puttur hospital
-
పుత్తూరు వైద్యానికి రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు ఫిదా!
మాది తమిళనాడు రాష్ట్రం, తిరువళ్లూరు పట్టణం. నా పేరు వీ.బాబు. బాత్రూమ్లో జారిపడ్డాను. నా ఎడమ చేయి విరిగింది. పుత్తూరు కట్టు గురించి నాకు అవగాహన ఉంది. అందుకే నేరుగా ఇక్కడికే వచ్చి కట్టు కట్టించుకున్నాను. మూడుకట్లు పూర్తయ్యాయి. నొప్పి లేదు. చేయి మామూలు స్థితికి వచ్చింది. ఇక్కడి డాక్టర్ల నైపుణ్యం వెలకట్టలేనిది. నా పేరు కే.కన్నభిరామ్. మా ఊరు కాంచీపురం, తమిళనాడు రాష్ట్రం. మోటర్ సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాను. నా కుడి కాలు తొడ ఎముక విరిగిపోయింది. మూడో కట్టు కట్టుకోవడానికి వచ్చాను. ఈ కట్టుతో నడవగలుగుతానని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి నొప్పి పూర్తిగా తగ్గింది. ఇక్కడ ఫీజు మేము ఇచ్చినంతే తీసుకుంటున్నారు. మానవుని శరీరం మొత్తం ఎముకల గూడు. ఏ అవయవానికి దెబ్బతగిలినా ఆ వ్యక్తి విలవిల్లాడాల్సిందే. అలాంటిది ఏకంగా ఎముకే విరిగిపోవడం, కీళ్లు తొలగిపోవడం లాంటివి జరిగితే ఆ వ్యక్తి బాధ వర్ణణాతీతం. ఇలా విరిగిన, తొలగిన ఎముకలను ఎలా అతికించాలి, ఎలా సరిచేయాలి, నడవలేని వ్యక్తిని ఎలా నడిపించాలి..? అన్న ప్రశ్నలకు సమాధానం ‘పుత్తూరు శల్యంవైద్యం’. నేడు ఆధునిక వైద్య విధానాలు వచ్చినా.. పుత్తూరు కట్టు ముందు అన్నీ తీసికట్టు. ఇది రాజులకు లభించిన వరప్రసాదం. పేద రోగులకు ఆరోగ్యప్రదాయం. వందేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్న పుత్తూరు శల్యవైద్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..! సాక్షి, తిరుపతి: పుత్తూరు శల్యవైద్యం దైవానుగ్రహంగా ‘రాజు’లకు లభించిన వరప్రసాదం. ఇదే విషయాన్ని సూరపరాజు సుబ్బరాజు వంశస్థులు ఈ వైద్యం పుట్టుక గురించి చెబుతుంటారు. పుత్తూరు మండలం, రాచపాళెంలో 1922లో ఈ వైద్యం పురుడుపోసుకుంది. సూరపరాజు సుబ్బరాజు ఓ రోజు అడవిలో వేటకు వెళ్లి వేటాడిన మాంసపు ముక్కలను చెట్ల ఆకుల్లో చుట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఆకుల్లోని ఎముకలు ఒకదానికొకటి అతుక్కొని ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. అదే ఆకులతో ఎముకలు విరిగిన జంతువులకు కట్టుకట్టడం.. ఆ తర్వాత మనుషులకు కట్టుకట్టడం ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు పుత్తూరు శల్య వైద్యం అప్రహితంగా కొనసాగుతోంది. రాచపాళెం గ్రామం నుంచే నేటికీ ఇదే వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. శల్య వైద్య విధానం ఎక్స్‌రే తీయరు. మత్తు మందు ఇవ్వరు. చేతి మునివేళ్లతోనే ఎముక విరిగిందా లేదా గుర్తిస్తారు. తర్వాత తమ రెండు చేతులతో విరిగిన ఎముకలను సరిచేసి కట్ట్టుకడుతారు. ముందుగా తయారుచేసి పెట్టుకున్న ఆకు పసరుకు కాసింత గుడ్డ, రెండు కోడి గుడ్లు తెల్లసొన, రెండు వెదురు దబ్బలే ఈ వైద్యానికి పరికరాలు. ఎముక విరిగిన, తొలగిన భాగాన దూదిని ఉంచి ఆకు పసరు రాసి గుడ్డ చుడుతారు. ఎముక భాగం కదలకుండా వెదురు దబ్బలను పెట్టి కట్టుకడతారు. ఏడు రోజులకు ఒకసారి వంతున మూడు కట్లు కడతారు. అంతే గాయం నయమవుతుంది. ఇచ్చినంతే ఫీజు రాచపాళెంలోని ప్రధాన ఆస్పత్రిలో పది రూపాయల రశీదు తీసుకొని లోపలికి వెళితే పది నిమిషాల్లో కట్టు కట్టేస్తారు. తర్వాత రోగి తనకు తోచింది ఇస్తే డాక్టర్ ఫీజుగా తీసుకుంటారు. పూర్వీకుల వివరాలు పుత్తూరు శల్యవైద్య వ్యవస్థాపకులు సూరపరాజు సుబ్బరాజు. ఈయనకు నలుగురు తమ్ముళ్లు. వీరిలో ఎస్.మార్కొండేయరాజు, ఎస్.గంగరాజు ఇదే వృత్తిని కొనసాగించారు. ఇంకో ఇద్దరు తమ్ముళ్లు ఎస్.చెంగల్రాజు, ఎస్.వెంగమరాజు వైద్య వృత్తికి దూరంగా ఉన్నా, వారి కుమారులైన ఎస్.ప్రకాష్‌రాజు, కన్నయ్యరాజు ఇదే వృత్తిలో కొనసాగారు. గంగరాజు కుమారుడైన ఎస్.కృష్ణమరాజు, మార్కొండేయరాజు కుమారులైన రామరాజు, సుబ్రమణ్యంరాజు ఇదే వృత్తిలో కొనసాగారు. పాత తరంలోని ఎస్.కృష్ణమరాజు, ఎస్.ప్రకాష్రాజుతో పాటు సుబ్రమణ్యంరాజు కుమారుడు ఎస్.ప్రతాప్‌రాజు, కన్నయ్యరాజు కుమారుడు ఎస్.బాలసుబ్రమణ్యంరాజు ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రముఖులు ఫిదా! పుత్తూరు శల్యవైద్యం పొంది ఉపసమనం పొందిన వారిలో మాజీ రాష్ట్రపతులు వీవీ.గిరి, నీలం సంజీవరెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు టీ.అంజయ్య, నందమూరి తారక రామారావు. కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ఉన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వైద్యం పొందిన వారు ఉన్నారు. ఇలా వచ్చిన వారు విజిటర్స్ బుక్‌లో తమ వివరాలను పొందుపరచడం విశేషం. పేదలకు పూర్తి ఉచితం మా పూర్వీకుల నుంచి సంక్రమించిన వైద్యమిది. మాది నాల్గోతరం. మా వైద్యంలో సక్సస్ రేటు 99.9 శాతంగా ఉంది. వందేళ్ల చరిత్రే ఇందుకు నిదర్శనం. పేదలతోపాటు పుత్తూరు వాసులకు పూర్తి ఉచిత వైద్య సేవలందిస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నాం. ఆస్పత్రి ఆవరణలోనే 25 గదులను రోగులకు అందుబాటులో ఉంచాం. ఆస్పత్రి సమీపంలోనే టీటీడీ వారిచే మరో 25 గదులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ ఎస్.కృష్ణమరాజు, మేనేజింగ్ డైరెక్టర్, పుత్తూరు శల్యవైద్యశాల -
ఎమ్మెల్యే రోజాపై దాడికి యత్నం
పుత్తూరు: నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు ఆర్కే రోజాపై అధికార టీడీపీకి చెందిన అల్లరిమూకలు దాడికి యత్నించాయి. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నూతన భవనాలను బుధవారం ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నేతలు మద్యం మత్తులో ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించాయి. టీడీపీ అల్లరిమూకల చర్యలతో ఆస్పత్రి ఆవరణలో భీతావహ వాతావరణం నెలకొంది. మరోవైపు దివంగత ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుల మధ్య ఆధిపత్య పోరుకు ఆస్పత్రి నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం వేదికైంది. రాష్ట్రమంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలోనే ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడికి ప్రయత్నించడంతో ఆ పార్టీ వర్గాలు విస్తుపోయాయి. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితిని తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఎమ్మెల్యే రోజా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా నూతన భవనాల కోసం రూ.1.75 కోట్లు మంజూరు చేసింది. ఆ భవనాల ప్రారంభోత్సవాన్ని అధికారులు బుధవారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా అధ్యక్షత వహించగా, మంత్రి అమర్నాథ్ రెడ్డి, గాలి సరస్వతమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు ముద్దుకృష్ణమనాయుడు ఇద్దరు కుమారులు గాలి భానుప్రకాష్, గాలి జగదీష్ వారి అనుచర వర్గాలతో భారీ సంఖ్యలో అక్కడికి చేరారు. ఎమ్మెల్యే రోజా పంచాయతీరాజ్ అతిథి గృహం నుంచి పాదయాత్రగా వేదిక వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ నాయకులు దివంగత మద్దుకృష్ణమ పేరుతో నినాదాలు