మోడీ వచ్చాక ఆరో వికెట్!!
నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కారణాలు ఏవైనా ఇప్పటికి వరుసపెట్టి ఆరుగురు గవర్నర్లు రాజీనామా చేశారు. మరికొందరు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. తాజాగా.. తనను నాగాలాండ్ గవర్నర్‌గా బదిలీ చేసినందుకు తీవ్రంగా అసంతృప్తి చెందిన మిజొరాం గవర్నర్ పురుషోత్తమన్ తన పదవికి రాజీనామా చేసిపారేశారు. ఈయనతో కలిపి రాజీనామా చేసిన గవర్నర్ల సంఖ్య ఆరుకు చేరుకుంది. వీళ్లంతా యూపీఏ హయాంలో నియమితులైనవాళ్లే. తనను ఏమాత్రం సంప్రదించకుండానే, తన అభిప్రాయం తెలుసుకోకుండానే తనను బదిలీ చేశారన్నది పురుషోత్తమన్ ఆక్రోశం. కేరళలలో ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన ఈ 86 ఏళ్ల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు 2011లో గవర్నర్ అయ్యారు.
వాస్తవానికి మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి నుంచి చాలామంది గవర్నర్లకు ఇక చాలు.. దిగిపొండి అంటూ ఫోన్లు వెళ్లాయి. పదవీకాలం చివరకు వచ్చేసినవాళ్లను మాత్రం ఉండమన్నారు. ఈ జాబితాలో గుజరాత్ గవర్నర్ కమలా బేణీవాల్ ఒకరు. మోడీ సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు, గవర్నర్‌కు చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఆమెకు పదవీకాలం కేవలం నాలుగు నెలలే ఉన్నా, ఆమెను మిజొరాం గవర్నర్‌గా బదిలీ చేశారు.
ఇక కేరళ గవర్నర్‌గా ఉన్న షీలా దీక్షిత్.. రాజీనామా చేసేందుకు నిరాకరించారు. ప్రధాన మంత్రిని, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన తర్వాత.. వాళ్లెవరూ తనను రాజీనామా చేయాలని కోరలేదని షీలా అన్నారు.
ఇక గోవా, పశ్చిమబెంగాల్ గవర్నర్లు వాంఛూ, ఎంకే నారాయణన్ మాత్రం అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణంలో సీబీఐ ప్రశ్నించడంతో వాళ్లిద్దరూ టపటపా రాజీనామాలు చేసి పారేశారు. కానీ ఇదే కేసులో సీబీఐ ప్రశ్నించిన మరో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాత్రం ఇంకా రాజీనామా నిర్ణయం ఏమీ తీసుకోలేదు. ఆయన ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న విషయం తెలిసిందే.
ఇక, వీళ్లందరికంటే ముందు ఉత్తరప్రదేశ్ గవర్నర్ బీఎల్ జోషి, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శేఖర్ దత్, నాగాలాండ్ గవర్నర్ అశ్వనీకుమార్ రాజీనామాలు చేశారు. కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్, త్రిపుర గవర్నర్ దేవానంద్ కొన్వర్ మాత్రం వాళ్ల పదవీకాలం ముగిసేవరకు ఉన్నారు.