pullela gopi chand
-
ఆటగాళ్లపై నా నియంత్రణ లేదు: గోపీచంద్
ముంబై: భారత షట్లర్ల టోర్నీ ప్రణాళికలు, ప్రాక్టీస్ వంటి అంశాలు తన అదుపులో ఉండటం లేదని చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘దురదృష్టవశాత్తు మన దేశంలో ఓ క్రమ పద్ధతి అంటూ ఉండదు. ఇక్కడ చీఫ్ కోచ్ పాత్ర పూర్తిగా అలంకారప్రాయమైంది. కోచ్‌గా నాకు ఏ హక్కులు లేవు. అసలు జాతీయ కోచ్ అనేది అర్థం లేని పదవిగా మారింది. సెలక్షన్స్‌లో కానీ, ప్రణాళికల్లో కానీ భాగస్వామ్యమే ఉండదు. సహాయ కోచ్‌ల్ని ఎంపిక చేసుకోలేం, వారి పారితోషికాల్ని నిర్ణయించలేం. ఇవేవీ లేని జాతీయ కోచ్, అతని బృందం ప్రపంచ స్థాయి ఆటగాళ్లను ఎలా తయారు చేస్తుంది చెప్పంది? బ్యాడ్మింటన్ క్రీడ వ్యక్తిగత ఆటే... కానీ శిక్షణ కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగానే తీసుకోవాలని లేదు. చైనా, జపాన్, కొరియా, ఇండోనేసియా, మలేసియా, డెన్మార్క్ దేశాల్లో ఈ శిక్షణ ప్రక్రియ జట్టుగా... కలసికట్టుగా సాగుతుంది. కానీ ఇక్కడలా లేదు. ఇక టోర్నీల విషయానికొస్తే ఒక ప్లేయర్ ఏడాదికి ఎన్ని టోర్నీల్లో ఆడాలనే నియంత్రణ ఉండదు. ప్రతిభాన్వేషణకు సరైన ప్రణాళికలే లేవు. ప్రతిభ ఉంటే ప్రపంచశ్రేణి ఆటగాడిగా తీర్చిదిద్దే కార్యక్రమాలే ఉండవు. ఆటగాళ్లంతా సొంతంగా ఎదగాల్సిందే. ఇది సరికాదు. ఒక స్పష్టమైన విధివిధానమంటూ ఉండాలి. దీనికి ఓ జవాబుదారితనం కావాలి. ఎవరు దేనికి బాధ్యులో అందరికీ తెలిసుండాలి’ అని కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని చెప్పారు. -
ఒలింపిక్ అర్హత పద్ధతి బాగా లేదు!
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు అర్హత సాధించే విషయంలో ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అనుసరిస్తున్న విధానాన్ని భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తప్పుపట్టారు. ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఆటగాళ్లు ఏడాదంతా ఆడాల్సి వస్తోందని, అది వారిపై తీవ్ర ఒత్తిడి పెంచుతోందని ఆయన అన్నారు. ‘ఎక్కువ సంఖ్యలో టోర్నీలు ఆడటం వల్ల ఆటగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించేందుకు అవకాశం ఉంటుందనేది వాస్తవం. అయితే సంవత్సరం పాటు ఒలింపిక్ క్వాలిఫయింగ్ పోటీలు కొనసాగడం సరైంది కాదు. దీనిపై దృష్టి పెట్టాలి. ఆల్ ఇంగ్లండ్ టోర్నీ, ప్రపంచ చాంపియన్‌షిప్ లేదా ఆసియా, యూరోపియన్ చాంపియన్‌షిప్ లాంటివి గెలిచినప్పుడు కొందరికైనా నేరుగా అర్హత సాధించే సౌకర్యం ఉండాలి. ఇప్పుడేమో పిచ్చి పట్టినట్లుగా ఆటగాళ్లు ప్రపంచమంతా తిరగాల్సి వస్తోంది. ఇది చాలా శ్రమతో కూడుకున్న విషయం’ అని గోపీచంద్ వ్యాఖ్యానించారు. -
తొలి ప్రేయసిని కలిశాను
బ్యాడ్మింటన్ కోర్టులోకి మళ్లీ దిగారు హీరో సుధీర్‌బాబు. సినిమాల్లోకి రాకముందు ఆయన ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని తెలిసిందే. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున, ధ్యాన్‌చంద్, పద్మభూషణ్ అవార్డుల గ్రహీత పుల్లెల గోపీచంద్‌తో కలిసి ఆయన అప్పట్లో డబుల్స్ విభాగంలో మ్యాచ్‌లు కూడా ఆడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు పుల్లెల గోపీచంద్‌పై ఓ బయోపిక్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్‌లో లీడ్ రోల్ చేయనున్నారు సుధీర్‌బాబు. ఇందుకోసం ఆయన తిరిగి బ్యాడ్మింటన్ కోర్టులో ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ప్రాక్టీస్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘తొలిప్రేమ ఎప్పటికీ జీవించే ఉంటుందని అంటుంటారు. నా తొలి ప్రేయసి బ్యాడ్మింటన్ గేమ్నే. గోపీచంద్ బయోపిక్ కోసం మళ్లీ సాధన మొదలుపెట్టాను’’ అని పేర్కొన్నారు సుధీర్ బాబు. ఈ బయోపిక్కు ‘చందమామ కథలు, పీఎస్వీ గరుడవేగ 126.18ఎమ్’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ బయోపిక్ రెండు పార్టులుగా విడుదలవుతుందని టాక్. -
