రజనీతో అవకాశం కోసం చూస్తున్నా
రజనీకాంత్‌తో నటించే అవకాశం ఎప్పుడు వచ్చినా నటించడానికి రెడీ అంటున్నారు నటి హన్సిక. చక్కని అందం, అభినయంతోపాటు మంచి మానవత్వం హన్సికలో అదనపు అర్హత. సామాజిక స్పృహ ఉన్న నటి. ప్రముఖ కథానాయికల్లో ఒకరిగా వెలుగొందుతున్న హన్సిక చేతిలో ప్రస్తుతం అరడజను చిత్రాల వరకూ ఉన్నాయి. వేలాయుధం తరువాత విజయ్‌తో నటించిన చిత్రం పులి. ఈ చిత్రం అక్టోబర్ ఒకటవ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది.
భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం సాధించే విజయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ పాలరాతి బొమ్మతో చిట్‌చాట్.
ప్రశ్న: పులి చిత్రంలో నటించిన అనుభవం గురించి?
జవాబు: పులి చిత్రంలో యువరాణిగా నటించాను. ఇందులో కొన్ని సంభాషణలను బట్టీ పట్టి చాలా కష్టపడి చెప్పాను. విజయ్, శ్రీదేవి, శ్రుతీహాసన్, సుదీప్ తదితర ప్రముఖ నటీనటులతో నటించడం మంచి అనుభవం.
ప్రశ్న: విజయ్‌తో ఇంతకు ముందు వేలాయుధం చిత్రంలో నటించారు. ఇప్పుడు పులి చిత్రంలో చేశారు. ఆయనలో మీకు కనిపించిన మార్పు?
జ: ఆయనలో యవ్వనం నానాటికీ పెరుగుతోందనే చెప్పాలి. ఎలాగో తెలియదు గానీ సహనటీనటులతో అనుసరించి నటిస్తారు. ఒక పెద్ద స్టారనే భావం ఎప్పుడూ విజయ్‌లో కనిపించదు.ఆయనతో నటించడం నాకెప్పుడూ ఇష్టమే. విజయ్ గుణం, మనసు, ఇతరులకు సాయం చేసే తత్వం నాకు బాగా నచ్చాయి.
ప్రశ్న: పులి చిత్రంలో మీ రాణీ గెటప్ గురించి?
జ: యువరాణి పాత్ర కోసం వజ్రాలతో పొదిగిన నగలను ధరించాను. వాటిని మరింత మెరుగు పరిచేలా కాస్ట్యూమ్స్, హెయిర్డ్రెస్, మేకప్ అంటూ చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాం. అందుకే రాజసం ఉట్టిపడేలా కనిపిస్తాను.
ప్రశ్న: అరణ్మణైలో ఆండ్రియా, అరణ్మణై-2లో త్రిష, పులిలో శ్రుతీహాసన్ ఇలా ఇద్దరు కథానాయికల చిత్రాలలోనే నటిస్తున్నారే?
జ: అలా నటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ఇంకా చెప్పాలంటే ఆ విషయం గురించి నేను అస్సలు పట్టించుకోను. నా పాత్ర ఏమిటన్న అంశం పైనే దృష్టి పెడతాను. నేను అందరితోనూ స్నేహంగా మసలుకుంటాను. ఇటీవల నటి త్రిషతో కూడా మిత్రత్వం పెంచుకున్నాను.
ప్రశ్న: రజనీకాంత్ కొత్ర చిత్రం మొదలైన ప్రతి సారీ ఆయనతో నటించే హీరోయిన్లలో మీ పేరు వినిపిస్తోంది. ఆయనతో ఎప్పుడు నటిస్తారు?
జ: ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు అవకాశం వచ్చినా రజనీకాంత్‌తో నటించడానికి నేను రెడీ.
ప్రశ్న: పులి చిత్రంలో శ్రీదేవితో నటించిన అనుభవం గురించి?
జ: చాలా మంచి అనుభవం. శ్రీదేవి గొప్ప నటి అని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది. మేడమ్ కెమెరా ముందుకు వచ్చారంటే ఎంతో ఎంజాయ్ చేస్తూ నటించడం చూశాను. అలాంటి ఆమెకు కూతురుగా పులి చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది. మొత్తం మీద పులి చిత్రంలో నటించడమే తీయని అనుభవం.
ప్రశ్న: ఎలాంటి పాత్రలో నటించాలని ఆశ పడుతున్నారు?
జ: ప్రేక్షకులు ఇష్టపడే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి నేను సిద్ధమే.