ఒత్తిడిలో ఉన్నారా? అయితే రంగుపడాల్సిందే!
ట్రెండ్
ఒక్కసారి బాల్యాన్ని గుర్తు తెచ్చుకోండి.
‘రంగులు నింపండి’ అనే వాక్యం కింద ఉన్న బొమ్మలను మన దగ్గరున్న రకరకాల కలర్ పెన్సిళ్లతోనో, స్కెచ్పెన్లతోనో రంగులు వేసి మురిసిపోయేవాళ్లం.
ఇప్పుడు కూడా అలా చేస్తే ఏమంటారు?
‘‘ఇంకా నీలో బాల్యం పోలేదు’’ అంటారు.
లేటెస్ట్ ట్రెండ్ ఏమిటంటే, ఫ్రాన్సులో చిన్నాపెద్దా తేడా లేకుండా బొమ్మలకు రంగులు వేస్తున్నారు. ఈ ధోరణి ఇప్పుడు బ్రిటన్‌కు కూడా పాకి... అక్కడినుండి పలుదేశాలకు వెళుతోంది.
బొమ్మలకు రంగులు వేయడం ద్వారా, ఒత్తిడిని జయించవచ్చుననేది సరికొత్త మానసిక సిద్ధాంతం. దీంతో ఇప్పుడు చాలా మంది అభిరుచుల జాబితాలో ఇది పెద్దపీట వేసుకుంది.
‘‘ఒత్తిడికి గురవుతున్నాననే భావనకు లోనుకాగానే మందు కొట్టేవాడిని. ఒత్తిడికి దూరం కావడం మాట అలా ఉంచి, అనారోగ్య సమస్యలు దగ్గర కావడం మొదలయ్యాయి. ఏంచేయాలో తోచేది కాదు. ఈ సమయంలో మా ఆవిడ ఈ ‘కలరింగ్ థెరపీ’ గురించి చెప్పింది. మొదట్లో నమ్మలేదుగానీ, ఒకసారి ప్రయత్నించి చూస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఒత్తిడి మాయమైంది’’ అంటున్నాడు మెట్జ్ (ఫ్రాన్స్) నగరానికి చెందిన విలియం హెన్రీ. కలర్ థెరపీకి నిర్దిష్టమైన సమయం అంటూ లేదు. కొందరు అయిదు నిమిషాల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందితే, మరికొందరు గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు.
‘క్రియేటివ్ థెరపీ కలరింగ్ బుక్’ పేరుతో మైఖేల్ ఒ మార రాసిన పుస్తకం హాట్ కేక్‌లా అమ్ముడుపోతోంది.
‘‘రంగులు వేయడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడం అనేది నిన్న మొన్నటి విషయం కాదు. చాలా ఏళ్ల క్రితమే ఇది ఉనికిలో ఉంది’’ అంటున్నారు కొందరు మానసిక నిపుణులు. ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడకూడదూ!