పుష్కర ముగింపున పుష్పాభిషేకం
– నేటి నుంచి దంపతుల రిజిస్ట్రేషన్ నమోదు
– ఎస్ఎంఎస్ ద్వారా నమోదు చేసుకున్న వారికే అవకాశం
– ఇప్పటి వరకు 5లక్షల మందికి పైగా పుష్కర స్నానాలు
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
సాక్షి, కర్నూలు:
పుష్కరాల ముగింపును పురస్కరించుకొని ఈనెల 23న స్వామి, అమ్మవార్లకు 10టన్నుల పూలతో అభిషేకం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన శ్రీశైలంలోని మల్లికార్జున సదన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతో ఈఓ నారాయణ భరత్‌గుప్తా, స్వామివార్ల ప్రధాన అర్చకులు మల్లికార్జునస్వామి, వేద పండితులు గంటి రాధాకష్ణ శర్మలతో కలిసి మాట్లాడారు. పుష్కరాల్లో భక్తిభావం ఉప్పొంగుతోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారన్నారు. ముగింపు రోజున నిర్వహించే పుష్పాభిషేకానికి 1,116 జంటలకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందులో పాల్గొనాలనుకునే జంటలు 9985330026 నెంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్లతో బుధవారం ఉదయం 10 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ప్రాధాన్యత క్రమంలో అవకాశం కల్పిస్తామన్నారు. అదేవిధంగా ముగింపు రోజున స్వామి, అమ్మవార్లకు 20 నుంచి 30 మంది వేద పండితులతో పుష్పాభిషేకం చేపట్టిన అనంతరం.. సాయంప్రదాయ దుస్తుల్లోని 1,116 జంటలు కష్ణా జలాలతో సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారన్నారు. ఆ తర్వాత జంటలకు స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలతో సన్మానించి లడ్డూ ప్రసాదాలను అందజేస్తామన్నారు. కార్యక్రమాన్ని రాష్ట్ర, దేశ ప్రజలు వీక్షించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.