జిల్లాకు క్వాలిటి కంట్రోల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం రాక
భీమవరం టౌన్:
క్వాలిటి కంట్రోల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం జిల్లాకు విచ్చేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన రహితం ఎంత వరకూ అమలు జరుగుతుందో ఈ బందం తనిఖీ చేస్తుంది. ఆరుబయట ఒకటి, రెండు విసర్జన రహిత పట్టణాలు, నగరాలకు ప్రధానమంత్రి చేతుల మీదుగా కేంద్ర పురస్కారం అందించనున్న నేపథ్యంలో స్వచ్చభారత్ మిషన్ మార్గదర్శకాల ప్రకారం కేంద్రబందం జిల్లాలోని పలు పట్టణాలు, నగరాలను సందర్శించనుంది. ఈ బృందం తమ తనిఖీలు నిర్వహించి, పరిశీలన చేసి పూర్తిగా సంతృప్తి చెందితే కేంద్ర పురస్కారానికి సిఫార్సు చేస్తారు.
క్వాలిటి కంట్రోల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం ఈనెల 24వ తేదిన ఏలూరు నగరంలో, 25వ తేదిన నిడదవోలు, 26వ తేదిన భీమవరం, 27వ తేదిన జంగారెడ్డిగూడెం పట్టణాల్లో పర్యటిస్తారు.
బహిరంగ మలవిసర్జన రహితాన్ని పాటించేందుకు గత కొన్ని నెలలుగా నగరపాలక సంస్థలు, మునిసిపాలిటిలు, నగర పంచాయితీలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రతీ ఇంటా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేందుకు కమీషనర్లు, చైర్మన్లు నిమగ్నమయ్యారు. వ్యక్తిగత ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు రూ.15వేలు ఉచితంగా మంజూరు చేస్తుంది. కేంద్ర పురస్కారం అందుకునేందుకు పట్టణాలు, నగరాల్లో నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు, ప్రధాన కూడళ్లలో ప్రజల అవసరార్థం ప్రజా, సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలి. తద్వారా ఆరుబయట బహిరంగ మలమూత్ర విసర్జన రహితాన్ని పాటించగలుగుతారు.
పట్టణం, నగరంలోని ప్రతీ ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలి. బహిరంగ మలమూత్ర విసర్జనా రహిత స్థితిని తెలుపుతూ మునిసిపాలిటిలు, నగరపాలక సంస్థలు, నగరపంచాయితీలు ధవీకరణ పత్రాన్ని స్వచ్చాంద్ర కార్పోరేషన్ ఎండి. డి.మురళీధరరెడ్డికి పంపాలి. ధవీకరణ పత్రం పంపే ముందు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, కుటుంబ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, మునిసిపల్ కౌన్సిలర్లు, నగరపాలక సంస్థ కార్పోరేటర్లు, కోఆప్షన్ సభ్యుల నుంచి తమ పట్టణాలు, నగరాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన రహితాన్ని పాటిస్తున్నామని పొందుపరచాలి. కౌన్సిల్లో ఈ ధవీకరణను ఆమోదించాలి. అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో తెలియచేయాలని ప్రకటించాలి. ఈ నిబంధనలను ఇప్పటికే పలు పట్టణాలు, నగరాలు పూర్తి చేశాయి. తుది డాక్యుమెంటేషన్‌ను స్వచ్చాంద్ర కార్పోరేషన్ ఎండి.డి.మురళీధరరెడ్డికి ఈ మార్గదర్శకాల ప్రకారం పంపించారు. అక్కడి నుంచి స్వచ్చభారత్ కార్పోరేషన్‌కు డాక్యుమెంటేషన్లను పంపించారు. దీంతో క్వాలిటి కంట్రోల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బందం ఆయా పట్టణాలు, నగరాల్లో ఏ మేరకు బహిరంగ మలమూత్ర విసర్జన రహితం అమలు జరుగుతుందో తనిఖీ చేసేందుకు రానున్నారు.