protected drinking water scheme
-
ప్రతి గ్రామానికీ రక్షిత తాగునీరు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): దేశంలోని ప్రతి గ్రామానికి రక్షిత తాగు నీరు అందించాలన్నదే తమ మిషన్ ప్రధాన ఉద్దేశమని నేషనల్ జల్ జీవన్ మిషన్ అడిషనల్ సెక్రటరీ భరత్‌లాల్ స్పష్టం చేశారు. విజయవాడలోని సున్నపు బట్టీల సెంటర్లోని ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) హాలులో ‘గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, పారిశుధ్యం’ అంశంపై సిబ్బందికి శనివారం వర్క్‌షాప్ జరిగింది. భరత్‌లాల్ వర్చువల్ విధానంలో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 9 శాతం మంది ప్రజలకు నీటి సరఫరా సక్రమంగా లేదని, 5 శాతం మంది నీటి కుళాయి కనెక్షన్లు పనిచేయడం లేదని, మరో 9 శాతం మంది తమకు నీరు సమృద్ధిగా అందడం లేదని తాము నిర్వహించిన సర్వేలో ప్రజలు చెప్పారన్నారు. ప్రారంభ సభకు అతిథిగా హాజరైన కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ..జల్‌జీవన్ మిషన్ ద్వారా అందరికీ నీరు అందేందుకు అంచనాలను సక్రమంగా రూపొందించాలన్నారు. గ్రామ స్థాయిలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ భవనాలకు, గ్రామంలోని ప్రతి ఇంటికి శుభ్రమైన తాగునీటిని అందించాలన్నారు. నేషనల్ జల్‌జీవన్ మిషన్ డైరెక్టర్ ప్రదీప్‌సింగ్, డెప్యూటీ డైరెక్టర్ ఏ మురళీధరన్, రాష్ట్ర నీటి పారుదల, పారిశుధ్య శాఖ చీఫ్ ఇంజనీరు ఆర్.బి.కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
నల్లాలు బంద్
► జిల్లా కేంద్రంలో 15 రోజులుగా నీటి కటకట ► పనిచేయని రక్షిత మంచినీటి పథకం ► ఇబ్బందులు పడుతున్న పట్టణవాసులు ► పట్టించుకోని అధికారులు ఆసిఫాబాద్/ఆసిఫాబాద్ అర్బన్: జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌లో నల్లాలు బంద్ అయ్యాయి. గత 15 రోజులుగా నల్లాలు రాక ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఎక్కడైనా వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ ఆసిఫాబాద్ పట్టణంలో ఏటా వర్షాకాలంలో రక్షిత మంచినీటి పథకం పనిచేయకపోవడం పరిపాటిగా మారింది. గతంలో పట్టణంలో నల్లాల ద్వారా మురికి నీరు సరఫరా కావడంతో పలు మార్లు స్థానికులు ఆందోళనలు చేపట్టారు. ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టి సాధించికున్న రక్షిత మంచినీటి పథకం తరచూ విద్యుత్ మోటార్లు కాలిపోవడం, వర్షాకాలంలో పెద్దవాగులో నీటి ప్రవాహం పెరగడం, విద్యుత్ లో ఓల్టేజితో పాటు చిన్న చిన్న సమస్యలతో గత పక్షం రోజులుగా రక్షిత మంచినీటి పథకం పని చేయడం లేదు. పట్టణ ప్రజలకు శుద్ధజలం అందించేందుకు రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ పథకం తరచూ మొరాయిస్తోంది. దీంతో పట్టణ ప్రజలకు శుద్ధజలం అందని ద్రాక్షగా మారుతోంది. నల్లాలు రాక ప్రజలు చేతి పంపు నీటిని తాగాల్సి వస్తోంది. పని చేయని ఫిల్టర్లుపట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్ఎఫ్, ఆర్ఎస్ఎఫ్ ఫిల్టర్ యూనిట్లు వర్షాకాలంలో పెద్దవాగు నుంచి సరఫరా అయ్యే మురికి నీటిని శుద్ధి చేయకపోవడం ఇబ్బందిగా మారింది. వాగులో ఇన్ఫిల్ట్రేషన్ లేకపోవడం, పెద్దవాగు నుంచి మోటార్ సహాయంతో నేరుగా ఇన్‌టెక్ వెల్‌లోకి, అక్కడి నుంచి పంపింగ్ మోటార్ల సహాయంతో ఎస్ఎస్ఎఫ్, ఆర్ఎస్ఎఫ్ ఫిల్టర్ యూనిట్ల వద్దకు చేర్చిన నీటిని శుద్ధిచేయకపోవడంలో తరచూ సమస్య తలెత్తుతోంది. గ్రామీణ నీటి సరఫరాల విభాగం అధికారులు వర్షాకాలంలో రక్షిత మంచినీటి సరఫరాపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో ఏటా తాగునీటి సమస్య తలెత్తుతోంది. ఈ విషయమై పంచాయతీ అధికారులు నిర్వహణ బాధ్యత ఆర్డబ్ల్యూఎస్ అధికారులదేనని చేతులెత్తేయడం, బిల్లుల్లో జాప్యం పేరుతో పథకం నిర్వహణ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే సమస్య తలెత్తుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాగునీటి సరఫరాపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారు. ఫిల్టర్ యూనిట్లో నీటిని శుద్ధిచేసేందుకు ఉపయోగించే క్లోరిన్, పటిక, ఆలంలను వినియోగించకపోవడంతో నల్లాల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతోంది. కలుషిత నీటి సరఫరా.. పట్టణంలోని గాంధీచౌక్, బ్రాహ్మణవాడ, రావులవాడ, శివకేశవమందిర్తోపాటు పలు కాలనీల్లో నల్లాల ద్వారా కళుశిత నీరు సరఫరా అవుతోంది. తాగునీటి పైపుల్లో లీకేజీలు ఉండడంతో వాటిలో డ్రెయినేజీ నీరు చేరి మురికినీరు సరఫరా అవుతోంది. దీంతో చాలా మంది ప్రజలు చేతిపంపు నీటిని సేవిస్తున్నారు. ఈ నీటిలో క్యాల్షియం శాతం అధికంగా ఉండడంతో ప్రజలు అనారోగ్యంతోపాటు కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తాగునీటికి ఇబ్బందవుతోంది వర్షాకాలంలో ఏటా రోజుల తరబడి నల్లాలు రాకపోవడంతో తాగునీటికి ఇబ్బందవుతోంది. దీంతో చేతిపంపులు, వాటర్ ప్లాంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. సంపన్న వర్గాలకు వాటర్ ప్యూరిఫై ప్లాంట్లు ఉండగా, పేద వర్గాలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలి. – మల్రాజ్ కిరణ్, ఆసిఫాబాద్ 15 రోజులుగా నల్లాలు వస్తలేవు గత 15 రోజులుగా పట్టణంలో నల్లాలు రావడం లేదు. దీంతో మహిళలు చేతిపంపుల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. నల్లాలు రానప్పుడు గ్రామపంచాయతీ అధికారులు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలి. చేతిపంపు నీటిని తాగడం వల్ల అనారోగ్యం పాలవుతున్నాం. – ఆమ్టే శ్రీమతి రెండు మూడు రోజుల్లో పరిష్కరిస్తాం లో ఓల్టేజ్ సమస్యతో తరచూ మోటార్లు కాలిపోతున్నాయి. మోటార్లకు ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ సరిపోకపోవడంతో సమస్య తలెత్తుతోంది. ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్‌శాఖ సమన్వయంతో సమస్య పరిష్కరించాలి. ఈ విషయం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. – రుషి, పంచాయతీ కార్యదర్శి, ఆసిఫాబాద్ -
ఈ దాహం తీరనిది!
