నల్లాలు బంద్
► జిల్లా కేంద్రంలో 15 రోజులుగా నీటి కటకట
► పనిచేయని రక్షిత మంచినీటి పథకం
► ఇబ్బందులు పడుతున్న పట్టణవాసులు
► పట్టించుకోని అధికారులు
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్ అర్బన్: జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌లో నల్లాలు బంద్ అయ్యాయి. గత 15 రోజులుగా నల్లాలు రాక ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఎక్కడైనా వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ ఆసిఫాబాద్ పట్టణంలో ఏటా వర్షాకాలంలో రక్షిత మంచినీటి పథకం పనిచేయకపోవడం పరిపాటిగా మారింది. గతంలో పట్టణంలో నల్లాల ద్వారా మురికి నీరు సరఫరా కావడంతో పలు మార్లు స్థానికులు ఆందోళనలు చేపట్టారు.
ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టి సాధించికున్న రక్షిత మంచినీటి పథకం తరచూ విద్యుత్ మోటార్లు కాలిపోవడం, వర్షాకాలంలో పెద్దవాగులో నీటి ప్రవాహం పెరగడం, విద్యుత్ లో ఓల్టేజితో పాటు చిన్న చిన్న సమస్యలతో గత పక్షం రోజులుగా రక్షిత మంచినీటి పథకం పని చేయడం లేదు. పట్టణ ప్రజలకు శుద్ధజలం అందించేందుకు రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ పథకం తరచూ మొరాయిస్తోంది. దీంతో పట్టణ ప్రజలకు శుద్ధజలం అందని ద్రాక్షగా మారుతోంది. నల్లాలు రాక ప్రజలు చేతి పంపు నీటిని తాగాల్సి వస్తోంది.
పని చేయని ఫిల్టర్లుపట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌ఎఫ్, ఆర్‌ఎస్‌ఎఫ్ ఫిల్టర్ యూనిట్లు వర్షాకాలంలో పెద్దవాగు నుంచి సరఫరా అయ్యే మురికి నీటిని శుద్ధి చేయకపోవడం ఇబ్బందిగా మారింది. వాగులో ఇన్‌ఫిల్ట్రేషన్ లేకపోవడం, పెద్దవాగు నుంచి మోటార్ సహాయంతో నేరుగా ఇన్‌టెక్ వెల్‌లోకి, అక్కడి నుంచి పంపింగ్ మోటార్ల సహాయంతో ఎస్‌ఎస్‌ఎఫ్, ఆర్‌ఎస్‌ఎఫ్ ఫిల్టర్ యూనిట్ల వద్దకు చేర్చిన నీటిని శుద్ధిచేయకపోవడంలో తరచూ సమస్య తలెత్తుతోంది.
గ్రామీణ నీటి సరఫరాల విభాగం అధికారులు వర్షాకాలంలో రక్షిత మంచినీటి సరఫరాపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో ఏటా తాగునీటి సమస్య తలెత్తుతోంది. ఈ విషయమై పంచాయతీ అధికారులు నిర్వహణ బాధ్యత ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులదేనని చేతులెత్తేయడం, బిల్లుల్లో జాప్యం పేరుతో పథకం నిర్వహణ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే సమస్య తలెత్తుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాగునీటి సరఫరాపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారు. ఫిల్టర్ యూనిట్లో నీటిని శుద్ధిచేసేందుకు ఉపయోగించే క్లోరిన్, పటిక, ఆలంలను వినియోగించకపోవడంతో నల్లాల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతోంది.
కలుషిత నీటి సరఫరా..
పట్టణంలోని గాంధీచౌక్, బ్రాహ్మణవాడ, రావులవాడ, శివకేశవమందిర్‌తోపాటు పలు కాలనీల్లో నల్లాల ద్వారా కళుశిత నీరు సరఫరా అవుతోంది. తాగునీటి పైపుల్లో లీకేజీలు ఉండడంతో వాటిలో డ్రెయినేజీ నీరు చేరి మురికినీరు సరఫరా అవుతోంది. దీంతో చాలా మంది ప్రజలు చేతిపంపు నీటిని సేవిస్తున్నారు. ఈ నీటిలో క్యాల్షియం శాతం అధికంగా ఉండడంతో ప్రజలు అనారోగ్యంతోపాటు కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తాగునీటికి ఇబ్బందవుతోంది
వర్షాకాలంలో ఏటా రోజుల తరబడి నల్లాలు రాకపోవడంతో తాగునీటికి ఇబ్బందవుతోంది. దీంతో చేతిపంపులు, వాటర్ ప్లాంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. సంపన్న వర్గాలకు వాటర్ ప్యూరిఫై ప్లాంట్లు ఉండగా, పేద వర్గాలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలి. – మల్రాజ్ కిరణ్, ఆసిఫాబాద్
15 రోజులుగా నల్లాలు వస్తలేవు
గత 15 రోజులుగా పట్టణంలో నల్లాలు రావడం లేదు. దీంతో మహిళలు చేతిపంపుల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. నల్లాలు రానప్పుడు గ్రామపంచాయతీ అధికారులు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలి. చేతిపంపు నీటిని తాగడం వల్ల అనారోగ్యం పాలవుతున్నాం. – ఆమ్టే శ్రీమతి
రెండు మూడు రోజుల్లో పరిష్కరిస్తాం
లో ఓల్టేజ్ సమస్యతో తరచూ మోటార్లు కాలిపోతున్నాయి. మోటార్లకు ట్రాన్స్‌ఫార్మర్ కెపాసిటీ సరిపోకపోవడంతో సమస్య తలెత్తుతోంది. ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్‌శాఖ సమన్వయంతో సమస్య పరిష్కరించాలి. ఈ విషయం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. – రుషి, పంచాయతీ కార్యదర్శి, ఆసిఫాబాద్