వాళ్లిద్దరు వజ్రాల్లాంటివారు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులిద్దరూ రెండు వజ్రాలని, తన దృష్టిలో ఇద్దరూ ఒక్కటేనని జాతీయ హెడ్ కోచ్ గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ‘ఒక కోచ్‌గా సైనా, సింధులను ఒకేలా చూస్తా. వీళ్లిద్దరూ రెండు వజ్రాల లాంటి వారు. హైదరాబాద్‌లోని అకాడమీలో ఇద్దరి మధ్య ప్రతీరోజు గెలుపోటములు సహజమే. ఓడినా, గెలిచినా వారిని ప్రోత్సహిస్తూ మరింత ముందుకు వెళ్లాలని సూచిస్తుంటా. టోర్నమెంట్లు జరిగే సమయంలో మాత్రం కఠినంగా ఉంటా. నా శిష్యులు ఒలింపిక్ స్వర్ణం గెలవడమే నా లక్ష్యం’ అని అన్నారు. గత నెలలో జరిగిన గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో సైనా, సింధులు తలపడగా... ఆ మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధుపై సైనా పైచేయి సాధించింది. సైనా మాట్లాడుతూ... ‘ప్రత్యర్థి సింధు అయినా మరొకరైనా నా ఆటలో ఎలాంటి మార్పు ఉండదు. సింధును మరో ప్రత్యర్థిలాగే భావించి బరిలో దిగుతా. అంతే తప్ప సింధుతో ఆడుతున్నాననే భావనలో ఉండను. ఆసియా క్రీడల్లో ఇదే విధంగా రాణించాలని భావిస్తున్నా’ అని సైనా పేర్కొంది. వరుసగా ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్స్‌లలో ఓటమి పాలవడంపై సింధు స్పందిస్తూ.... ‘నా దృష్టిలో ఫైనల్ వరకు చేరడం కూడా చాలా పెద్ద విషయం. తుది పోరులో వరుస ఓటములు నా మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. గతంలో నేను క్వార్టర్స్, సెమీస్‌లలో ఓడేదాన్ని ఇప్పుడు టైటిల్‌కు దగ్గరగా వస్తున్నా అంటే ఓ అడుగు ముందుకు వేసినట్లేగా. ఈ ఏడాది జరుగబోయే ఆసియా క్రీడల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు కృషిచేస్తా’ అని తెలిపింది. సైనాతో పోటీ విషయంపై స్పందిస్తూ... ‘పోటీ అనేది ఏ ఆటకైనా మంచిదే. మ్యాచ్‌లో ఒకరు మాత్రమే విజేతగా నిలవగలరు. నా వరకు నేనే గెలవాలని భావిస్తా. ఆమె (సైనా) వరకు ఆమె గెలవాలని కోరుకుంటుంది. కోర్టు బయటకు వస్తే సాధారణంగానే ఉంటాం’ అని చెప్పింది. సెమీఫైనల్లో సాయి ప్రణీత్ ఓటమి అక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో షట్లర్ సాయి ప్రణీత్ సెమీస్‌లో 21–14, 19–21, 8–21తో రెండో సీడ్ జొనాథన్ క్రైస్ట్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోవడంతో భారత్ కథ ముగిసింది. -
ఫిట్తోనే హిట్..
సాక్షి, వీకెండ్ ప్రతినిధి: ప్రతి ఒక్కరూ ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఏ రంగంలో విజయం సాధించాలన్నా ఇది అవసరమన్నారు. ఒలింపిక్స్‌లో సింధు రజత పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన గోపీచంద్‌కు బంజారాహిల్స్‌లోని క్రిస్ గెతిన్స్ జిమ్‌లో శుక్రవారం గౌరవ సభ్యత్వం అందజేశారు. కార్యక్రమంలో జిమ్ డైరెక్టర్లు సతీష్ మర్యాద, శ్రీకాంత్, ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ దినాజ్ పాల్గొన్నారు.