PWF
-
కూటమికి షాకిచ్చిన వైగో
చెన్నై: ఎండీఎంకే చీఫ్ వైగో తాజాగా ప్రజాసంక్షేమ కూటమి (పీడబ్ల్యూఎఫ్)కి షాక్ ఇచ్చారు. కూటమి నుంచి తప్పుకొంటున్నట్టు ఆయన మంగళవారం ప్రకటించారు. కూటమిలోని కొన్ని పార్టీలతో తమ పార్టీకి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ పార్టీ హైలెవల్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని వైకో తెలిపారు. కూటమి కన్వీనర్ గా ఉన్న వైగోనే ఏకంగా తప్పుకోవడంతో పీడబ్ల్యూఎఫ్ భవిష్యత్తు ఏమిటన్నది అగమ్యగోచరంగా మారింది. మిగతా పార్టీలైనా కూటమిలో కొనసాగుతాయా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిముందే భారీ అంచనాలతో ప్రజాసంక్షేమ కూటమి (పీడబ్ల్యూఎఫ్) ఏర్పడింది. విజయ్ కాంత్ నేతృత్వంలోని డీఎండీకే కూడా కూటమితో జతకలువడంతో అన్నాడీఎంకే, డీఎంకేకు గట్టి ప్రత్నామ్నాయం అన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే, ఎన్నికల్లో కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క అసెంబ్లీ స్థానం కూడా కూటమి గెలువలేకపోయింది. -
ప్రజా సంక్షేమ కూటమికి కెప్టెన్ గుడ్‌బై
చెన్నై: ప్రజా సంక్షేమ కూటమి (పీడబ్ల్యూఎఫ్)కి డీఎండీకే నేత విజయ్ కాంత్ గుడ్‌బై చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆయన సోమవారమిక్కడ ప్రకటించారు. కాగా గత ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన విజయ్ కాంత్ తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజా సంక్షేమ కూటమి(పీడబ్ల్యూపీ)తో జట్టు కట్టిన ఆయన ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయారు. కింగ్ మేకర్ అవుతారనుకున్న 'కెప్టెన్' చివరకు కుదేలయ్యారు. 'అమ్మ' హవాకు కొట్టుకుపోయారు. డీఎంకే ఆహ్వానాన్ని తిరస్కరించి ప్రజా సంక్షేమ కూటమి(పీబ్ల్యూఎఫ్)తో ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్ కాంత్ చివరకు బోర్లా పడ్డారు. పీబ్ల్యూఎఫ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచిన విజయ్ కాంత్ తన సీటు కూడా కాపాడుకోలేకపోయారు. ఉలందూరుపేట నుంచి పోటీ చేసిన కెప్టెన్ డిపాజిట్ కూడా కోల్పోయి మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో డీఎండీకే పార్టీకి కేవలం 2.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 2011లో రిషివాందియమ్, 2006లో విరుదాచలం నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన మూడో పర్యాయం ఎన్నికల్లో భంగపాటుకు గురయిన విషయం తెలిసిందే. -
విజయ్‌కాంత్ పార్టీలో ముసలం
చెన్నై: తమిళనాడులో కెప్టెన్ విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేలో ముసలం మొదలైంది. పీడబ్ల్యూఎఫ్(పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్)తో పొత్తు కుదుర్చుకోవాలన్న విజయ్‌కాంత్ నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు సహా 10 మందిని పార్టీ నుంచి బహిష్కరించారు. ‘వారు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, అప్రతిష్ట తెచ్చారు. పార్టీ పదవులు, ప్రాథమిక సభ్యత్వం నుంచి వారిని తొలగిస్తున్నాం’ అని విజయ్‌కాంత్ మంగళవారం తెలిపారు. అసమ్మతిని సహించబోమని చెప్పడానికే సీనియర్ నేతలపై వేటు వేశారని పార్టీ వర్గాలు చెప్పాయి. అంతకుముందు, పీడబ్ల్యూఎఫ్‌తో పొత్తు వద్దని, కరుణానిధి నేతృత్వంలోని డీఎంకేతో కలసి ఎన్నికల్లో పోటీచేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు సహా పదిమంది సీనియర్ నేతలు విజయ్‌కాంత్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఎమ్మెల్యే, ప్రచార కార్యదర్శి వీసీ చంద్రకుమార్ మాట్లాడుతూ, ‘జయ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పొత్తు నిర్ణయం జరగలేదు. డీఎంకేతో పొత్తుతోటే విజయం సాధ్యమవుతుంది. పీడబ్ల్యూఎఫ్‌తో పొత్తు పార్టీలోని 95 శాతం మందికి ఇష్టం లేదు’ అని అన్నారు. డీఎండీకే 124 స్థానాల్లో, పీడబ్ల్యూఎఫ్ 110 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.