ముంబై: భారత షట్లర్ల టోర్నీ ప్రణాళికలు, ప్రాక్టీస్ వంటి అంశాలు తన అదుపులో ఉండటం లేదని చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘దురదృష్టవశాత్తు మన దేశంలో ఓ క్రమ పద్ధతి అంటూ ఉండదు. ఇక్కడ చీఫ్ కోచ్ పాత్ర పూర్తిగా అలంకారప్రాయమైంది. కోచ్‌గా నాకు ఏ హక్కులు లేవు. అసలు జాతీయ కోచ్ అనేది అర్థం లేని పదవిగా మారింది. సెలక్షన్స్‌లో కానీ, ప్రణాళికల్లో కానీ భాగస్వామ్యమే ఉండదు. సహాయ కోచ్‌ల్ని ఎంపిక చేసుకోలేం, వారి పారితోషికాల్ని నిర్ణయించలేం.
ఇవేవీ లేని జాతీయ కోచ్, అతని బృందం ప్రపంచ స్థాయి ఆటగాళ్లను ఎలా తయారు చేస్తుంది చెప్పంది? బ్యాడ్మింటన్ క్రీడ వ్యక్తిగత ఆటే... కానీ శిక్షణ కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగానే తీసుకోవాలని లేదు. చైనా, జపాన్, కొరియా, ఇండోనేసియా, మలేసియా, డెన్మార్క్ దేశాల్లో ఈ శిక్షణ ప్రక్రియ జట్టుగా... కలసికట్టుగా సాగుతుంది. కానీ ఇక్కడలా లేదు. ఇక టోర్నీల విషయానికొస్తే ఒక ప్లేయర్ ఏడాదికి ఎన్ని టోర్నీల్లో ఆడాలనే నియంత్రణ ఉండదు. ప్రతిభాన్వేషణకు సరైన ప్రణాళికలే లేవు. ప్రతిభ ఉంటే ప్రపంచశ్రేణి ఆటగాడిగా తీర్చిదిద్దే కార్యక్రమాలే ఉండవు. ఆటగాళ్లంతా సొంతంగా ఎదగాల్సిందే. ఇది సరికాదు. ఒక స్పష్టమైన విధివిధానమంటూ ఉండాలి. దీనికి ఓ జవాబుదారితనం కావాలి. ఎవరు దేనికి బాధ్యులో అందరికీ తెలిసుండాలి’ అని కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment