కొనుగోళ్లు... సవాళ్లు
- ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో సమస్యలు అనేకం
- మౌలిక వసతులలేమితో సతమతం
- సంఘాల మీద భారం మోపేందుకు చర్యలు
నీలగిరి: ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ఎదురయ్యే సమస్యలు పెనుసవాళ్లనే విసురుతున్నాయి. ప్రభుత్వం మిల్లర్ల లెవీ శాతం తగ్గించడంతో ఆ భారం మొత్తాన్ని కూడా ఇందిరా క్రాంతి పథం, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు మోయాల్సి వస్తోంది. ఈ సీజన్ నుంచే ఉత్పత్తి అయ్యే మొత్తం ధాన్యంలో అధిక భాగం ఐకేపీ, పీఏసీఎస్‌లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే అందుకు తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలకు అన్ని వైపుల నుంచి తోడ్పాటు లభిస్తే తప్ప ధాన్యం కొనుగోలు చేసేందుకు సంఘాలు ముందుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
రెండేళ్ల నుంచి సివిల్ సప్లై, ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోళ్లు బంద్ చేయడంతో ఆ భారం మొత్తాన్ని కూడా ఐకేపీ, పీఏసీఎస్‌లు భరించాల్సి వస్తోంది. కష్టనష్టాల కోర్చి ధాన్యం కొనుగోలు చేస్తున్న సంఘాలకు మాత్రం కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సీజన్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు రెట్టింపు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. కాబట్టి ఖరీఫ్ ధాన్యం మార్కెట్లోకి రాకముందే కనీస మౌలిక వసతులు సమకూర్చాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కమీషన్లో కోత విధించే యత్నం...
ధాన్యం కొనుగోళ్లకు అసరమయ్యే గన్నీ బ్యాగులను జిల్లా పౌరసరఫరాలసంస్థ సరఫరా చేస్తుంది. టార్పాలిన్లు, తేమ యంత్రాలు, పోకర్లు, చిన్న త్రాసులు వంటివన్నీ కూడా మహిళా సంఘాలే కొంటున్నాయి. ధాన్యం కమీషన్ నుంచి కొంత మొత్తాన్ని మౌలిక వసతులకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇవిగాక గన్నీ బ్యాగుల విషయంలో పౌరసరఫరాల సంస్థ లేనిపోని పేచీలు పెట్టి కమీషన్ల్లోంచి కోత పెడుతోంది. ధాన్యం తరలించే వాహనాలకు వెయిటింగ్ చార్జీలు, డ్రైవర్లకు బోజనాలు తదితర ఖర్చులన్నీ కూడా మహిళా సంఘాలు భరిస్తున్నాయి. ఇదిగాక మిల్లర్లు ఇచ్చే ట్రక్‌షీట్లలో ధాన్యం తేడా ఉందన్న కారణంతో మరింత కోత విధిస్తున్నారు. ఈ ఖర్చులన్నీ మినహాయిస్తే సంఘాలకు వచ్చే కమీషన్ నామమాత్రం.
సంఘాలకు తప్పని భారం..
ఈ సీజన్లో ధాన్యం కొనుగోలుకు అవసరమయ్యే సామగ్రి అంతా కూడా సంఘాలు కమీషన్ నుంచే కొనుగోలు చేయాలని జిల్లా అధికారులు మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు. కానీ రైస్‌మిల్లుల లెవీ శాతం తగ్గింది కాబట్టి ధాన్యం కొనుగోలు చేయాల్సిన పూర్తి బాధ్యత సంఘాల మీద పడింది. కావున మౌలిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలనేది సంఘాల వాదన. ఈ సీజన్లో ఐకేపీ 80 కేంద్రాలు, పీఏసీఎస్‌లు 43 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. అందుకోసం ధాన్యం ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, తేమ యంత్రాలు, పోకర్లు, ఇతర అవసరాలను తెలియజేస్తూ ఓ నివేదిక రూపొందించారు. కొనుగోళ్లు ప్రారంభంకాక ముందే వీటిన్నింటిని సమకూరిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదు. లేకుంటే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.