తిరుపతిలో సైకో వీరంగం
తిరుపతి మెడికల్ : ప్రశాంత వాతావరణంగా భావించి అన్నారావు ఇస్కాన్ మార్గంలో ఓ సైకో వీరంగం చేశాడు. కర్ర చేతపట్టుకుని ఓ చిన్న అపార్టుమెంట్లోకి దూరిన సైకో ఇంటి తలుపులు గట్టిగా దబదబామని బాదుతూ కేకలు వేస్తూ వీర విహారం చేశారు. ఇదేదో జరుగుతోందని తలుపు తీసిన ఓ యువకుడి తలపై కర్రతో కొట్టి గాయపరచడం, మరో ఇంట్లోకి దూరి దాడికి యత్నించడంతో ప్రజలు భీతెల్లిపోయారు.
నార్త్ ఇండియాకు చెందిన 24 ఏళ్ల యువకుడు బుధవారం అన్నారావు సర్కిల్ సమీపంలోని ఫెడరల్ బ్యాంక్ మిద్దెపైన చిన్నపాటి అపార్టుమెంట్లోకి దూరాడు. అక్కడ దాదాపు పది కుటుంబాలు ఉన్నాయి. మొదట ఒకటో నంబరు ఇంటి తలుపు దబదబా కొట్టడంతో లోపల నుంచి వచ్చిన యువకుడు రాజేష్ తలుపు తీయగా కర్రతో తలపై గట్టిగా కొట్టాడు. రక్తం రావడంతో అక్కడి నుంచి రెండవ అంతస్తులోకి వెళ్లి ఇంటి తలుపులను తట్టాడు. వారు అప్పటికే కింద ఫ్లోర్లోని బాధితల అరుపులు, కేకలు విని తలుపు తీయలేదు. మూడో అంతస్తులోకి వెళ్లి ఓ ఇంట్లోకి దూరి దాడి చేయడంతో వారు తప్పించుకుని పారిపోయారు. మళ్లీ రెండవ అంతస్తులోకి వచ్చిన సైకో తలుపులను గట్టిగా కొట్టాడు. అలిపిరి పోలీసులకు ఫోన్ చేసినా గంట వరకు వారు రాలేదని బాధితులు ఆరోపించారు. ఎట్టకేలకు స్థానికులే ధైర్యం చేసి సైకోను పట్టుకోవడంతో తన చేతిలోని కర్రతో తనకు తానే ముఖం, తలపై రక్తం వచ్చేలా కొట్టుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న సైకోను స్థానికులు 108 లో రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు గాయపడిన సైకోకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే అపార్టుమెంట్లోకి వెళ్లకముందే పక్కనే ఉన్న రెమిడీ ఆస్పత్రిలో దాడికి యత్నించడంతో సెక్యూరిటీ సిబ్బంది అతన్ని నెట్టేశారు.