Pune team
-
పీబీఎల్‌లో పుణే బోణీ
లక్నో: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) సీజన్–5లో పుణే సెవెన్ ఏసెస్ జట్టు బోణీ కొట్టింది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పుణే 5–2తో ముంబై రాకెట్స్‌పై గెలిచింది. తొలుత జరిగిన పరుషుల డబుల్స్ పోరులో చిరాగ్ శెట్టి–హెండ్రా సెటియావన్ (పుణే) ద్వయం 14–15, 15–5, 15–6తో కిమ్ జుంగ్– కిమ్ స రంగ్ (ముంబై) జంటపై గెలిచింది. అనంతరం జరిగిన మహిళల సింగిల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో బరిలో దిగిన పుణే ప్లేయర్ రితుపర్ణ దాస్ 11–15, 15–9, 15–9తో శ్రేయాన్షి పర్దేశి (ముంబై)పై గెలవడంతో... పుణే 3–0తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాత జరిగిన పురుషుల మొదటి సింగిల్స్‌లో లోహ్ కియాన్ య్యూ (పుణే) 15–7, 15–14తో పారుపల్లి కశ్యప్ (ముంబై)పై నెగ్గడంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే పుణే విజయాన్ని ఖాయం చేసుకుంది. ఇక నామమాత్రంగా జరిగిన పురుషుల రెండో సింగిల్స్ మ్యాచ్‌లో సకాయ్ (పుణే) 7–15, 13–15తో లీ డాంగ్ కెయున్ (ముంబై) చేతిలో ఓడాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ‘ట్రంప్ కార్డు’తో ఆడటంతో... ఆ జట్టుకు రెండు పాయింట్లు లభించాయి. చివరి మ్యాచ్ అయిన మిక్స్డ్ డబుల్స్‌లో క్రిస్–గ్యాబీ (పుణే) ద్వయం 15–12, 10–15, 15–6తో కిమ్ జి జుంగ్–పియా జెబిదియా (ముంబై) జంటపై గెలిచింది. నేటి మ్యాచ్‌లో అవధ్ వారియర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ తలపడుతుంది. -
ధోనికి షాక్!
కెప్టెన్సీ నుంచి తప్పించిన పుణే జట్టు స్టీవ్ స్మిత్‌కు నాయకత్వ బాధ్యతలు సూపర్ జెయింట్స్ సంచలన నిర్ణయం ఇంగ్లండ్‌తో కొద్ది రోజుల క్రితం ప్రాక్టీస్ మ్యాచ్ బరిలోకి దిగిన సమయంలో ‘కెప్టెన్‌గా ఇది నా ఆఖరి మ్యాచ్ కాదు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్లో కూడా నేను కెప్టెన్‌గా కొనసాగుతాను’ అని ధోని గట్టిగా ప్రకటించాడు. కానీ అతని ఐపీఎల్ జట్టు పుణే ధోనికి ఆ అవకాశం ఇవ్వలేదు. లీగ్‌లో అత్యుత్తమ కెప్టెన్‌గా అందనంత ఎత్తులో నిలిచిన ధోనికి సూపర్ జెయింట్స్ షాక్ ఇచ్చింది. అతడిని కెప్టెన్సీ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా గత ఏడాది వైఫల్యమే కారణమంటూ కుండ బద్దలు కొట్టింది. పుణే: ఐపీఎల్–10 వేలానికి ముందు రోజు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ అనూహ్య నిర్ణయం... తమ జట్టు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనిని తొలగిస్తున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. అతని స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఎంపిక చేసింది. టెస్టు క్రికెట్ నుంచి ఆటగాడిగా, భారత వన్డే, టి20 జట్ల నుంచి కెప్టెన్‌గా పూర్తిగా తన సొంత నిర్ణయం మేరకు తప్పుకున్న ధోని కూడా నిర్ఘాంతపోయే నిర్ణయాన్ని పుణే తీసుకోవడం విశేషం. ఆటతో మాత్రమే కాకుండా అభిమానుల ఆదరణతో కూడా ముడిపడిన ఐపీఎల్‌కు సంబంధించి ధోని స్థాయి కెప్టెన్‌ను కావాలనే తీసేశామని చెప్పడం సాహసోపేత నిర్ణయమే. ‘ధోని కెప్టెన్సీ నుంచి తనంతట తాను తప్పుకోలేదు. రాబోయే సీజన్ కోసం స్టీవ్ స్మిత్‌ను మేం కెప్టెన్‌గా ఎంపిక చేశాం. నిజాయితీగా చెప్పాలంటే గత ఏడాది మేం పూర్తిగా విఫలమయ్యాం. జట్టులో సమూల మార్పులు చేయడంతో యువ ఆటగాడు దీనిని నడిపించాలని భావించాం. వ్యక్తిగా, నాయకుడిగా ధోని అంటే మాకు గౌరవం ఉంది. అతను మా జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతాడు. ఫ్రాంచైజీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మా నిర్ణయానికి అతను మద్దతు పలికాడు’ అని పుణే జట్టు యజమాని సంజీవ్ గోయెంకా వెల్లడించారు. 2016 ఐపీఎల్లో ఆడిన 14 మ్యాచ్‌లలో పుణే జట్టు 5 మాత్రమే గెలిచి 9 ఓడిపోయింది. 12 ఇన్నింగ్స్‌లలో ధోని 135.23 స్ట్రైక్‌రేట్‌తో 284 పరుగులు చేశాడు. ‘కింగ్’ కెప్టెన్...: ఐపీఎల్లో వరుసగా 9 సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహించిన ధోని, రెండు సార్లు జట్టును ఐపీఎల్ (2010, 11) విజేతగా, మరో రెండు సార్లు చాంపియన్స్ లీగ్ (2010, 2014) విజేతగా నిలిపాడు. -
పుణే జట్టు పేరు సూపర్ జెయింట్స్
కెప్టెన్‌గా ధోని పేరు ప్రకటన కోల్‌కతా: ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ పుణే జట్టు తమ పేరును ప్రకటించింది. వచ్చే రెండు సీజన్ల పాటు ఈ జట్టు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ (ఆర్పీఎస్జీ) పేరుతో బరిలోకి దిగుతుంది. అలాగే తమ జట్టుకు కెప్టెన్ ధోని అని అధికారికంగా ప్రకటించింది. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ జట్టు పేరు, లోగో ఆవిష్కరించారు. సంజీవ్ గోయెంకాకు చెందిన ఈ జట్టుకు వారి గ్రూప్ పేరు ఆర్పీజీ వచ్చేలా పేరు పెట్టినట్లు కనిపిస్తోంది. అలాగే గతంలో రాజస్తాన్ జట్టుతో కలిసి పని చేసిన రఘు అయ్యర్ ఇకపై గోయెంకా గ్రూప్ స్పోర్ట్స్ విభాగానికి సీఈఓగా పని చేస్తారు.