చేయగా, వైఎస్సార్సీపీ కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలిచ్చారు. ఇంతలో టీడీపీకి చెందిన అల్లరి మూకలు మద్యం మత్తులో ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమెను చుట్టుముట్టారు. ఒక దశలో చేతులు పైకెత్తి ఎమ్మెల్యేపై దాడికి దూసుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యే రోజా గన్‌మాన్ తుపాకి గాలిలోకి ఎక్కుపెట్టి హెచ్చరించారు. మరో వైపు గాలి భానుప్రకాష్ వర్గీయులు గాలి జగదీష్‌పైకి దూసుకు వచ్చారు. ఎమ్మెల్యే రోజా గాలి జగదీష్‌ను తనవైపునకు రమ్మని రక్షణనిచ్చారు. అల్లరి మూకలు రెచ్చగొట్టినా ఎమ్మెల్యే రోజా సంయమనం పాటించి నేతలందరినీ సన్మానించి రాజనీతి ప్రదర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు డ్రామా కంపెనీ నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఇప్పుడు దొంగదీక్షలు చేస్తూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొత్తడ్రామాకు తెరసీందని ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. పుత్తూరు ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలని నాలుగేళ్లుగా పోరాడకుండా ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేత దొంగదీక్ష చేయించారని ఆరోపించారు. ఆయన చేసిన నిరాహారదీక్షకు సంబంధించి మెడికల్ రిపోర్టులను బహిర్గతం చేయాలని రోజా డిమాండ్ చేశారు. చేతనైతే ఎంపీలతో రాజీనామా చేయించి ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్షలు చేయాలని ఆమె చంద్రబాబునాయుడుకు సవాల్ విసిరారు. అలాకాకుండా చీకట్లో ప్రధానిమోదీ, అమిత్‌షా కాళ్లు పట్టుకుంటూ రాష్ట్రంలో దీక్షలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. -
సొమ్మసిల్లి పడిపోయిన రోజా
పుత్తూరు: చిత్తూరుజిల్లా పుత్తూరులో టీడీపీ నాయకులు పెడుతున్న అక్రమ కేసులకు స్థానిక సీఐ సాయినాథ్ సహకరిస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా శనివారం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి సీఐ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. దళితులకు న్యాయం చేయాలంటూ శుక్రవారం పుత్తూరు ఎంపీడీ వో కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రోజా ధర్నా చేపట్టగా స్థానిక సీఐ సాయినాథ్ కేసు నమోదు చేశారు. దీనిని నిరసిస్తూ రోజా శనివారం ధర్నాకు దిగారు. ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు ఈ ఆందోళన జరిగింది. ఈసందర్భంగా రోజా మాట్లాడుతూ టీడీపీ నాయకులతో కుమ్మక్కయిన సీఐ సాయినాథ్ వారిని రెచ్చగొట్టి వారిచే పోటీ ధర్నాలు చేయించి తనపై తప్పుడు కేసుకు కుట్ర పన్నారని ఆరోపించారు. సీఐను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం శుక్రవారం ధర్నా సందర్భంగా తనను దూషిస్తూ, దాడికి ప్రయత్నించిన ఎంపీపీ గెంజి మాధవయ్య, టీడీపీ నాయకులు హరి, డి.జయప్రకాష్, కె.టి.ప్రసాద్‌రెడ్డి, జయకర్, వీరరాఘవులు నాయుడుపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే రోజా లిఖిత పూర్వక ఫిర్యాదును డీఎస్పీ నాగభూషణరావుకు అందజేశారు. ఆ తర్వాత రోజా విలేకరులతో మాట్లాడుతుండగా అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే వైఎస్సార్సీపీ నేతలు హుటాహుటిన ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వెంటనే ఫ్లూయిడ్స్ అందించడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు స్ఫృహలోకి వచ్చారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు. -
సొమ్మసిల్లి పడిపోయిన రోజా