెళ్లవచ్చు. అదేవిధంగా భర్త సంపాదించిన ఆస్తిపై భార్యకు సర్వహక్కులు ఉంటాయి. భర్త చనిపోతే... అతడికి వారసత్వంగా వచ్చే ఆస్తిని ఆమె అడిగిమరీ తీసుకోవచ్చు. అయితే అత్తమామల ఆస్తిలో భాగం అడిగే హక్కు ఎవరికీ ఉండదు. వాళ్లు తన భర్తకి ఏదైనా రాసి ఇస్తే, దాని మీద మాత్రమే ఆమెకు హక్కు ఉంటుంది. ఎందుకంటే తాతల నాటి నుంచి వచ్చే ఆస్తి కాకుండా తల్లిదండ్రులు తమ స్వశక్తితో సంపాదించుకుని ఉంటే... దాని మీద సర్వాధికారాలూ వారికి మాత్రమే ఉంటాయి. వారికి నచ్చితే ఇస్తారు. ఇవ్వనంటే అడిగే హక్కును చట్టం కల్పించలేదు. మహిళలకు మరింత ఆర్థిక భద్రత కల్పించేందుకుగాను... భర్త రెసిడెన్షియల్ ప్రాపర్టీలో భార్యకు సమానహక్కు ఉండేలా సరికొత్త చట్టాన్ని కూడా ఇటీవల రూపొందించారు. ఇది పూర్తిగా అమలులోకి వస్తే భర్త నుంచి విడిపోయిన భార్యలకు మరింత ఉపయోగం అవుతుంది... అంటారు న్యాయవాది ఖలీమ్. నిజానికి ఇలాంటి చట్టాలను కొందరు దుర్వినియోగపరుస్తున్నారని, ఈ విషయంలో పునరాలోచించాలనే వాదన కూడా ఉంది. ఎవరో కొందరు అలాంటివాళ్లు ఉన్నారని, నిజమైన బాధితులకు న్యాయం చేయకుండా ఉండటం సరికాదు అంటారాయన! అయితే ఆస్తి వ్యవహారాలు ఏవైనా కానీ, కచ్చితమైన రిజిస్ట్రేషన్ తో ఉండాలన్న విషయాన్ని మర్చిపోవద్దు. రిజిస్టర్డ్ పత్రాలు కాకుండా, ఏదో కాగితం మీద రాసి ఇచ్చేస్తే చెల్లదు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హిందూ సక్సెషన్ యాక్ట్‌లోని సెక్షన్ 6, 29 ఎ లను చదివితే... ఆస్తుల విషయంలో ఎలాంటి హక్కులు ఉన్నాయన్నది స్పష్టంగా తెలుస్తుంది. అదే ముస్లిం స్త్రీలకైతే వేరే చట్టాలు ఉన్నాయి.