మాది తమిళనాడు రాష్ట్రం, తిరువళ్లూరు పట్టణం. నా పేరు వీ.బాబు. బాత్‌రూమ్‌లో జారిపడ్డాను. నా ఎడమ చేయి విరిగింది. పుత్తూరు కట్టు గురించి నాకు అవగాహన ఉంది. అందుకే నేరుగా ఇక్కడికే వచ్చి కట్టు కట్టించుకున్నాను. మూడుకట్లు పూర్తయ్యాయి. నొప్పి లేదు. చేయి మామూలు స్థితికి వచ్చింది. ఇక్కడి డాక్టర్ల నైపుణ్యం వెలకట్టలేనిది.
నా పేరు కే.కన్నభిరామ్. మా ఊరు కాంచీపురం, తమిళనాడు రాష్ట్రం. మోటర్ సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాను. నా కుడి కాలు తొడ ఎముక విరిగిపోయింది. మూడో కట్టు కట్టుకోవడానికి వచ్చాను. ఈ కట్టుతో నడవగలుగుతానని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి నొప్పి పూర్తిగా తగ్గింది. ఇక్కడ ఫీజు మేము ఇచ్చినంతే తీసుకుంటున్నారు.
మానవుని శరీరం మొత్తం ఎముకల గూడు. ఏ అవయవానికి దెబ్బతగిలినా ఆ వ్యక్తి విలవిల్లాడాల్సిందే. అలాంటిది ఏకంగా ఎముకే విరిగిపోవడం, కీళ్లు తొలగిపోవడం లాంటివి జరిగితే ఆ వ్యక్తి బాధ వర్ణణాతీతం. ఇలా విరిగిన, తొలగిన ఎముకలను ఎలా అతికించాలి, ఎలా సరిచేయాలి, నడవలేని వ్యక్తిని ఎలా నడిపించాలి..? అన్న ప్రశ్నలకు సమాధానం ‘పుత్తూరు శల్యంవైద్యం’. నేడు ఆధునిక వైద్య విధానాలు వచ్చినా.. పుత్తూరు కట్టు ముందు అన్నీ తీసికట్టు. ఇది రాజులకు లభించిన వరప్రసాదం. పేద రోగులకు ఆరోగ్యప్రదాయం. వందేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్న పుత్తూరు శల్యవైద్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..!
సాక్షి, తిరుపతి: పుత్తూరు శల్యవైద్యం దైవానుగ్రహంగా ‘రాజు’లకు లభించిన వరప్రసాదం. ఇదే విషయాన్ని సూరపరాజు సుబ్బరాజు వంశస్థులు ఈ వైద్యం పుట్టుక గురించి చెబుతుంటారు. పుత్తూరు మండలం, రాచపాళెంలో 1922లో ఈ వైద్యం పురుడుపోసుకుంది. సూరపరాజు సుబ్బరాజు ఓ రోజు అడవిలో వేటకు వెళ్లి వేటాడిన మాంసపు ముక్కలను చెట్ల ఆకుల్లో చుట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఆకుల్లోని ఎముకలు ఒకదానికొకటి అతుక్కొని ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. అదే ఆకులతో ఎముకలు విరిగిన జంతువులకు కట్టుకట్టడం.. ఆ తర్వాత మనుషులకు కట్టుకట్టడం ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు పుత్తూరు శల్య వైద్యం అప్రహితంగా కొనసాగుతోంది. రాచపాళెం గ్రామం నుంచే నేటికీ ఇదే వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు.
శల్య వైద్య విధానం
ఎక్స్‌రే తీయరు. మత్తు మందు ఇవ్వరు. చేతి మునివేళ్లతోనే ఎముక విరిగిందా లేదా గుర్తిస్తారు. తర్వాత తమ రెండు చేతులతో విరిగిన ఎముకలను సరిచేసి కట్ట్టుకడుతారు. ముందుగా తయారుచేసి పెట్టుకున్న ఆకు పసరుకు కాసింత గుడ్డ, రెండు కోడి గుడ్లు తెల్లసొన, రెండు వెదురు దబ్బలే ఈ వైద్యానికి పరికరాలు. ఎముక విరిగిన, తొలగిన భాగాన దూదిని ఉంచి ఆకు పసరు రాసి గుడ్డ చుడుతారు. ఎముక భాగం కదలకుండా వెదురు దబ్బలను పెట్టి కట్టుకడతారు. ఏడు రోజులకు ఒకసారి వంతున మూడు కట్లు కడతారు. అంతే గాయం నయమవుతుంది.
ఇచ్చినంతే ఫీజు
రాచపాళెంలోని ప్రధాన ఆస్పత్రిలో పది రూపాయల రశీదు తీసుకొని లోపలికి వెళితే పది నిమిషాల్లో కట్టు కట్టేస్తారు. తర్వాత రోగి తనకు తోచింది ఇస్తే డాక్టర్ ఫీజుగా తీసుకుంటారు.
పూర్వీకుల వివరాలు
పుత్తూరు శల్యవైద్య వ్యవస్థాపకులు సూరపరాజు సుబ్బరాజు. ఈయనకు నలుగురు తమ్ముళ్లు. వీరిలో ఎస్.మార్కొండేయరాజు, ఎస్.గంగరాజు ఇదే వృత్తిని కొనసాగించారు. ఇంకో ఇద్దరు తమ్ముళ్లు ఎస్.చెంగల్‌రాజు, ఎస్.వెంగమరాజు వైద్య వృత్తికి దూరంగా ఉన్నా, వారి కుమారులైన ఎస్.ప్రకాష్‌రాజు, కన్నయ్యరాజు ఇదే వృత్తిలో కొనసాగారు. గంగరాజు కుమారుడైన ఎస్.కృష్ణమరాజు, మార్కొండేయరాజు కుమారులైన రామరాజు, సుబ్రమణ్యంరాజు ఇదే వృత్తిలో కొనసాగారు. పాత తరంలోని ఎస్.కృష్ణమరాజు, ఎస్.ప్రకాష్‌రాజుతో పాటు సుబ్రమణ్యంరాజు కుమారుడు ఎస్.ప్రతాప్‌రాజు, కన్నయ్యరాజు కుమారుడు ఎస్.బాలసుబ్రమణ్యంరాజు ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రముఖులు ఫిదా!
పుత్తూరు శల్యవైద్యం పొంది ఉపసమనం పొందిన వారిలో మాజీ రాష్ట్రపతులు వీవీ.గిరి, నీలం సంజీవరెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు టీ.అంజయ్య, నందమూరి తారక రామారావు. కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ఉన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వైద్యం పొందిన వారు ఉన్నారు. ఇలా వచ్చిన వారు విజిటర్స్ బుక్‌లో తమ వివరాలను పొందుపరచడం విశేషం.
పేదలకు పూర్తి ఉచితం
మా పూర్వీకుల నుంచి సంక్రమించిన వైద్యమిది. మాది నాల్గోతరం. మా వైద్యంలో సక్సస్ రేటు 99.9 శాతంగా ఉంది. వందేళ్ల చరిత్రే ఇందుకు నిదర్శనం. పేదలతోపాటు పుత్తూరు వాసులకు పూర్తి ఉచిత వైద్య సేవలందిస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నాం. ఆస్పత్రి ఆవరణలోనే 25 గదులను రోగులకు అందుబాటులో ఉంచాం. ఆస్పత్రి సమీపంలోనే టీటీడీ వారిచే మరో 25 గదులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ ఎస్.కృష్ణమరాజు, మేనేజింగ్ డైరెక్టర్, పుత్తూరు శల్యవైద్యశాల
Comments
Please login to add a commentAdd a comment