సాక్షి, నిజామాబాద్ : ‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా తయారైంది కామారెడ్డి అధికార పార్టీ నేతలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల తీరు. ఇక్కడ భారీ తాగునీటి పథకం నిర్మాణానికి సర్కారు 140 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. వీటిని పూర్తి స్థాయిలో ఖర్చు చేశారు. కానీ, ఈ పనులతో పర్సెంటేజీల రూపంలో అధికార పార్టీ నేతలు, ఇంజనీరింగ్ అధికారుల ‘దాహం’ తీరిందే తప్ప, కామారెడ్డి ప్రాంతవాసులకు మాత్రం ఐదేళ్లుగా చుక్క నీరు అందలేదు. ట్రయల్ రన్ పూర్తయిందని గొప్పలు పోతున్న అధికారులు, నేతలు ఇప్పుటి వరకు ఖర్చు చేసిన నిధులు సరిపోవడం లేదని, తాగునీరు ప్రజల చెంతకు చేరాలంటే ఇంకా అదనంగా నిధులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి సర్కారు నుంచి ఇప్పటి వరకు సమాధానం లేదు. అంటే రానున్న వేసవిలోగా కూడా ప్రజలకు ఈ పథకం ద్వారా తాగునీరు సరఫరా చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఇదీ పరిస్థితి కామారెడ్డి పట్టణంతోపాటు, మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, సదాశివనగర్, తాడ్వాయి మండలాల పరిధిలో ఉన్న 219 గ్రామాలలోని 3.34 లక్షల మంది తాగు నీటి అవసరాలను తీర్చేందుకు 2008లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. సదాశివనగర్ మండలం మల్లన్న గుట్ట వద్ద నాలుగు ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు (ఓహెచ్‌బీఆర్) నిర్మించాలని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయం నుంచి 0.87 టీఎంసీల నీటిని ఇందులోకి తరలించాలని నిర్ణయించారు. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటరీల ద్వారా గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేయాలని, మధ్య మధ్యలో నాలుగు సంపులను నిర్మించాలనుకున్నారు. ఇప్పటి వరకు ఎస్ఆర్ఎస్పీ జలాశయం వద్ద ఇన్‌టెక్ వెల్, ఫుట్‌బ్రిడ్జి, రిటైనింగ్‌వాల్, నీటిని శుద్ధి చేసే ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు పూర్తయ్యాయి, మూడు ఓహెచ్‌బీఆర్‌లను, నాలుగు సంపులను నిర్మించారు. నీటిని తోడేందుకు పంపుసెట్లను బిగించి, టెస్టింగ్ కూడా పూర్తి చేశారు. పైప్లైన్ల జాయింట్లను బిగించి ట్రయల్న్ ్రకూడా విజయవంతంగా నిర్వహించారు. మల్లన్న గుట్ట వద్దకు నీరు విజయవంతంగా చేరుకుంది కానీ పథకం లక్ష్యం మాత్రం నెరవేరలేదు. కారణం అక్కడి నుంచి కామారెడ్డి పట్టణానికి పైపులైన్ల నిర్మాణం పూర్తి కాకపోవడమే. ఫలితంగా పనులు ప్రారంభమై ఐదేళ్లు గడుస్తున్నా ఆయా గ్రామాల గొంతు తడవడం లేదు. రూ.72.75 కోట్ల అదనపు నిధులకు ప్రతిపాదనలు ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు ఒక్క గ్రామానికి కూడా తాగునీటిని సరఫరా చేయని గ్రామీణ నీటి సరఫరా అధికారులు అదనంగా 45 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఫేజ్-2 కింద రూ.72.75 కోట్లతో సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. ఇందులో ప్రస్తుత కిరణ్ సర్కారు రూ. 20 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులకు సంబంధించి అధికారులు టెండరు ప్రక్రియ చేపట్టారు. వచ్చిన నిధుల మేరకు పనులు పూర్తి చేశామని, మిగతా నిధుల కోసం ఎదురు చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కొనసాగుతున్న పైప్‌లైన్ పనులు మల్లన్నగుట్ట ఓబీహెచ్‌ఆర్‌ల నుంచి కామారెడ్డి పట్టణానికి తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రజారోగ్యశాఖ అదనంగా చేపట్టిన పైప్‌లైన్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు రెండు నెలల క్రితం ప్రారంభమైన ఈ పనులు నెలలోపు పూర్తి చేస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు. గడువు పూర్తి అయినా పను లు ఓ కొలిక్కి రాలేదు. దీంతో రానున్న వేసవిలోనూ కామారెడ్డి పట్టణవాసులకు తాగునీరందే అవకాశాలు కనిపించడం లేదు.