
సొమ్మసిల్లి పడిపోయిన రోజా
పుత్తూరు: చిత్తూరుజిల్లా పుత్తూరులో టీడీపీ నాయకులు పెడుతున్న అక్రమ కేసులకు స్థానిక సీఐ సాయినాథ్ సహకరిస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా శనివారం వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి సీఐ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. దళితులకు న్యాయం చేయాలంటూ శుక్రవారం పుత్తూరు ఎంపీడీ వో కార్యాలయం వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రోజా ధర్నా చేపట్టగా స్థానిక సీఐ సాయినాథ్ కేసు నమోదు చేశారు.
దీనిని నిరసిస్తూ రోజా శనివారం ధర్నాకు దిగారు. ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు ఈ ఆందోళన జరిగింది. ఈసందర్భంగా రోజా మాట్లాడుతూ టీడీపీ నాయకులతో కుమ్మక్కయిన సీఐ సాయినాథ్ వారిని రెచ్చగొట్టి వారిచే పోటీ ధర్నాలు చేయించి తనపై తప్పుడు కేసుకు కుట్ర పన్నారని ఆరోపించారు. సీఐను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం శుక్రవారం ధర్నా సందర్భంగా తనను దూషిస్తూ, దాడికి ప్రయత్నించిన ఎంపీపీ గెంజి మాధవయ్య, టీడీపీ నాయకులు హరి, డి.జయప్రకాష్, కె.టి.ప్రసాద్‌రెడ్డి, జయకర్, వీరరాఘవులు నాయుడుపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే రోజా లిఖిత పూర్వక ఫిర్యాదును డీఎస్పీ నాగభూషణరావుకు అందజేశారు.
ఆ తర్వాత రోజా విలేకరులతో మాట్లాడుతుండగా అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే వైఎస్సార్‌సీపీ నేతలు హుటాహుటిన ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వెంటనే ఫ్లూయిడ్స్ అందించడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు స్ఫృహలోకి వచ్చారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు.