వాళ్లిద్దరు వజ్రాల్లాంటివారు | Saina Nehwal and PV Sindhu are precious diamonds, says Pullela | Sakshi
Sakshi News home page

వాళ్లిద్దరు వజ్రాల్లాంటివారు

Published Sun, May 6 2018 12:57 AM | Last Updated on Sun, May 6 2018 8:32 AM

Saina Nehwal and PV Sindhu are precious diamonds, says Pullela - Sakshi

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌ స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులిద్దరూ రెండు వజ్రాలని, తన దృష్టిలో ఇద్దరూ ఒక్కటేనని జాతీయ హెడ్‌ కోచ్‌ గోపీచంద్‌ అభిప్రాయపడ్డారు. ‘ఒక కోచ్‌గా సైనా, సింధులను ఒకేలా చూస్తా. వీళ్లిద్దరూ రెండు వజ్రాల లాంటి వారు. హైదరాబాద్‌లోని అకాడమీలో ఇద్దరి మధ్య ప్రతీరోజు గెలుపోటములు సహజమే. ఓడినా, గెలిచినా వారిని ప్రోత్సహిస్తూ మరింత ముందుకు వెళ్లాలని సూచిస్తుంటా. టోర్నమెంట్‌లు జరిగే సమయంలో మాత్రం కఠినంగా ఉంటా. నా శిష్యులు ఒలింపిక్‌ స్వర్ణం గెలవడమే నా లక్ష్యం’ అని అన్నారు. గత నెలలో జరిగిన గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫైనల్లో సైనా, సింధులు తలపడగా... ఆ మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సింధుపై సైనా పైచేయి సాధించింది. సైనా మాట్లాడుతూ... 

‘ప్రత్యర్థి సింధు అయినా మరొకరైనా నా ఆటలో ఎలాంటి మార్పు ఉండదు. సింధును మరో ప్రత్యర్థిలాగే భావించి బరిలో దిగుతా. అంతే తప్ప సింధుతో ఆడుతున్నాననే భావనలో ఉండను. ఆసియా క్రీడల్లో ఇదే విధంగా రాణించాలని భావిస్తున్నా’ అని సైనా పేర్కొంది. వరుసగా ఒలింపిక్స్, వరల్డ్‌ చాంపియన్‌షిప్, కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫైనల్స్‌లలో ఓటమి పాలవడంపై సింధు స్పందిస్తూ.... ‘నా దృష్టిలో ఫైనల్‌ వరకు చేరడం కూడా చాలా పెద్ద విషయం. తుది పోరులో వరుస ఓటములు నా మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. గతంలో నేను క్వార్టర్స్, సెమీస్‌లలో ఓడేదాన్ని ఇప్పుడు టైటిల్‌కు దగ్గరగా వస్తున్నా అంటే ఓ అడుగు ముందుకు వేసినట్లేగా. ఈ ఏడాది జరుగబోయే ఆసియా క్రీడల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు కృషిచేస్తా’ అని తెలిపింది. సైనాతో పోటీ విషయంపై స్పందిస్తూ... ‘పోటీ అనేది ఏ ఆటకైనా మంచిదే. మ్యాచ్‌లో ఒకరు మాత్రమే విజేతగా నిలవగలరు. నా వరకు నేనే గెలవాలని భావిస్తా. ఆమె (సైనా) వరకు ఆమె గెలవాలని కోరుకుంటుంది. కోర్టు బయటకు వస్తే సాధారణంగానే ఉంటాం’ అని చెప్పింది.   

సెమీఫైనల్లో సాయి ప్రణీత్‌ ఓటమి 
అక్లాండ్‌: న్యూజిలాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో షట్లర్‌ సాయి ప్రణీత్‌ సెమీస్‌లో 21–14, 19–21, 8–21తో రెండో సీడ్‌ జొనాథన్‌ క్రైస్ట్‌ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోవడంతో భారత్‌ కథ ముగిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement