‘‘ఇలా చేస్తారని అనుకోలేదే. మా కొడుకే పోయాక నువ్వెందుకు అని మా అత్తమామలు బయటికి గెంటేశారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో, ఎలా బతకాలో తెలియడం లేదు’’... అని దుఃఖపడింది మాధవి. ‘‘అదే పొరపాటు. నీ భర్త పోతేనేం, అతడి ఆస్తి ఉంది కదా? దానితో ధైర్యంగా బతుకు’’ అంది సరళ. ‘‘అది మాత్రం వాళ్లు ఇస్తారా ఏంటి?’’ నిరాశగా అంది మాధవి.
ఏం చేస్తే ఇస్తారో సరళకి బాగా తెలుసు. అందుకే మాధవిని తీసుకుని లాయర్ దగ్గరకు వెళ్లి, తన భర్తకు చెందాల్సిన ఆస్తిని తనకివ్వమని కోరుతూ దావా వేయించి, చట్టపరంగా ఆసరా కల్పించింది.
మాధవి ఉన్న పరిస్థితుల్లో చాలామంది మహిళలు ఉంటారు. వారికి చట్టాల పట్ల అవగాహన ఉండదు. తమకు ఏయే హక్కులు ఉన్నాయన్న విషయం అంతకన్నా తెలీదు. అందుకే తమకు రావాల్సిన వాటిని, చెందాల్సిన వాటిని కోల్పోతుంటారు. మహిళలు ఆర్థికంగా ఇబ్బందిపడకుండా ఉండేందుకు, వారికంటూ ఓ ఆసరా కల్పించేందుకుగాను భారతీయ చట్టాలు మహిళలకు ఆస్తిహక్కును కల్పించాయి.
తండ్రి ఆస్తిలో పిల్లలకు కూడా సమానహక్కును కల్పిస్తూ 1986లో చట్టం వచ్చింది. తాతల ఆస్తిపాస్తుల్లో కూడా మనవలతో సమానంగా మనవరాళ్లకు కూడా పూర్తి హక్కు ఉంటుంది. దానిని అమ్మాలన్నా కొనాలన్నా వీరి సంతకాలు తప్పనిసరి. అలా జరగని పక్షంలో ధైర్యంగా కోర్టుకు వెళ్లవచ్చు. అదేవిధంగా భర్త సంపాదించిన ఆస్తిపై భార్యకు సర్వహక్కులు ఉంటాయి. భర్త చనిపోతే... అతడికి వారసత్వంగా వచ్చే ఆస్తిని ఆమె అడిగిమరీ తీసుకోవచ్చు.
అయితే అత్తమామల ఆస్తిలో భాగం అడిగే హక్కు ఎవరికీ ఉండదు. వాళ్లు తన భర్తకి ఏదైనా రాసి ఇస్తే, దాని మీద మాత్రమే ఆమెకు హక్కు ఉంటుంది. ఎందుకంటే తాతల నాటి నుంచి వచ్చే ఆస్తి కాకుండా తల్లిదండ్రులు తమ స్వశక్తితో సంపాదించుకుని ఉంటే... దాని మీద సర్వాధికారాలూ వారికి మాత్రమే ఉంటాయి. వారికి నచ్చితే ఇస్తారు. ఇవ్వనంటే అడిగే హక్కును చట్టం కల్పించలేదు.
మహిళలకు మరింత ఆర్థిక భద్రత కల్పించేందుకుగాను... భర్త రెసిడెన్షియల్ ప్రాపర్టీలో భార్యకు సమానహక్కు ఉండేలా సరికొత్త చట్టాన్ని కూడా ఇటీవల రూపొందించారు. ఇది పూర్తిగా అమలులోకి వస్తే భర్త నుంచి విడిపోయిన భార్యలకు మరింత ఉపయోగం అవుతుంది... అంటారు న్యాయవాది ఖలీమ్. నిజానికి ఇలాంటి చట్టాలను కొందరు దుర్వినియోగపరుస్తున్నారని, ఈ విషయంలో పునరాలోచించాలనే వాదన కూడా ఉంది. ఎవరో కొందరు అలాంటివాళ్లు ఉన్నారని, నిజమైన బాధితులకు న్యాయం చేయకుండా ఉండటం సరికాదు అంటారాయన!
అయితే ఆస్తి వ్యవహారాలు ఏవైనా కానీ, కచ్చితమైన రిజిస్ట్రేషన్ తో ఉండాలన్న విషయాన్ని మర్చిపోవద్దు. రిజిస్టర్డ్ పత్రాలు కాకుండా, ఏదో కాగితం మీద రాసి ఇచ్చేస్తే చెల్లదు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హిందూ సక్సెషన్ యాక్ట్‌లోని సెక్షన్ 6, 29 ఎ లను చదివితే... ఆస్తుల విషయంలో ఎలాంటి హక్కులు ఉన్నాయన్నది స్పష్టంగా తెలుస్తుంది. అదే ముస్లిం స్త్రీలకైతే వేరే చట్టాలు ఉన్నాయి.
ఆస్తి అడిగే హక్కు ఉంది!
Published Mon, Nov 25 2013 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement