లేటుగా వచ్చారో.. ఇక అంతే!
న్యూఢిల్లీ: 'రోజులో ఏదో ఒక సమయంలో ఆఫీస్‌కు వచ్చామా.. పంచ్ కొట్టామా.. ఓ నాలుగైదు ఫైళ్లు కెలికామా.. ఇంటికి వెళ్లిపోయామా.. ఒకటో తారీఖున జీతం తీసుకున్నామా..' బాపతు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. అన్ని శాఖల ఉద్యోగులు సమయపాలన కచ్చితంగా పాటించాల్సిందేనని, లేని పక్షంలో తీవ్ర చర్యలకు కూడా వెనుకాడేది లేదని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
ఇందులో కొత్త విషయమేముంది? ప్రభుత్వం అప్పుడప్పుడూ చేసే తాటాకు చప్పుళ్లకు బెదిరిపోయి ఉద్యోగులందరూ సమయపాలన పాటిస్తారా? అని అనుకుంటే మాత్రం పొరపడ్డట్టే! ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల్లో ఉద్యోగులు ఇచ్చిన షాక్‌తో రగిలిపోతోన్న బీజేపీ.. వారిపై ఎలాంటి చర్యలకైనా వెనుకడుగు వేసేదిలేదని తేల్చిచెబుతోంది. ఆ క్రమంలోనే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలుస్తోంది. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో నివసిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఓట్లేసిన సంగతి తెలిసిందే.
ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ కార్యాలయంలో చేరిన కొద్ది రోజులకే ఉద్యోగుల సమయపాలన విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆయా శాఖలకు ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో అప్పటివరకు అమలవుతోన్న బయోమెట్రిక్ విధానాన్ని మరింత పారదర్శకంగా తీర్చిదిద్దారు. కొత్తగా రూపొందించిన విధానంలో ఆధార్ నంబర్‌తో అనుసంధానించిన బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు.
ప్రస్తుతం ఒక్క క్లిక్ తో ఏ రోజు ఎంత మంది ఉద్యోగులు కార్యాలయానికి వచ్చారో www.attendance.gov.in ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉందని, సమయపాలన విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలంటూ కేంద్రం తమను ఆదేశించిందని డీఓపీటీ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వ సిబ్బంది నియమాకాల్లో పలు విమర్శలను ఎదుర్కొంటున్న కేంద్రం తాజాగా తన ఉద్యోగుల నుంచి ఎదురయ్యే వ్యతిరేకంతను ఎలా అధిగమిస్తుందో చూడాలి.